బ్రిటన్‌ ప్రధానమంత్రి ఎవరో ముందే కన్ఫామ్.. లిజ్‌ ట్రస్‌ వెనుక కథ నడిపించిన బోరిస్‌ జాన్సన్‌

UK Prime Minister: బ్రిటన్‌ ప్రధాని ఎన్నిక పోలింగ్‌ ముగిసింది.

Update: 2022-09-02 11:59 GMT

బ్రిటన్‌ ప్రధానమంత్రి ఎవరో ముందే కన్ఫామ్.. లిజ్‌ ట్రస్‌ వెనుక కథ నడిపించిన బోరిస్‌ జాన్సన్‌

UK Prime Minister: బ్రిటన్‌ ప్రధాని ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు తమ ఓటును కొందరు పోస్టల్‌లో, మరి కొందరు ఆన్‌లైన్‌లో వేశారు. 5న ఫలితం వెలువడనున్నది. ప్రధాని ఎవరని టోరీ నేతలు మాత్రం చర్చించుకోవడం లేదు. ఎందుకంటే వారంతా ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో ఫిక్స్‌ అయినట్టు తెలుస్తోంది. ప్రధాని ఎన్నిక ప్రచారంలో అభ్యర్థులు మాత్రమే పాల్గొనలేదు. పరోక్షంగా మరొకరు కూడా ప్రచారం ఉధృతంగా చేశారు ఆ ఒక్కరు ఎవరంటే తాత్కాలిక ప్రధాని బోరిస్‌ జాన్సన్‌. అతడికి తప్ప ఎవరికైనా ఓటేయండన్న బోరిస్‌ సూచనలు నిజం కానున్నట్టు తెలుస్తోంది. టోరీ నేతలు ఎవరికి ఓటేయాలో ఇప్పటికే ఇన్‌స్ట్రక్షన్స్‌ వెళ్లాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధాని అభ్యర్థుల చివరి డిబేట్‌కు హాజరైన టోరీ నేతలను చూసినా ఇట్టే అర్థమైపోతోంది ఇంతకు ప్రధాని ఎవరు? ఇంటికి వెళ్లే నేత ఎవరు?

బ్రిటన్‌ ప్రధాని ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. 2 లక్షల మంది టోరీ సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రధాని ఎవరో వారి ఓట్లు తేల్చనున్నాయి. ప్రధాని అభ్యర్థుల చివరి డిబేట్‌పై టోరీ నేతల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. దీంతో ఇప్పటికే టోరీ సభ్యులు ప్రధాని ఎవరో ఫిక్స్‌ అయినట్టు తెలుస్తోంది. అందుకు పరోక్షంగా ఇన్‌స్ట్రక్షన్స్‌ వెళ్లినట్టు జోరుగా ప్రచారం అవుతోంది. తాత్కాలిక ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రతీకారం తీర్చుకున్నాడన్న చర్చ సాగుతోంది. అతడికి తప్ప ఇంకెవరికైనా ఓటేయండని గతంలో బోరిస్‌ పలువురు టోరీ నేతలకు, తన సన్నిహితులకు సూచనలు చేసినట్టు కథనాలు వచ్చాయి. ఇప్పుడు అవి నిజం కానున్నాయా? అంటే రాజకీయ విశ్లేషకులు ఔననే సమాధానాలు చెబుతున్నారు. 10 డౌన్‌ స్ట్రీట్‌ నుంచి తాను వెళ్లిపోయేలా చేసిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చేయాలని శపథం పన్నాడట ఆమేరకు చాపకింది నీరులా తన అనుచరులకు రహస్యంగా పిలుపు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో టోరీ నేతలు అందుకు అనుగుణంగా ప్రధానికి ఓటేసినట్టు సమాచారం. దీంతో ప్రధాని ఎవరే చర్చ కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టోరీ పార్టీ చీఫ్‌, ప్రధానమంత్రి ఎవరు కానున్నారో ఇప్పటికే అర్థమైందని అంటున్నారు. అంటే సర్వేలు వెల్లడించిన ఫలితాలే నిజం కానున్నాయా? రిషిపై లిజ్‌ ట్రస్‌ ఆధిక్యం సాధిస్తుందా?

