Israel-Hezbollah: హిజ్బుల్లా కేంద్ర కార్యాలయంపై వైమానిక దాడి ..దద్దరిల్లిన బీరుట్ నగరం

Israeli airstrike: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు చేసింది. బీరుట్‌లోని హిజ్బుల్లా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

Update: 2024-09-28 03:23 GMT

Israeli airstrike: లెబనీస్ రాజధాని బీరూట్‌ నగరం బాంబులతో దద్దరిల్లింది. బీరూట్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని శుక్రవారం ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. టాప్ హిజ్బుల్లా కమాండర్ అంత్యక్రియలకు వేలాది మంది ప్రజలు హాజరైన గంట తర్వాత ఈ దాడి జరిగింది. అయితే హిజ్బుల్లా కమాండర్ ను ముందు రోజు ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. హిజ్బుల్లా అల్-మనార్ టెలివిజన్  కథనం మేరకు దహియాలోని హారెట్ హారిక్ ప్రాంతంలో నాలుగు భవనాలు కుప్పకూలాయి. పేలుడు చాలా శక్తివంతమైందని, బీరూట్‌కు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవనాల్లో పగుళ్లు కనిపించాయని పేర్కొంది.

బీరుట్‌లోని హిజ్బుల్లా కేంద్ర ప్రధాన కార్యాలయంపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ టెలివిజన్ ద్వారా వెల్లడించారు. బీరుట్‌లో పేలుడు తర్వాత, నారింజ,నల్ల పొగలు ఆకాశాన్ని కప్పాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన రోజున ఈ దాడి జరిగింది. మూడు ప్రధాన ఇజ్రాయెలీ టీవీ ఛానెల్‌ల ప్రకారం, హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లాను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అయితే దీనిపై స్పందించేందుకు సైన్యం నిరాకరించింది. బీరుట్ శివారులో ఇజ్రాయెల్ భారీ దాడుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు.76 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

లెబనాన్‌లో ఇజ్రాయెల్ వేగంగా దాడులు చేస్తోంది. ఈ వారం లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో ఏడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారాన్ని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించింది. ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులను వేగవంతం చేసింది. ఇది హిజ్బుల్లా సైనిక సామర్థ్యాలను, సీనియర్ కమాండర్లను లక్ష్యంగా చేసుకుంటోందని పేర్కొంది. హిజ్బుల్లా కాల్పులు ఇలాగే కొనసాగితే, లెబనాన్‌లో గాజా తరహా విధ్వంసం పునరావృతమవుతుందని ఇజ్రాయెల్ ఉన్నత అధికారులు బెదిరించారు.

లెబనాన్‌తో సరిహద్దులో తన లక్ష్యాలను సాధించే వరకు హిజ్బుల్లాపై తమ దేశం దాడులు కొనసాగిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ నాయకులతో అన్నారు. అతని ప్రకటనతో, ప్రాంతీయ యుద్ధాన్ని ఆపడానికి అంతర్జాతీయంగా మద్దతు ఉన్న కాల్పుల విరమణపై ఆశలు తగ్గిపోయాయి. ఆ ప్రాంతం (లెబనాన్) నుంచి రోజువారీ రాకెట్ కాల్పులను తమ ప్రభుత్వం ఇకపై సహించబోదని నెతన్యాహు అన్నారు. .ఈ ముప్పును అంతం చేయడానికి, పౌరులను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి పంపడానికి ఇజ్రాయెల్‌కు పూర్తి హక్కు ఉంది. మేము చేస్తున్నది అదే. మా లక్ష్యాలన్నింటినీ సాధించే వరకు మేము హిజ్బుల్లాపై దాడి చేస్తూనే ఉంటాము అని ఆయన చెప్పారు.  

Tags:    

Similar News