Tornadoes in America: అమెరికాను వణికిస్తున్న భారీ టోర్నడోలు
*1925 తర్వాత టోర్నడోల భారీ విధ్వంసం *టోర్నడోల బీభత్సంతో వందలాది మంది మృతి *టోర్నడోల దెబ్బకు పూర్తిగా నేలమట్టమైన కెంటకీ
Tornadoes in America: అగ్రరాజ్యం అమెరికాను టోర్నడోలు వణికిస్తున్నాయి. మొత్తం ఆరు రాష్ట్రాల్లో టోర్నడోలు విరుకుపడ్డ ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా లెక్కుమించి గల్లంతయినట్లు తెలుస్తోంది. సుడిగాలుల బీభత్సంపై సమీక్షించిన జో బైడెన్.. అమెరికా హిస్టరీలోనే అతిపెద్ద విపత్తుల్లో ఒకటన్నారు. కెంటకీలో ఎమర్జెన్సీ ప్రకటించిన బైడెన్ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. టోర్నడో ప్రభావిత ప్రాంతాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, టోర్నడోలు విధ్వంసం సృష్టించిన ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తానన్నారు.
మరోవైపు కెంటకీలో టోర్నడోల ధాటికి 70మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వం తెలిపింది. మృతుల్లో అత్యధికులు మేఫీల్డ్‌లోని ఉన్న క్యాండిల్ ఫ్యాక్టరీ కార్మికులుగా గుర్తించారు. ఇక టోర్నడోల దెబ్బకు మేఫీల్డ్ దాదాపుగా నేలమట్టం అయింది. భారీ బిల్డింగ్స్, కార్యాలయాలు కుప్పకూలాయి. అటు ఇల్లినోయూలో ఉన్న అమెజాన్ గోడౌన్ కుప్పకూలి దాదాపు 50మంది మరణించారు. ప్రమాద సమయంలో గోడౌన్‌లో వందమందికి పైగా కార్మికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం గల్లంతయిన వారి కోసం గాలింపు చేపట్టారు.
ఇదిలా ఉంటే మిస్సౌరి, మిసిసిపి, ఆర్కాన్సాస్, టెన్సెసీలోని పలు ప్రాంతాల్లోనూ టోర్నడోల బీభత్సం కొనసాగింది. ఈ ప్రాంతాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగినట్లు అధికారులు పేర్కొన్నారు. బాధితులను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బందితో పాటు అమెరికా రెడ్‌క్రాస్ సొసైటీ సహాయకచర్యల్లో భాగమయ్యాయి. ఇక అమెరికా చరిత్రలో 1925 తర్వాత అత్యంత తీవ్రమైన టోర్నడోలు ఇవేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 1925 టోర్నడోల బీభత్సంలో 915 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అమెరికాలో టోర్నడోల బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.