Kamala Harris: అమ్మకానికి అమెరికా ఉపాధ్యక్షురాలి ఇల్లు
అత్యంత అధునాతన సౌకర్యాలతో ఉన్న ఈ ఇంటిని 799 వేల డాలర్లకు విక్రయించనున్నారు.
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన కమల హ్యారీస్ శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన ఇంటిని అమ్మకానికి పెట్టింది. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక ప్రచురించింది. అత్యంత అధునాతన సౌకర్యాలతో ఉన్న ఈ ఇంటిని 799 వేల డాలర్లకు (మన కరెన్సీలో సుమారు రూ.5.79 కోట్లకు) విక్రయించనున్నారు. ఇంటిని అమ్మే బాధ్యతను ఓ వెబ్‌సైట్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ భవనంతో 17 ఏళ్ల అనుబంధం ఉందని తెలిపింది.
శాన్‌ఫ్రాన్సిస్కోలోని సౌతాఫ్ మార్కెట్‌లో ఓ అపార్ట్‌మెంట్ పై అంతస్తులో కమలా హ్యారీస్‌కు అపార్ట్‌మెంట్ ఉంది. 2004లో దీన్ని కొనుగోలు చేశారు. అప్పట్లో 489,000 డాలర్లకు ఆమె కొనుగోలు చేయగా.. ఇప్పుడు 799,000 డాలర్లకు అమ్మాలని నిర్ణయించింది. అధునాతన సౌకర్యాలు.. మంచి ఫర్నీషింగ్‌తో పాటు, ఈ ఇంటిలో ఓ చిన్నపాటి కార్యాలయం కొనసాగించేందుకు కూడా అవకాశం ఉందని జిల్లో వెబ్ సైట్ ఇంటికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.
కమల హ్యారీస్ ఉపాధ్యక్షురాలు కావడంతో వాషింగ్టన్‌కు మకాం మార్చారు. ప్రస్తుతం ఉపాధ్యక్షుల అధికారిక నివాసం నంబర్ వన్ అబ్జర్వేరీ సర్కిల్‌కు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతానికి కమలా హ్యారీస్ శ్వేతసౌధం సమీపంలోని బ్లెయిర్ హౌజ్‌లో నివసిస్తున్నారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే అధికారిక నివాసంలోకి ఆమె వెళ్లనున్నారు.