అమెరికాను వణికిస్తున్న ఒమిక్రాన్ కేసులు.. 5 నుంచి 11 వయసులోని చిన్నారులే అధికం
Omicron Cases in America: 70 శాతం కేసులు 18 నుంచి 49 మధ్య వయసు వారే...
Omicron Cases in America: అమెరికాను కరోనా, ఒమిక్రాన్ కేసులు వణికిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అత్యధికంగా యువత, చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. డిసెంబర్ 22 నుంచి 28 మధ్య లాస్ ఏంజెలెస్ కౌంటీలో నమోదైన కరోనా కేసుల్లో 70 శాతానికి పైగా 18 నుంచి 49 వయసు నుంచే ఉన్నాయి. నెల క్రితంతో పోలిస్తే 18 నుంచి 29 వయసులోని వారు ఇన్ఫెక్షన్ బారిన పడడం 8 రెట్లు పెరిగింది.
30 నుంచి 49 మధ్య వయసున్న వారు నెల క్రితంతో పోలిస్తే ఆరు రెట్లు అధికంగా కరోనా బారినపడుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. క్యాలిఫోర్నియాలో ఆరెంజ్ కౌంటీలో 5 నుంచి 11 మధ్య వయసులోని చిన్నారుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. సౌత్ నెవెడాలో టీనేజీ, యుక్త వయసు వారు కరోనా బారిన పడడం గణనీయంగా పెరిగింది. ప్రతి లక్ష మందికి గాను 45 కేసులు 18 నుంచి 24 వయసు వారే ఉంటున్నారు.
ఇక ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సగటు రేటు 58 శాతం పెరిగింది. చికాగోలోని చిన్న పిల్లల ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా బాగానే పెరిగింది. ఈ వయసులోని వారు పూర్తి స్థాయిలో టీకాలను తీసుకోకపోవడమే కారణమై ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారంలోనే అమెరికాలో కేసుల సంఖ్య 25 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.