Israel vs Hezbollah News: హిజ్బుల్లాపై రాకెట్ దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్.. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటన
Israel vs Hezbollah News Updates: ఇజ్రాయెల్‌కి హిజ్బుల్లా పక్కలో బళ్లెంలా తయారైంది. 2006 నుండి మొదలుకుని అడపాదడపా అవకాశం చిక్కినప్పుడల్లా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తూనే ఉంది. పొరుగునే ఉన్న ఇరాన్, పాలస్తినా వంటి దేశాలు హిజ్బుల్లాకు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తున్నాయనేది అందరూ చెప్పుకునే మాట. తాజాగా మరోసారి అక్టోబర్ 7 నాటి దాడి కంటే భీకరమైన దాడి చేసేందుకు హిజ్బుల్లా ప్లాన్ చేసిందని.. కానీ అంతకంటే ముందే మేమే ఆ దాడిని తిప్పికొడుతూ హిజ్బుల్లాపై మెరుపు దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై సుమారు 6 వేల రాకెట్ లాంచర్లతో దాడికి సిద్ధమైందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆరోపించింది. ఒకవేళ హిజ్బుల్లా ప్లాన్ నిజమే అయితే.. అక్టోబర్ 7న జరిగిన హమాస్ ఎటాక్ కంటే ఇదే అతి పెద్ద దాడి అవుతుంది. పైగా భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే హిజ్బుల్లాకు చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగానే లెబనాన్ లో హిజ్బుల్లా స్థావరాలపై ఫైటర్ జెట్స్ తో మెరుపు దాడి చేసినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.
ఇజ్రాయెల్‌కి చెందిన 100 ఫైటర్ జెట్స్ లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లి మరీ హిజ్బుల్లాకు చెందిన రాకెట్ లాంచర్ల స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టంచేశారు. అంతేకాకుండా దేశంలో పౌరుల భద్రత కోసం 48 గంటలపాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు నెతన్యాహు ప్రకటించారు. తన పుట్టలో వేలుపెడితే తాను కుట్టకుండా ఉంటానా అన్నట్లుగా తన దేశం జోలికి వస్తే వారిపై కచ్చితంగా ప్రతి దాడి చేసి తీరుతామని నెతన్యాహు హిజ్బుల్లాకు వార్నింగ్ ఇచ్చారు.
ఉత్తర ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా దాడి ప్రభావం అధికంగా ఉండటంతో ప్రస్తుతం నెతన్యాహు ఫోకస్ కూడా అక్కడే అధికంగా ఉంది.
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు ఒకరు చనిపోయినట్లుగా లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్ వైపు ప్రాణ నష్టం వాటిల్లినట్లుగా ఇప్పటికైతే ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఇజ్రాయెల్ మెరుపు దాడిపై ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి అడ్మిరల్ డానియెల్ హగారి స్పందిస్తూ.. ఇజ్రాయెల్ పౌరులకు పొంచి ఉన్న ముప్పును తొలగించడానికే హిజ్బుల్లా స్థావరాలపై తమ దేశం ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
మొత్తానికి ఇజ్రాయెల్ vs హిజ్బుల్లా మధ్య నెలకొన్న భీకర వాతావరణం ఎప్పుడు ఏమవుతుందా అని సస్పెన్స్‌కి గురిచేస్తోంది. మరోవైపు ప్రపంచదేశాలు.. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్‌కి, హిజ్బుల్లాకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న దేశాలు ఈ పోరుని ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూనే ఉన్నాయి.