North Korea: కరోనాను కంట్రోల్ చేసిన కిమ్
North Korea: లక్షల నుంచి వేలకు తగ్గిన కేసులు
North Korea: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దెబ్బకు కరోనా వణికిపోయింది. ప్రారంభంలో నిత్యం లక్షలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ తరువాత ఉత్తర కొరియాకు చెందిన కొవిడ్‌పై ఎలాంటి సమాచారం లేదు. ఉత్తర కొరియన్లు ఎలాంటి టీకాలు తీసుకోలేదు. పైగా పేదరికంతో ప్రజల్లో రోగ నిరోధక శక్తి కూడా అంతంత మాత్రమే. అయినా ఆ దేశంలో ఇప్పటివరకు మరణించింది కేవలం 69 మంది మాత్రమే దీంతో అందరిలోనూ కిమ్ రాజ్యంలోని కోవిడ్‌పై నుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన ఇమేజ్ కోసం వాస్తవాలను కిమ్ దాచిపెడుతున్నారమేనని నిపుణులు సందేహిస్తున్నారు. వేగంగా విజృంభించే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు తగ్గడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కోవిడ్‌కు టీకా రాకముందు వరకు ప్రపంచ దేశాలు వైరస్ దాడికి విలవిలలాడాయి. ఏదైనా మందు వస్తుందా? అని ఆత్రంగా ఎదురుచూశాయి. ఆ తరువాత రోగ నిరోధక శక్తిని పెంచే టీకా రావడంతో పలు దేశాలు ఊరటపొందాయి. టీకా తీసుకున్న తరువాత వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ వేరియంట్ దాడి చేసినా ప్రజలు తట్టుకోగలిగారు. మరణాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. కానీ పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ మాత్రం ఇప్పటికీ విలవిలలాడిస్తోంది. వ్యాక్సినులు ఇచ్చినా విజృంభిస్తున్న ఒమిక్రాన్‌ను కట్టడికి చేయడానికి చైనా అష్టకష్టాలు పడుతోంది. ఒక్కరికి పాజిటివ్ అని వచ్చినా ఏకంగా ఆ కాలనీనే క్వారంటైన్‌కు చైనా పంపుతోంది. వేల సంఖ్యలో నమోదైన కేసులకే చైనాలో పదుల సంఖ్యలో మృతతి చెందారు. ఒమిక్రాన్ పరిస్థితి ఇలా ఉంటే చిత్రంగా ఉత్తర కొరియాలో మాత్రం కిమ్ దెబ్బకు ఒమిక్రాన్ వణికి పోయింది. లక్షలాది మంది ఉత్తర కొరియన్లకు సోకిన ఒమిక్రాన్ వారిని విడిచిపెట్టి పారిపోతోంది. ప్రారంభంలో నిత్యం 6 లక్షల నుంచి 7 లక్షల కేసులు నమోదయ్యేవి అలాంటిది ఇప్పుడు ఆ ఊసే లేదు.
వైరస్ విజృంభించినప్పటి నుంచి ఇప్పటివరకు కిమ్ దేశంలో 30 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం 89వేల 500 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేవలం 69 మంది మాత్రమే మృతి చెందారు. అభివృద్ధి చెందిన అతి పెద్ద దేశాలకే కరోనాను కట్టడి చేయడం సాధ్యం కాలేదు. కానీ కిమ్ ప్రభుత్వం కట్టడి చేయడంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలే ఉత్తర కొరియన్లలో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ. పైగా వారు టీకాలు కూడా తీసుకోలేదు. అయినా కిమ్ దేశంలో కేసులు తగ్గడమేమిటంటూ వైద్య నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంపై కిమ్‌లో ఎలాంటి ఊరట కనిపించలేదు. ఇప్పటికే లాక్‌డౌన్ అమలులో ఉన్న ఆ దేశంలో మరిన్ని కఠిన నిబంధనలు విధించాలని కిమ్ నిర్ణయం తీసుకున్నారు. అసలు కేసులు తగ్గుతుంటే.. ఇంకా కఠిన నిర్ణయాలు ఎందుకని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అంటే కేసులు భారీగా నమోదవుతున్నా కిమ్ ప్రభుత్వం దాచిపెడుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా భారీగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు అవాక్కయ్యే విషయం ఏమిటంటే ఇప్పటికీ దేశంలో నమోదవుతున్న కేసులను కరోనాగా ప్రకటించకపోడమే.
ఉత్తర కొరియాలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్నట్టు మే 12న కిమ్ ప్రభుత్వం అంగీకరించింది. కిమ్ మాస్క్ ధరించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ నమోదవుతున్న కేసులన్నీ కేవలం జ్వరం భారిన పడుతున్నట్టు కిమ్ ప్రభుత్వం చెబుతోంది. తనకు రాజకీయంగా నష్టం కలగకుండా కేసులు సంఖ్య, మరణాలు దాస్తున్నట్టు నిపుణులు అనుమానిస్తున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నది. వ్యవసాయ, నిర్మాణ, ఇతర పారిశ్రామిక కార్యకలాపాలకు కిమ్ ప్రభుత్వం అనుమతిస్తోంది. మరోవైపు కేసుల వివరాలను ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరినా కిమ్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. కిమ్ ఇలాగే వివరాలను దాచిపెడితే అతడి అధికారంపైనే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల చైనాలోనూ జిన్‌పింగ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. జీరో కోవిడ్‌తో ఏకంగా జిన్‌పింగ్ పదవికే ఎసరు వచ్చేలా ఉంది.
నిత్యం అణు పరీక్షలను నిర్వహిస్తూ ప్రపంచాన్ని ఉత్తర కొరియా అధ్యక్షడు కిమ్ జోంగ్ ఉన్ గడగడలాడిస్తున్నారు. దేశంలో పేదరికం విలయతాండవం ఆడుతున్నా అమెరికాతో మాత్రం కయ్యానికి కాలు దువ్వుతుంటారు. తాజాగా కరోనా కేసులు నమోదవడంతో ఇక నిషేధిత ఆయుధ ప్రయోగాలకు బ్రేక్ పడొచ్చని నిపుణులు అంచనా వేశారు. కానీ కిమ్ మాత్రం తాను మారనని ప్రపంచానికి చాటి చెప్పారు. కరోనా విజృంభిస్తున్నా అణుపరీక్షలను నిర్వహించారు. ఈ ఏడాది ప్యాంగాంగ్‌లో ఇప్పటివరకు డజనుకు పైగా అణ్వాయుధ పరీక్షలను ఉత్తర కొరియా నిర్వహించింది. 2017 తరువాత తొలిసారి పూర్తి స్థాయి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియా మరిన్ని అణుపరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు ఇటీవల అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.ఉత్తర కొరియన్ల కష్టాలు బయటి ప్రపంచానికి తెలియవు. అక్కడి మీడియా కూడా కిమ్ కనుసైగల్లోనే నడుస్తాయి. దీంతో ఉత్తర కొరియాలో ఎం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొన్నది.