ప్రధాని ఎన్నిక ప్రక్రియ ప్రారంభం నుంచి జరిగిన వివిధ దశల పోలింగ్‌లో మాజీ ఆర్థిక శాఖ మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునక్‌ ఆధిక్యం కనబరిచారు. విదేశాంగ శాఖ మంత్రి లిజ్‌ ట్రస్‌ అనూహ్యంగా టోరీ ఎంపీల చివరి రౌండ్‌లో దూసుకొచ్చింది. అంతకుముందు ఆమె పోటీలో ఉందన్నమాటే కానీ పెద్దగా ఆధిక్యం కనబరచలేదు. అయితే ఆమెకు బోరిస్‌ జాన్సన్‌ ఆశీస్సులు లభించడం ప్లస్‌ పాయింట్‌గా మారింది. ప్రారంభంలో రిషి సునక్‌ ఆధిక్యంలో ఉన్నారు. అయితే టోరీ నేతలు లిజ్‌ ట్రస్‌ వైపే మొగ్గు చూపుతున్నట్టు సర్వేలన్నీ చెప్పాయి. నిజం చెప్పాలంటే మొదటి నుంచి రిషికి సర్వేలు వ్యతిరేకంగానే వచ్చాయి. అయినా రిషి ఇప్పటివరకు తనే ఆధిక్యం కనబరిచాడు. ఇప్పటివరకు కేవలం పార్టీ ఎంపీలు ఓటేశారు. కానీ చివరి రౌండ్లో మాత్రం పార్టీ సభ్యులు అభ్యర్థులకు ఓటేసి తమ నాయకుడిని నిర్ణయించనున్నారు. ఆ నాయకుడే ప్రధానమంత్రి కానున్నారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. పార్టీపై ఇప్పటికీ పట్టున్న బోరిస్‌ జాన్సన్‌ పరోక్షంగా ఎవరికి ఓటేయాలో సూచించినట్టు కన్జర్వేటివ్ నేతలు అంతర్గతంగా చెప్పుకుంటున్నారట. ఫలానా వ్యక్తికే ఓటేయాలని బోరిస్‌ సూచనను ప్రస్తావిస్తున్నారట. లండన్‌లో ప్రధాని ఎవరనేదాని కంటే బోరిస్‌ సూచనలపైనే ఎక్కువగా చర్చ జరుతున్నట్టు తెలుస్తోంది.

నిజానికి రిషి సునక్‌, బోరిస్‌ జాన్సన్‌ అత్యంత సన్నిహితులు బ్రెగ్జిట్‌ ఉద్యమంలో బోరిస్‌తో పాటు రిషి కలిసి పోరాడారు. ఆ తరువాత బోరిస్‌ ప్రధాని అయిన తరువాత. రిషికి ప్రత్యేకంగా ఆర్థిక శాఖను కట్టబెట్టాడు. అయితే ప్రధానిగా బోరిస్‌ తీసుకున్న నిర్ణయాలు, వ్యవహారాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కరోనా సమయంలో దేశమంతటా లాక్‌డౌన్ విధించిన వేళ బర్త్‌డే పార్టీ చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ తరువాత లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న క్రిస్‌ పిన్చర్‌కు డిప్యూటీ విప్‌ పదవిని కట్టబెట్టడం వివాదానికి దారితీసింది. దీంతో అప్పటికే బోరిస్‌పై గుర్రుగా ఉన్న పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని పదవికి బోరిస్‌ రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. జాన్సన్‌ దిగిపోకపోతే తాము రాజీనామా చేస్తామంటూ బెదిరించారు. అదే సమయంలో అందరికంటే ముందు రిషి సునక్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో నాయకులందరూ వరుసబెట్టి రాజీనామా చేశారు. ఆ ఒత్తిడితో బోరిస్‌ గత్యంతరం లేక రాజీనామా చేశారు.

