పాకిస్థాన్ ముక్కలయ్యే ఛాన్స్ ఉందా? నిజానిజాలేంటి?
సుమారుగా 50 ఏళ్ళ క్రితం పాకిస్థాన్ రెండు ముక్కలైంది. 1971 మార్చి 25న బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది. తాజాగా భారత్ రక్షణ శాఖ మంత్రి మరో సారి పాకిస్థాన్ ముక్క చెక్కలయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
సుమారుగా 50 ఏళ్ళ క్రితం పాకిస్థాన్ రెండు ముక్కలైంది. 1971 మార్చి 25న బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది. తాజాగా భారత్ రక్షణ శాఖ మంత్రి మరో సారి పాకిస్థాన్ ముక్క చెక్కలయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. బలూచిస్థాన్ గురించి ఇప్పటి వరకూ మరే భారత్ ప్రధాని చేయని సాహసం మోడీ చేశారు. అదీ మూడేళ్ళ క్రితమే. ఎర్రకోట సాక్షిగా ఆయన మూడేళ్ళ క్రితమే బలూచిస్థాన్ స్వాతంత్ర్య పోరాటం గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. అప్పట్లో ప్రధాని మోడీ రగిల్చిన వేడి ఆ తరువాత కాస్తంత చల్లారింది. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలతో బలూచిస్థాన్ పోరాటం మరోసారి తెరపైకి వచ్చింది. మానవ హక్కుల ఉల్లంఘనను ఆపకుంటే పాకిస్థాన్ మరోసారి ముక్కచెక్కలయ్యే అవకాశం ఉందని భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. మరో వైపున భారత్ ఆర్మీ చీఫ్ సైతం పాకిస్థాన్ పై దాడి చేసే అవకాశాలపై తీవ్రస్థాయిలో మాట్లాడారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత్ ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కీలక అంశాల గురించి చర్చించారు. ఇవన్నీ దేనికి సంకేతాలన్నదే ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఉగ్రవాద మూలాలు ఉన్న పాకిస్థాన్ భౌగోళిక రూపురేఖల్లో మార్పులు రానున్నాయా అనే సందేహం కూడా కలుగుతోంది.
బలూచిస్థాన్ స్వాతంత్ర్య పోరాటం ఇప్పటిదేమీ కాదు. భారత్, పాకిస్థాన్ వేరు పడిన సమయంలో బలూచిస్థాన్ ప్రత్యేక రాజ్యంగా ఉండింది. పాకిస్థాన్ తో దానికి ఎలాంటి సంబంధం లేదు. పాక్ పాలకులు మాత్రం బలూచిస్థాన్ లోని వివిధ రాష్ట్రాల పాలకులను తమ వైపు మళ్లించుకొని.....బలూచిస్థాన్ ను పాక్ లో కలిపేసుకున్నారు. నాటి నుంచి కూడా బలూచిస్థాన్ ప్రజలు పాకిస్థాన్ నుంచి స్వతంత్రం కోసం పోరాడుతూనే ఉన్నారు. సుమారు ఏడు దశాబ్దాలుగా ఆ పోరాటం అలా కొనసాగుతూనే ఉంది. 1950లో ఒకసారి....1958లో మరోసారి పోరాటం తీవ్రరూపం దాల్చింది. తిరిగి 1963లో మరో ప్రయత్నం జరిగింది. 1973లో మరో విడత పోరాటం జరిగింది. నేటి కాలానికి వస్తే....2004లో మరోసారి పోరాటం తీవ్రరూపం దాల్చింది. మొదట్లో గెరిల్లా దాడులుగా ఉన్న పోరాట స్వరూపం ఆ తరువాత ఉగ్రరూపం దాల్చింది. చైనా ఇంజినీర్లపై దాడులు జరిగాయి. తదనంతర కాలంలో వివిధ దేశాల్లో బలూచిస్థాన్ అనుకూల ప్రదర్శనలు భారీగా జరగడం మొదలైంది. బ్రిటన్, జర్మనీ లాంటి దేశాల్లో ఇలాంటి ప్రదర్శనలు అనేకం జరగడంతో బలూచిస్థాన్ పోరాటం అంతర్జాతీయ సమాజం దృష్టిని కూడా ఆకర్షించింది. బలూచిస్థాన్, ఫక్తూనిస్థాన్ ప్రాంతాల్లో పాకిస్థాన్ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. అక్కడి ఉద్యమకారులు పలు సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని ప్రస్తావించారు. భారతదేశం విషయానికి వస్తే....ఈ పోరాటాలపై భారత్ కు సానుకూలత ఉన్నప్పటికీ..... బహిరంగంగా.... విధానపరంగా....అధికారికంగా ఇప్పటి వరకూ ఆ పోరాటాలకు మద్దతు, సహాయం ప్రకటించిన దాఖలాలు లేవు. ఇకపై మాత్రం భారత్ వైఖరిలో మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
బలూచ్, ఫస్తూన్ జాతీయులపై పాకిస్థాన్ తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విమర్శించారు. పాక్ పై భారత్ నాయకులు ఈ తరహా విమర్శలు ఈ స్థాయిలో చేయడం ఇదే మొదటిసారి. బలూచిస్థాన్ ఉద్యమానికి భారత్ అండగా నిలుస్తోందని పాకిస్థాన్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. భారత్ మాత్రం అధికారికంగా ఆ ఉద్యమానికి అండగా నిల్చిన దాఖలాలు మాత్రం లేవు. ఇకపై మాత్రం ఈ విషయంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బలూచిస్థాన్ తదితర పోరాటాలకు నైతిక మద్దతు ప్రకటించిన భారత్ ....ఇకపై అధికారిక మద్దతు ప్రకటిస్తే....పరిస్థితి మరోలా మారే అవకాశం ఉంది. మానవ హక్కుల ఉల్లంఘన ఇలానే కొనసాగితే .....పాకిస్థాన్ ముక్కచెక్కలు కాకుండా ఎవరూ ఆపలేరని రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. పాకిస్థాన్ తప్పిదాలు ఇలానే కొనసాగితే యుద్ధం తరహా పరిస్థితి వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు. ఎన్ని యుద్ధాలు జరిగినా....వైఖరి మార్చుకోని పొరుగుదేశానికి ఇక ఏ విధంగా బుద్ధి చెప్పాలో నిర్ణయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంతర్జాతీయ ఒత్తిళ్ళు కూడా ఎలాంటి ఫలితాలు అందించలేని సందర్భాల్లో....దెబ్బకు దెబ్బ తరహాలో పాక్ లో జరుగుతున్న ఉద్యమాలకు భారత్ మద్దతు ప్రకటించాల్సిన సమయం వచ్చింది.