ట్రంప్‌పై 40 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుస్తాం : బైడెన్
మరోవైపు వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -ఓటమిని అంగీకరించడానికి సుముఖత చూపలేదు. శుక్రవారం తన సహాయకులు, సలహాదార్లు, పార్టీ నేతలతో సమావేశమై ఆయన అన్ని అంశాలనూ చర్చించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపు దాదాపు ఖరారైంది. హోరాహోరీగా జరిగిన పోరులో అనూహ్యంగా బైడెన్ దూసుకొచ్చారు. ప్రస్తుతం ట్రంప్‌కు 214 ఓట్లు రాగా.. బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లతో ముందంజలో ఉన్నారు. దీంతో అమెరికా 46వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 538 ఓట్లున్న ఎలక్టోరల్ ఓట్లతో మేజిక్ ఫిగర్ 270కి చేరువగా గురువారమే వచ్చేసిన ఆయన మరో రెండు స్వింగ్ రాష్ట్రాలు- జార్జియా, పెన్సిల్వేనియాల్లో అనూహ్యంగా దూసుకొచ్చారు. ఆధిక్యం స్వల్పమే అయినా విజయం ఆయనకే దక్కే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా 20 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియాను గనక గెలిచేస్తే అధ్యక్ష పీఠం ఆయనదే.
మరోవైపు పెన్సిల్వేనియాలో గెలిస్తే- బైడెన్ లీడ్ 270 సంఖ్యను దాటిపోతుంది. ఇవే కాక- జార్జియాలో కూడా బైడెన్ ఆధిక్యంలోకొచ్చారు. అయితే ఆధిక్యత 1096 ఓట్లు మాత్రమే. ఇది సంప్రదాయకంగా రిపబ్లికన్ కంచుకోట. ఇది చేజారుతోందని గ్రహించిన రిపబ్లికన్లు అక్కడ రీకౌంట్ కోరారు. ఇద్దరి మధ్యా తేడా 0.5 శాతం కంటే తక్కువ ఉంటే రీకౌంట్‌కు అక్కడి చట్టాలు అనుమతిస్తాయి. అదీకాక- జార్జియా గవర్నర్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు. ఆయన రీకౌంటింగ్‌కు అనుమతించినట్లు ముఖ్య అధికారి బ్రాడ్ రాఫెన్‌స్పెర్జర్ ప్రకటించారు. శనివారం లెక్కించనున్న వాటిలో ఎక్కువ భాగం బైడెన్‌కే వెళ్లొచ్చన్నది అంచనా. ఇక నెవాడా, అరిజోనాల్లోనూ బైడెన్‌దే ఆధిక్యం. మొత్తం మీద- 4 స్వింగ్ రాష్ట్రాల్లో బైడెన్ దూసుకెళుతున్నారు.
మరోవైపు వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -ఓటమిని అంగీకరించడానికి సుముఖత చూపలేదు. శుక్రవారం తన సహాయకులు, సలహాదార్లు, పార్టీ నేతలతో సమావేశమై ఆయన అన్ని అంశాలనూ చర్చించారు. ఓటమిని ఒప్పుకోవడం మంచిదని, హుందాగా ఉంటుందని కొందరు సూచించగా- మిగిలిన వారు కోర్టుల్లో గట్టిగా పోరాడదామని అభిప్రాయపడ్డారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన ట్రంప్- ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. తాము కోరుతున్నది నిజాయితీ అయిన పోలింగ్, నిజాయితీ ఉన్న సిబ్బందితో నిజాయితీగా ఓట్ల లెక్కింపన్న ట్రంప్ అప్పుడే అమెరికా గెలుస్తుందని వ్యాఖ్యానించారు.
ఇక.. ఎన్నికల ఫలితాలపై జో బైడెన్ స్పందించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసం ఉందని.. తుది ఫలితం వచ్చేవరకు ప్రతిఒక్కరూ సంయమనంతో ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరి ఓటు లెక్కించడం జరుగుతుందన్న బైడెన్.. ట్రంప్‌పై 40 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకోనున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.