Israel Attacks Gaza: గాజా మసీదుపై ఇజ్రాయెల్ బాంబులు.. 24 మంది హతం

Update: 2024-10-06 09:02 GMT

Israel Attacks Gaza: ఇజ్రాయెల్ మరోసారి గాజాపై వైమానిక దాడులకు పాల్పడింది. గాజాలోని ఒక పెద్ద మసీదుపై ఆదివారం అర్ధరాత్రి దాటాకా 2 గంటల ప్రాంతంలో ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది. ఈ దాడిలో మసీదు దాదాపు ధ్వంసమైంది. 24 మంది చనిపోయారు. హమాస్ ఈ మసీదు నుండే కమాండ్ కంట్రోల్ సెంటర్ నడిపిస్తూ మిలిటెంట్ కార్యకలాపాలకు పాల్పడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అయితే, అల్-జజీరా కథనం ప్రకారం.. గాజాలో వరుస దాడులతో ఆశ్రయం కోల్పోయి రోడ్డున పడిన పౌరులే ఈ మసీదులో తలదాచుకుంటున్నారని తెలుస్తోంది. ఉత్తర గాజా, దక్షిణ బెరూత్‌పై పట్టు పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడినట్లు వార్తలొస్తున్నాయి.

ఇరాన్ అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడికి పాల్పడింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 180 మిస్సైల్స్ వర్షం కురిపించడంతో అప్పటి నుండి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధపూరిత వాతావరణం నెలకొని ఉంది. క్షిపణులతో తమ దేశంపై దాడి చేసి ఇరాన్ పెద్ద తప్పు చేసిందని.. అందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ అభిప్రాయపడింది. దీంతో ఇజ్రాయెల్ ఎప్పుడు, ఏ వైపు నుండి విరుచుకుపడుతుందా అనే పరిస్థితి నెలకొని ఉంది. ఈ తరుణంలోనే ఇజ్రాయెల్ మిలిటరీ బలగాలు గాజాలోని మసీదుపై ఇలా దాడికి పాల్పడటం జరిగింది. 

ఇదిలావుంటే మరోవైపు మధ్యధరా సముద్రంపై ఇజ్రాయెల్ రెండు డ్రోన్లని కూల్చేసింది. లెబనాన్‌లో ఉన్న హెజ్బొల్లా, హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. లెబనాన్ గడ్డపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ సిరియా, ఇరాక్, యెమెన్‌లోని ఇరాన్ ప్రేరేపిత మిలిటెంట్ సంస్థలు ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ వైపు వస్తున్న రెండు డ్రోన్లని ఆ దేశ రక్షణ బలగాలు మధ్యధరాసముద్రంపైనే కూల్చేశాయి. 

Tags:    

Similar News