North Korea: తగ్గేదే లేదంటున్న కిమ్.. వరసగా 8 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం..
North Korea: సీతయ్య అయినా.. ఎవరి మాటైనా వింటాడేమో... కానీ.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం ఎవరి మాటా వినడు.
North Korea: సీతయ్య అయినా.. ఎవరి మాటైనా వింటాడేమో... కానీ.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం ఎవరి మాటా వినడు. దేశ ప్రజలను కరోనా బారిన పడి... విలవిలలాడుతున్నారు. సరైన మందులు లేక.. కరోనా వచ్చినా.. ఉప్పునీళ్లను పుక్కిలించి.. ప్రాణాలను నిలబెట్టుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. దేశ్యవాప్తంగా విధించి లాక్‌డౌన్ కారణంగా ఆహారం లేక.. ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. కిమ్‌కు మాత్రం ఇవేవీ పట్టడం లేదు. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లోనూ అణు పరీక్షలను నిర్వహిస్తున్నారు. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌కు సమీపంలోని సునాన్ ప్రాంతంలో తాజాగా స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించినట్టు సియోల్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ ప్రకటించారు.
వైరస్ విజృంభించినప్పటి నుంచి ఇప్పటివరకు కిమ్ దేశంలో 30 లక్షల మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం 79వేల 100 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేవలం 70 మంది మాత్రమే మృతి చెందారు. అభివృద్ధి చెందిన అతి పెద్ద దేశాలకే కరోనాను కట్టడి చేయడం సాధ్యం కాలేదు. కానీ కిమ్ ప్రభుత్వం కట్టడి చేయడంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలే ఉత్తర కొరియన్లలో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ. పైగా వారు టీకాలు కూడా తీసుకోలేదు. అయితే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంపై కిమ్‌లో ఎలాంటి ఊరట కనిపించలేదు. ఇప్పటికే లాక్‌డౌన్ అమలులో ఉన్నా మరిన్ని కఠిన నిబంధనలు కిమ్ విధించారు. అసలు కేసులు తగ్గుతుంటే ఇంకా కఠిన నిర్ణయాలు ఎందుకని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అంటే కేసులు భారీగా నమోదవుతున్నా... కిమ్ ప్రభుత్వం దాచిపెడుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా భారీగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు అవాక్కయ్యే విషయం ఏమిటంటే ఇప్పటికీ దేశంలో నమోదవుతున్న కేసులను కరోనాగా ప్రకటించకపోడమే.
కరోనా విజృభిస్తున్నా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మాత్రం కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. రోగులకు సరిపడా మందులు అందుబాటులో లేవు. ఉప్పు నీటితో పుక్కిలిస్తే.. చాలని కరోనా బాధితులకు కిమ్ సలహా ఇచ్చారు. కరోనాతో ఎంత మంది మృతి చెందుతున్నారో కిమ్ ప్రభుత్వం చెప్పడం లేదు. ఇప్పటివరకు అస్వస్థతకు గురైన వారికి ఎలాంటి చికిత్స నిర్వహిస్తున్నారో కూడా తెలియడం లేదు. మరోవైపు లాక్‌డౌన్‌తో ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. ఆహారం లేక.. ఆకలి కేకలతో విలవిలలాడుతున్నారు. ఉత్తర కొరియాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. అయినా అధ్యక్షుడు కిమ్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా లక్ష్యంగా నిత్యం కయ్యానికి కాలుదువుతున్న కిమ్ తన లక్ష్యం అణుపరీక్షలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. విపత్కర పరిణామాల్లోనూ తగ్గేదే లేదంటూ వరుస అణు పరీక్షలను చేపడుతున్నారు. ఊహించనంత అధికంగా ఈ ఏడాది ఉత్తర కొరియా క్షిపణులను నిర్వహిస్తోంది.
ఉత్తర కొరియాలోని తూర్పున సముద్ర తీరంలో తాజాగా 8 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో సునాన్ ప్రాంతం నుంచి ఈ క్షిపణలును ప్రయోగించినట్టు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. పది రోజుల క్రితం అంటే.. మే 25న అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆసియా పర్యటన ముగించిన తరువాత కూడా మూడు అణు పరీక్షలను నిర్వహించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఉత్తర కొరియా 18 సార్లు క్షిపణ పరీక్షలను చేపట్టింది. వాటిలో అతి పెద్ద ఖండాంతర క్షిపణి-ICBMతో సహా పలు రకాల మిస్సైళ్లు ఉన్నాయి. దక్షిణ కొరియా, అమెరికా మధ్య మొదటి ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు ముగిసిన మర్నాడే ఉత్తర కొరియా అణు క్షిపణులను ప్రయోగించి దక్షిణ కొరియాను పరోక్షంగా హెచ్చరించినట్టు అయింది. తాజాగా ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని జపాన్ నిర్ధారించగా రష్యా, చైనా మాత్రం విభేదించాయి.
కిమ్ చర్యలతో దక్షిణ కొరియా, జపాన్, భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే అణు పరీక్షలతో ఐక్యరాజ్యసమితి, అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు కిమ్ ప్రయత్నిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఉత్తర కొరియాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసేలా చేయాలనే కిమ్ ఉద్దేశమని వివరిస్తున్నారు. కిమ్ దేశంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.. ఆ దేశ ప్రజలు పేదరికంతో అల్లాడుతున్నారు. తినడానికి సరిగ్గా తిండి కూడా దొరకని పరిస్థితి నెలకొన్నది. అభివృద్ధి అంటే.. కిమ్ తండ్రి, తాతల స్మరిస్తూ.. పొగడడమే అని మాత్రమే ఉత్తర కొరియన్లు భావిస్తున్నారు. కిమ్ మాత్రం ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా పొరుగు దేశాలతో పాటు అమెరికాను భయపెట్టేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రపంచమంతా ఓ వైపు పయనిస్తుంటే.. ఉత్తర కొరియా మాత్రం మరోవైపు వెళ్తోంది. నియంతృత్వంతో ప్రజలను కఠిన చట్టాలతో కిమ్ అణిచివేస్తున్నారు.
ప్రజలు కరోనా, ఆకలితో అల్లాడుతున్నా కిమ్ అణు పరీక్షలు నిర్వహించడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ దేశ ప్రజలు ఎలాంటి పరిస్థితులను అనుభవిస్తున్నారోనని పలువురు నిపుణులు వాపోతున్నారు. కిమ్ పంతం వీడి.. కనీసం కరోనా కిట్లు, మందులను తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అయిన కిమ్ మాత్రం పట్టించుకోవడం లేదు.