Who is Jay Bhattacharya: ఎవరీ జై భట్టాచార్య? ట్రంప్‌ ఆయనను చూసి ఎందుకంత ఇంప్రెస్ అయ్యారు?

Update: 2024-11-28 15:58 GMT

Who is this Jay Bhattacharya and Why Donald Trump impressed with his work: జై భట్టాచార్య.. ప్రస్తుతం అమెరికాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భారతీయులలో ఒకరు. అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న డోనల్డ్ ట్రంప్ తన కేబినెట్‌కు, పరిపాలనకు అవసరమైన వారిని ఒక్కొక్కరిగా నియమిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే జై భట్టాచార్యను అమెరికాలో నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ సంస్థలకు డైరెక్టర్‌గా నియమించారు. భట్టాచార్య ఆరోగ్య శాఖ మానవ సేవల విభాగానికి అధిపతిగా ఉన్న రాబర్ట్ ఎఫ్ కెన్నడి జూనియర్‌తో కలిసి పనిచేయనున్నారని ట్రంప్ ఎక్స్ ద్వారా వెల్లడించారు.

ఆరోగ్య రీత్యా అమెరికా పౌరులు ఎదుర్కొంటున్న పెద్దపెద్ద సవాళ్లకు కెన్నడి జూనియర్, జై భట్టాచార్య ఇద్దరూ కలిసి పరిష్కారాలు కనుక్కుంటారని ఆశిస్తున్నట్లు ట్రంప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ ఇద్దరూ కలిసి అమెరికా నెషనల్ హెల్త్ ఇనిస్టిట్యూట్స్‌కు మళ్లీ పూర్వవైవం తీసుకొస్తారని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

Full View

అమెరికా ప్రభుత్వంలో కీలకమైన పదవుల్లో నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ పొజిషన్ కూడా ఒకటి. అందుకే అమెరికాలో భట్టాచార్య అపాయింట్‌మెంట్‌ అంత హైలైట్ అవుతోంది. అమెరికాలో ఆరోగ్య శాఖ అభివృద్ధికి, వైద్యశాస్త్రంలో పరిశోధనలు, పౌరుల ఆరోగ్య రక్షణ దిశగా జై భట్టాచార్య కృషి చేయనున్నారు. ఇప్పటివరకు అనేక మంది ఇండియన్ అమెరికన్స్ ట్రంప్ కెబినెట్లో చోటు దక్కించుకున్నారు. కానీ పరిపాలన విభాగంలో ఇలా సీనియర్ పొజిషన్‌‌లో అపాయింట్ అయిన ఫస్ట్ ఇండియన్ అమెరికన్ మాత్రం జై భట్టాచార్యనే కావడం గమనార్హం.

ఇంతకీ ఎవరీ జై భట్టాచార్య? ఆయనంటే ట్రంప్‌నకు ఎందుకంత నమ్మకం

జై భట్టాచార్య అంటే డోనల్డ్ ట్రంప్‌నకు ఎందుకంత నమ్మకమో తెలియాలంటే ముందుగా ఆయనెవరో తెలియాలి. 1968లో కోల్‌కతాలో పుట్టిన జై భట్టాచార్య ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో ఎండీ, పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం అదే స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో హెల్త్ పాలసీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అదే కాకుండా అమెరికా నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకమనిక్ రిసెర్చ్‌లో రిసెర్చ్ అసోసియేట్‌గా కొనసాగుతున్నారు. అలాగే, హూవర్ ఇనిస్టిట్యూట్, స్టాన్‌ఫోర్డ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎకనమిక్ పాలసీ రిసెర్చ్ సంస్థల్లో సీనియర్ ఫెల్లోగా పనిచేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే భట్టాచార్య పనిచేసే పరిశోధనలు, సంస్థల జాబితా కూడా చాలా పెద్దదే. అందుకే ఆ రంగంలో ఆయన ఎక్స్‌పర్ట్ అనిపించుకున్నారు.

జై భట్టాచార్య ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్, లీగల్, మెడికల్ పబ్లిక్ హెల్త్, హెల్త్ పాలసీ రంగాల్లో అనేక అకడమిక్ జర్నల్స్ రాశారు. ముఖ్యంగా హెల్ పాలసీలపై భట్టాచార్యకు బాగా పట్టుంది. అందుకే ఆ విషయంలో ఆయనతో ఎవ్వరూ డిబేట్ చేయలేరు అనే పేరుంది. అది కూడా అమెరికాలాంటి అడ్వాన్స్‌డ్ కంట్రీలో ఒక ఇండియన్ అమెరికన్ ఆ పేరు తెచ్చుకోవడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు.

అమెరికా ప్రభుత్వాన్ని విమర్శించి వార్తల్లోకెక్కారు

కరోనావైరస్ వ్యాప్తి సమయంలో అమెరికా ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్, వ్యాక్సిన్ తప్పనిసరి వంటి నిర్ణయాలను భట్టాచార్య బహిరంగంగా విమర్శించారు. రోగ నిరోధక శక్తి లేనివారిని ఈ వైరస్‌ల నుండి కాపాడాలంటే హెర్డ్ ఇమ్యునిటీనే సరైన మార్గం అని సూచించారు. లాక్‌డౌన్ అనేది అన్ని సమయాల్లో పరిష్కారం కాదు.. అది కొందరికి హాని చేస్తుందని తన వాదన వినిపించారు.

ఇదే విషయమై "ది గ్రేట్ బ్యారింగ్టన్ డిక్లరేషన్" పేరుతో ముగ్గురు పరిశోధకులు అమెరికా ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాశారు. 2020 అక్టోబర్‌లో రాసిన ఈ బహిరంగ లేఖ అప్పట్లో ఓ పెను సంచలనం సృష్టించింది. అంతేకాకుండా అనేక చర్చలకు దారితీసింది. ఆ లేఖ రాసిన ముగ్గురు పరిశోధకుల్లో జై భట్టాచార్య కూడా ఒకరు.

ట్రంప్‌ను ఇంప్రెస్ చేసిన భట్టాచార్య వాదనలు

ఇవేకాకుండా అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న హెల్త్ పాలసీల వల్ల జరుగుతున్న నష్టాలను కూడా విడమర్చి చెప్పుకొచ్చారు. అనేక వ్యాసాలు రాశారు. బైడెన్ సర్కారుపై కొన్నిసార్లు కోర్టులో గెలిచారు. ఇంకొన్నిసార్లు కోర్టుల్లో ఓడిపోయారు. కానీ ఆయన వాదనలు అమెరికన్స్‌ను ఆలోచింపజేశాయి. అందుకే భట్టాచార్య డోనల్డ్ ట్రంప్ కంట్లో పడ్డారు. ఇలా గ్రేట్ ఆపర్చునిటీ సొంతం చేసుకున్నారు. దటీజ్ జై భట్టాచార్య.

Tags:    

Similar News