తాను పదవిని కోల్పోవడానికి రిషి సునాకే కారణమంటూ బోరిస్‌ జాన్సన్ రగిలిపోయారు. ఇంటా బయటా.. తన పరువు పోయిందని పగ పెంచుకున్నారు. తాను కోల్పోయిన పదవిని రిషికి దక్కకూడదని భావిస్తున్నారు. ఒకప్పుడు వెన్నంటే ఉన్న రిషినే గోతులు తవ్వినట్టు బోరిస్‌ ఉడికిపోతున్నారు. నిజానికి బోరిస్‌ వివాదాలే ఆయన కొంప ముంచాయి. ఆ విషయాన్ని విస్మరించి ఆ నెపాన్ని రిషి మీదకు నెట్టేస్తున్నారు. రిషినే వెన్నుపోటు పొడిచినట్టు బోరిస్‌ వర్గం ప్రచారం చేస్తోంది. లిజ్‌ ట్రస్‌కు అనుకూలంగా కాంపెయిన్‌ చేస్తున్నది. దీంతో బోరిస్‌ జాన్సన్‌కు అనుకూలంగా ఉన్న నేతలంతా ఇప్పుడు లిజ్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఆమె విధానాలను కొనియాడుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి బోరిస్‌ జాన్సన్‌ తన కాల్స్‌, మెస్సేజెస్‌కు స్పందించడం లేదట. ఇటీవల ఇంగ్లాండ్‌లోని చెల్టెన్‌హామ్‌లోని టోరీ పార్టీ సభ్యలతో చర్చలో రిషి పాల్గొన్నారు. జాన్సన్‌ తనతో మాట్లాడడం లేదని స్పష్టం చేశారు. దీంతో రిషిపై మాజీ టోరీ చీఫ్‌ కక్ష కట్టారన్నది నిర్ధారణ అయ్యింది. వేల్స్ పర్యటనలో బోరిస్‌ జాన్సన్‌కు సునాక్‌ సందేశాలు, ఫోన్‌ కాల్స్‌ విషయమై ప్రశ్నలు ఎదరయ్యాయి. అయితే బోరిస్‌ వాటిని దాటవేశారు.

భారతీయ సంతతికి చెందిన రిషి హిందువు కావడం, బ్రౌన్‌ రంగు కూడా కన్జర్వేటివ్‌ నేతల్లో వ్యతిరేకత ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు రిషి సునక్‌ భార్య అక్షతా మూర్తి అత్యంత ధనికురాలు కావడం, అత్యధిక పన్నులు చెల్లిస్తున్న విషయాలను ప్రత్యర్థి వర్గం అస్త్రంగా మలుచుకుంది. ఇవి టోరీ పార్టీ సభ్యులపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ లిజ్‌ ట్రస్‌ గెలిస్తే రిషి ఏం చేయనున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లిజ్‌ ట్రస్‌ విధానాలపై విమర్శలు గుప్పించిన రిషి ఆమె ఆధ్వర్యంలోని కేబినెట్‌లో మంత్రి పదవి దక్కే అవకాశం లేదు. అయితే ఎంపీగా మాత్రం ఇదివరకటిలా ఉండలేరని విశ్లేషకులు చెబుతున్నారు.

ఒకవేళ టోరీ సభ్యులు అనూహ్యంగా ట్విస్ట్‌ ఇస్తే మాత్రం లిజ్‌ ట్రస్‌, బోరిస్‌ జాన్సన్‌ పార్లమెంట్‌లో ఏదో ఒక మూలన కూర్చునే అవకాశం ఉంది. పార్టీలో వారి పరిస్థితి గందరగోళంగా మారే పరిస్థితి నెలకొన్నది. అయితే టోరీ సభ్యుల తీర్పు ఎలా ఉండబోతోందో 5న తేలనున్నది. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. అనంతరం గెలిచిన అభ్యర్థి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారణం చేయనున్నారు.

Tags:    

Similar News