Monkeypox: మంకీపాక్స్‌కు ట్రంప్‌ పేరు పెట్టాలంటూ సూచనలు..

Monkeypox: కరోనా తరువాత ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న వైరస్‌ మంకీపాక్స్‌.

Update: 2022-08-17 16:15 GMT

Monkeypox: మంకీపాక్స్‌కు ట్రంప్‌ పేరు పెట్టాలంటూ సూచనలు..

Monkeypox: కరోనా తరువాత ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న వైరస్‌ మంకీపాక్స్‌. ప్రపంచ వ్యాప్తంగా 31వేల కేసులు నమోదయ్యాయి. పేరులో మంకీ ఉందని కోతులపై దాడులు జరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. దీంతో ఈ వైరస్‌ పేరును మార్చాలని డబ్ల్యూహెచ్‌వో నిర్ణయించింది. ఆ మేరకు కొత్త పేరును సూచించాలని ప్రజలను, వైద్య నిపుణులను కోరింది. దీంతో పలువురి నుంచి స్పందన వస్తోంది. పాక్సీ మెక్పాక్స్‌ పేస్‌, ఎంపాక్స్‌, ఒపొక్సిడ్‌-22, ట్రంప్‌-22 వంటి పేర్లను పలువురు సూచించారు. వైరస్‌కు ట్రంప్‌ పేరును సూచించడంతో ఆసక్తిని రేపుతోంది. అసలు ట్రంప్‌ పేరు పెట్టే అవకాశం ఉందా? అని పలువురు ఆరా తీస్తున్నారు.

మానవాళిని వణికించిన కరోనా వైరస్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి మంకీపాక్స్‌ కొత్త షాక్‌ ఇచ్చింది. ఇప్పటివరకు ఆఫ్రికా ఖండానికే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. 81 దేశాల్లో 31వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మన దేశంలోనూ మొత్తం 9 మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా ఢిల్లీలోనే ఐదు కేసులు నమోదయ్యాయి. మొత్తం 10 మంది వరకు వైరస్‌ బారిన పడి మృతి చెందారు. మృతుల్లో మనదేశానికి చెందిన ఓ యువకుడు కూడా ఉన్నాడు. రోజు రోజుకు వైరస్ విజృంభిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. వైరస్‌లో కొత్త మార్పులను గుర్తించినట్టు తెలిపింది. తాజాగా ఈ వైరస్‌ మనుషుల నుంచి కుక్కలకు సోకుతున్నట్టు ఫ్రాన్స్‌ వైద్యులు గుర్తించారు. అక్కడ ఓ కుక్క పిల్లలో మంకీపాక్స్‌ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వైరస్‌ వ్యాప్తిపై ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఆఫ్రికా అడవుల్లోని కోతుల్లో మొదట ఈ వైరస్‌ను గుర్తించారు. ఈ వ్యాధి ఇతర జంతువుల్లోనూ కనిపిస్తుంది. కానీ మొదట కోతుల్లో గుర్తించినందుకు మంకీపాక్స్‌ అనే పేరు పెట్టారు. నిజానికి కోతుల నుంచి మనుషులకు వైరస్‌ సోకడం చాలా అరుదని నిపుణులు చెబుతున్నారు. ఆఫ్రికా ఖండంలో ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి జంతువులే కారణమంటూ వాటిపై దాడి చేస్తున్నారు. తాజాగా బ్రెజిల్‌లోనూ కోతులపై దాడులు చేయడంతో అవి మృత్యువాతపడుతున్నాయి. ఈ సంఘటలు ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి వచ్చాయి. దీంతో మంకీపాక్స్ పేరును మార్చాలని డబ్ల్యూహెచ్‌వో నిర్ణయించింది. ఆ మేరకు సాధారణంగా వ్యాధులకు డబ్ల్యూహెచ్ టెక్నికల్ కమిటీనే పేరు నిర్ణయిస్తుంది. కానీ, మంకీపాక్స్‌కు తగిన పేరు సూచించాలని ఈసారి ప్రజలు, నిపుణులను కోరింది. దీనికి వైద్య నిపుణులు, ప్రజల నుంచి స్పందన వస్తోంది. 'పాక్సీ మెక్పాక్స్ పేస్', 'ఎంపాక్స్', 'ఒపోక్సిడ్-22' అనే పేర్లు తెరపైకి వచ్చాయి.

అయితే మంకీపాక్స్‌కు ఎక్కువ మంది ట్రంప్‌-22 పేరును సూచించడం ఆసక్తి రేపుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రతిబింబించేలా 'ట్రంప్-22' ఉంది. ట్రంప్ గతంలో కరోనా వైరస్‌ను 'చైనీస్ వైరస్' అని వ్యాఖ్యానించారు. తాజాగా 'ట్రంప్-22' ప్రతిపాదనపై డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. తాము హాస్యాస్పదమైన పేరు పెట్టబోమని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. తమకు వచ్చిన ప్రతిపాదనల్లో శాస్త్రీయ ప్రామాణికత, వాటి ఆమోదయోగ్యత, ఉచ్చారణ, వివిధ భాషల్లో ఉపయోగించవచ్చా? అనే అంశాలను పరిశీలించి కొత్త పేరును ఖరారు చేస్తామని స్పష్టం డబ్ల్యూహెచ్‌వో వివరించింది. అయితే ఇప్పటివరకు ఏ పేరును ఖరారు చేయలేదు. ఇదిలా ఉంటే ప్రధానంగా గే శృంగారంతోనే మంకీపాక్స్‌ మొదలైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబ్ల్యూహెచ్‌వో ప్రకారం మంకీపాక్స్‌ ఇంతకాలం ఆఫ్రికాకే పరిమితమైన వైరస్‌. కానీ, ఈ మధ్య బయటి దేశాల్లోనూ విజృంభిస్తోంది.

మంకీపాక్స్ తొలికేసును 1950లో గుర్తించారు. పరిశోధనల నిమిత్తం కోతులపై ప్రయోగాలు చేస్తున్న క్రమంలో ఈ వైరస్‌ బయటపడింది. అయితే మనుషుల్లో మాత్రం 1970లో కాంగోలో గుర్తించారు. దీన్ని మినీపాక్స్‌ వైరస్‌ పిలుస్తారు. ఇది ఆర్థోపాక్స్‌ వైరస్‌ జాతికి చెందినది. మంకీపాక్స్ ప్రధానంగా ముఖం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆఫ్రికా ఖండంలో నమోదైన వేలాది మంకీపాక్స్ కేసులు చాలావరకు అపరిశుభ్రత, జంతువుల ద్వారానే వ్యాపించింది. శారీరక కలయిత ద్వారా వ్యాపించిన కేసులు చాలా తక్కువ. ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, ముఖంపై దద్దుర్లు, ఒళ్లనొప్పులతో ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలు 2 నుంచి 4 వారాల వరకు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో ఆఫ్రికాలో తప్ప ఇతర దేశాల్లో గతంలో ఎవరూ మృతి చెందలేదు. బ్రెజిల్‌, స్పెయిన్‌లో మరణాలు నమోదవడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్‌ బారిన పడిన వారు ఇతరులకు దూరంగా, సాధారణ ఫ్లూ కోసం తీసుకునే జాగ్రత్తలనే తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

త్వరలోనే మంకీపాక్స్‌కు కొత్త పేరును ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించనున్నది. అయితే ట్రంప్ పేరును ప్రస్తావించడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఇదే సముచితమైనది అంటే మరికొందరు మాత్రం మనుషుల పేర్లు పెట్టడం తగదని వారిస్తున్నారు.  

Tags:    

Similar News