Attack on Pakistan Bus: బస్సుపై కాల్పుల మోత.. 23 మంది దుర్మరణం

Update: 2024-08-26 07:43 GMT

Attack on Bus Passengers in Pakistan : పాకిస్థాన్‌లోని బలుచిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ముసఖేల్ జిల్లాలో రహదారిపై బస్సును ఆపేసిన గుర్తుతెలియని దుండగులు.. ఆ బస్సులో ఉన్న వారిని కిందికి దింపేసి వారిపై కాల్పులకు తెగబడ్డారు. దుండగుల దాడిలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన వారే. బస్సు ప్రయాణికులపై జరిగిన ఈ దాడిపై పాకిస్తాన్‌లో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.

స్థానిక అసిస్టెంట్ కమిషనర్ ముసఖైల్ నజీబ్ కాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం బలుచిస్తాన్‌లో సోమవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటర్-ప్రావిన్సియల్ హైవేపై వచ్చి పోయే వాహనాలను అడ్డుకుంటున్న గుర్తుతెలియని దుండగుల ముఠా ఈ దుశ్చర్యకు పాల్పడింది. దుండగులు అంతా తుపాకులు ధరించి ఉన్నారు.

అదే సమయంలో అటుగా వచ్చిన బస్సును అడ్డుకున్న దుండగులు.. అందులో ఉన్న వారిని కిందకు దిగమన్నారు. ఆ తరువాత వారు ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వారు అని వారి ఐడెంటిని ధృవీకరించుకున్నారు. ఆ తరువాతే వారిపై కాల్పులకు పాల్పడి అతి కిరాతకంగా హతమార్చారు. అంతేకాకుండా వారు అడ్డుకున్న 10 వాహనాలకు నిప్పంటించారు. దీంతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా భయంకరమైన వాతావరణం ఏర్పడింది.

ఈ దుశ్చర్యకు ఇంకా ఎలాంటి తీవ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. ఈ దుర్ఘటనపై స్పందించిన బలుచిస్తాన్ చీఫ్ మినిస్టర్ సర్ఫరాజ్ బుగ్తి.. నిందితులు ఎవరైనా వారికి వదిలే ప్రసక్తి లేదని అన్నారు. మృతుల కుటంబాలకు తన సంతాపం ప్రకటించిన సర్ఫరాజ్.. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఎవ్వరైనా ప్రభుత్వం నుండి తప్పించుకోలేరు అని మండిపడ్డారు.

ఇలాంటి దాడి జరగడం ఇదేం మొదటిసారి కాదు. ఏప్రిల్ నెలలో నోష్కి వద్ద ఇదే తరహాలో బస్సులోంచి ప్రయాణికులను కిందకు దింపేసిన దుండగులు.. 9 మందిని కాల్చిచంపారు. ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయింది కూడా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ వాసులే కావడం గమనార్హం.

Tags:    

Similar News