New Zealand: పార్లమెంట్‌లో బిల్లును చింపి... డ్యాన్స్ చేస్తూ మహిళా ఎంపీ నిరసన... వీడియో వైరల్
New Zealand: అసెంబ్లీలో, పార్లమెంటులో గొడవలు, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం సాధారణమైపోయింది.
New Zealand: అసెంబ్లీలో, పార్లమెంటులో గొడవలు, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం సాధారణమైపోయింది. ఏ విషయంపైనైనా చర్చించే సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఇలాంటి ఘటనలు మనం చూస్తుంటాం. కానీ న్యూజిలాండ్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఓ మహిళ డ్యాన్స్ చేసి నిరసన తెలిపారు. దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
న్యూజిలాండ్‌కు చెందిన యువ మహిళా ఎంపీ హనా రాహితి మైపి క్లార్క్ వినూత్న రీతిలో పార్లమెంట్‌లో నిరసన తెలిపారు. 22 ఏళ్ల మైపి క్లార్క్ మారోరి తెగకు చెందిన మహిళ. అయితే ట్రీటీ ప్రిన్సిపాల్స్ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఆమె నిరసనకు దిగారు. వివాదాస్పద ఆ బిల్లును రెండు ముక్కలుగా చించారు. ఆ తర్వాత ఆమె సంప్రదాయ మావోరి నృత్యం చేశారు. ఆ మహిళా ఎంపీతో పాటు మరికొందరు సభ్యులు, గ్యాలరీలో ఉన్నవారు డ్యాన్స్ చేశారు.
బ్రిటీష్, స్వదేశీ మావోరీల మధ్య 184 ఏళ్ల నాటి ఒప్పందాన్ని పునర్నిర్వచించే స్వదేశీ ఒప్పంద బిల్లును గురువారం న్యూజిలాండ్ పార్లమెంట్‌లో అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపై ఓటింగ్ జరిగింది. ఈ సమయంలో హనా రాహితితో పాటు మావోరీ తెగకు చెందిన ఎంపీలు ఈ బిల్లు కాపీలను చించేశారు. ఈ సందర్భంగా వారి సీట్లలో నుంచి లేచి నాట్యం చేస్తూ తమ నిరసనను తెలిపారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ బిల్లుకు సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది.
1840 వైతాంగి ఒప్పందంలో నిర్దేశించిన సూత్రాల ప్రకారం బ్రిటీష్ వారికి పాలనను అప్పగించినందుకు ప్రతిగా గిరిజనులకు వారి భూములను నిలుపుకోవడానికి వారి ప్రయోజనాలను పరిరక్షించడానికి విస్తృత హక్కులను కల్పించారు. ఈ సమయంలో ఆ హక్కులను న్యూజిలాండ్ దేశస్తులందరికీ వర్తింపజేయాలని బిల్లులో చేర్చారు. ఈ బిల్లు కారణంగా జాతి వైషమ్యాలకు, రాజ్యాంగ విధ్వంసానికి ముప్పు కలుగుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 5.3 మిలియన్ల న్యూజిలాండ్ జనాభాలో 20 శాతం మంది వరకు మావోరీలు ఉన్నారు. వారంతా ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
హనా రౌహితి అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా రికార్డు సృష్టించారు. ఆమె గత ఏడాది అక్టోబర్‌లో నానాయా మహుతా నుంచి పోటీ చేసి పార్లమెంటు కు ఎన్నికయ్యారు. తన తొలి ప్రసంగం సందర్బంగా పార్లమెంటులో తన మాతృభాష మావోరీలో ఆమె చేసిన ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించారు.