Anmol Bishnoi: ఎన్ఐఏ కళ్లుగప్పి తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను అమెరికా పోలీసులు ఎలా పట్టుకున్నారు?
How US police arrested Lawrence Bishnoi's brother Anmol Bishnoi: ఇండియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన అన్మోల్ బిష్ణోయ్ ఎట్టకేలకు అమెరికాలో అరెస్ట్ అయ్యారు. అన్మోల్ బిష్ణోయ్‌ను సోమవారం అమెరికాలోని కాలిఫోర్నియా పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడే ఈ అన్మోల్ బిష్ణోయ్. లారెన్స్ బిష్ణోయ్ చేసే అన్ని నేరాల్లోనూ అన్మోల్ బిష్ణోయ్ ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. ఇండియాలో ఎన్ఐఏ నమోదు చేసిన 2 కేసులు కలిపి మొత్తం 20 కేసుల్లో అన్మోల్ నిందితుడిగా ఉన్నారు. నాలుగైదు రాష్ట్రాల పోలీసులతో పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా అన్మోయ్ బిష్ణోయ్ ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా ఆయన్ను పట్టిస్తే రూ. 10 లక్షలు నజరానా ఇస్తామని ఎన్ఐఏ రివార్డు కూడా ప్రకటించింది.
ఎన్ఐఏ అధికారులు అన్మోల్ కోసం ఇండియాలో లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఎన్ఐఏ వద్ద ఉన్న సమాచారం ప్రకారం భాను అనే పేరుతో అన్మోల్ ఫేక్ పాస్‌పోర్టు తీసుకుని 2022 మే 15న అమెరికాకు పారిపోయారు. అన్మోల్ అమెరికాలో తలదాచుకున్నాడని తెలిసి ఆయన్ని పట్టివ్వాల్సిందిగా అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. ఎన్ఐఏ కోరికతో ఇంటర్‌పోల్ కూడా అన్మోల్‌పై రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసింది. అంటే ఇండియాలోనే కాదు.. ప్రపంచంలో ఏ మూలన దాగున్నా అన్మోల్ తన ఒరిజినల్ ఐడెంటిటీతో ఎక్కడికీ వెళ్లలేడన్నమాట. మరి ఇండియాలో ఇంతమంది పోలీసులు వెతుకుతున్నా ఎవ్వరి కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్న అన్మోల్‌ను అమెరికా పోలీసులు ఎలా పట్టుకున్నారనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
అమెరికా పోలీసులకు అన్మోల్ ఎలా దొరికారు?
ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఫేక్ డాక్యుమెంట్స్‌పై ప్రయాణిస్తూ అక్కడికి పోలీసులకు పట్టుబడ్డారు. అప్పుడు వారికి కూడా తెలియదు ఆయనే అన్మోల్ అని. ఆయన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న క్రమంలోనే క్యాలిఫోర్నియా పోలీసులకు అసలు విషయం తెలిసింది. తమ కళ్ల ముందున్నది ఎవరో కాదు.. ఇండియన్ గవర్నమెంట్ ఎప్పటి నుండో వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అన్మోల్ బిష్ణోయ్ అని. పైగా అన్మోల్‌పై అప్పటికే ఇంటర్‌పోల్ అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అందుకే అమెరికా పోలీసులు అన్మోల్ అరెస్ట్ సమాచారాన్ని అటు ఇంటర్‌పోల్‌కు, ఇటు ఇండియన్ గవర్నమెంట్‌కు చేరవేశారు. ఇదే విషయమై క్యాలిఫోర్నియా సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ గవర్నమెంట్ అన్మోల్ కోసం ఎక్స్‌ట్రాడిషన్ రిక్వెస్ట్ పెట్టుకునే అవకాశం ఉందన్నారు.
అన్మోల్‌పై నమోదైన కేసులు
2022లో పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసుతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటనలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. కెనడాలో భారత్‌కు వ్యతిరేకంగా అలజడి సృష్టిస్తున్న ఖలిస్తానీ ఉద్యమ నేతలతోనూ అన్మోల్ బిష్ణోయ్‌కు సత్సంబంధాలు ఉన్నాయనే అభియోగాలున్నాయి.
ఇవే కాకుండా ఈ ఏడాది అక్టోబర్ 12న ముంబైలో జరిగిన మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య కేసులో కూడా ఆయనకు సంబంధం ఉందని పోలీసులు ప్రకటించారు. అన్మోల్ బిష్ణోయ్ ఆదేశాలతోనే తాము బాబా సిద్ధిఖిని కాల్చి చంపామని నిందితులు అంగీకరించినట్లుగా ముంబై పోలీసులు తెలిపారు. సిద్ధిఖి హత్యకు ముందు కూడా అన్మోల్‌తో మాట్లాడినట్లుగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శివ కుమార్ గౌతం చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇదే విషయమై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇటీవలె యుఎస్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. అంతేకాకుండా 2 వారాల క్రితమే ముంబై కోర్టు అన్మోల్‌పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఇప్పుడు అన్మోల్‌ని అమెరికా పోలీసులు భారత్‌కు అప్పజెబితే.. ఆయనపై 20 కేసుల్లో పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.