US: ట్రంప్ కంటే ముందే మీరు వచ్చేయండి..విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీల ఆదేశం

Update: 2024-11-24 02:59 GMT

US: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు వల్ల అక్కడ చదువుకునే అంతర్జాతీయ ఉద్యోగులు, పరిశోధకులకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి కారణం గతంలో ట్రంప్ అనుసరించిన విధానాలే అని చెప్పవచ్చు. నాటి అనుభవాలను గుర్తుచేసుకుంటున్న పలు యూనివర్సిటీలు, కాలేజలు ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అమెరికాలో వింటర్ వెకేషన్ వల్ల బయటకు వెళ్లిన విదేశీ విద్యార్ధులు, ఆచార్యలు వెంటనే ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకోవాలని వచ్చే జనవరి రెండో వారం నాటికి క్యాంపస్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి.

రీఎంట్రీ వీసా కలిగి, వింటర్ వెకేషన్ సమయంలో అమెరికా వెలుపల ఉన్నవారు..జనవరి 20న అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టేలోగా తిరిగి రావాలని సూచిస్తున్నారు. స్ట్రింగ్ అకడమిక్ సీజన్ ప్రారంభమయ్యే జనవరి 6లోపు అమెరికాకు రావాలని తమ విద్యార్ధులకు నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ ఆదేశించింది. మసాచుసెట్స్, వెస్లియన్, మిడిల్ టౌన్ వంటి యూనివర్సిటీలు కూడా తమ విద్యార్థులు, విజిటింగ్ స్కాలర్లు, అధ్యాపకులు సిబ్బందికి ఇదే తరమా సూచనలు చేస్తూ లేఖలు రాశాయి. రెండో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇమ్మిగ్రేషన్ కు సంబంధించి ట్రంప్ ఎలాంటి నిబంధనలు అమల్లోకి తీసుకొస్తారోనని వర్సిటీలు ముందస్తు జాగ్రత్తలు పడుతున్నాయి.

2016 ఎన్నికల్లో విజయం సాధించిన మొదటిసారి అధికారంలోకి వచ్చి 2017 జనవరి 20న బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే అమెరికాకు తిరిగివచ్చే అంతర్జాతీయ విద్యార్థులు, ఇతరులపై కొన్ని ఆంక్షలు విధించారు. ఇరాన్ సహా ఏడు ముస్లిం మెజార్టీ దేశాలకు చెందిన విద్యార్థులపై తాత్కాలిక నిషేధం విధించి అమెరికాలోకి ప్రవేశించడం జాప్యం అయ్యే విధంగా నిబంధనలు తీసుకువచ్చారు. అప్పటి అనుభవాన్ని ద్రుష్టిలో పెట్టుకుని అమెరికా యూనివర్సిటీలు, కాలేజీలు ఈసారి ముందే మేల్కుంటున్నాయి. అదే మాదిరి నిషేధాన్ని ట్రంప్ యంత్రాంగం అమల్లోకి తీసుకువస్తుందా అన్న దానిపై ఊహాగానాలు చేయడం లేదని..ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయోనని ముందుగానే సూచలు చేస్తున్నట్లు చెబుతున్నాయి.

ఇక శీతాకాలంలో అమెరికా నుంచి బయటకు వెళ్లినవారు జనవరి 19నాటికి క్యాంపస్ కు తిరిగి రావాలని విద్యార్థులకు వెస్లియన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ విద్యార్థుల వ్యవహారాల ఆఫీసుకు లేఖలు పంపించింది. మొత్తంగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రెండు నెలల ప్రయాణాలకు సంబంధించి మార్పులు సూచిస్తున్నట్లు వర్సిటీల ప్రతినిధులు వెల్లడించారు.

Tags:    

Similar News