Iran vs Israel War: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో ఏ దేశం ఎటువైపు? భారత్ మద్దతు ఎవరికి?
Iran vs Israel War: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే అప్రకటిత యుద్ధం నడుస్తోంది. రెండు దేశాల మధ్య పరస్పర దాడులతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఎప్పుడు ఏ దేశం తమ ప్రత్యర్థిపై విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపించిన తరువాత ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి మరింత వేడెక్కింది. ఒకవేళ ఇరాన్ నిజంగానే ఇజ్రాయెల్‌లో మొసాద్ కి చెందిన కీలక స్థావరాలపై మిసైల్స్ ఎటాక్ కనుక చేసి ఉంటే, ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌కి ప్రధాన ఆర్థిక వనరులైన చమరు నిక్షేపాలను టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. అదే కానీ జరిగితే.. ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే బలమైన మిత్రదేశాలు కూడా ఈ యుద్ధంలో పాల్గొనే అవకాశం లేకపోలేదనేది అంతర్జాతీయ దౌత్యవేత్తల అభిప్రాయం. అలాంటి పరిస్థితే వస్తే.. అప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం కాస్తా మూడో ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు అనేది వారి అభిప్రాయం. మరి నిజంగానే ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అంటూ వస్తే.. అమెరికా, చైనా, రష్యా లాంటి అగ్ర దేశాలు ఎవరికి మద్దతు ఇస్తాయి? భారత్ ఎవరివైపు నిలబడుతుంతనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ మొత్తం స్టోరీపై ఒక లుక్కేస్తే ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో ఏ దేశం ఎటువైపు నిలుస్తున్నాయో ఇట్టే అర్థమైపోతుంది.
ఇరాన్‌ని వ్యతిరేకించే ఇజ్రాయెల్ మిత్రదేశాల జాబితాలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా ఉన్నాయి.
ఇరాన్ vs ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎటువైపు?
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కచ్చితంగా ఇజ్రాయెల్ వైపే ఉంటుందనే విషయం ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న దాడులను ఓకంట కనిపెట్టే వాళ్లకు ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన మిస్సైల్స్ దాడిని తిప్పికొట్టడంలో అమెరికా బలగాలు ఇజ్రాయెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్‌తో కలిసి పనిచేశాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ, అమెరికా నుండి ఇజ్రాయెల్‌కి పూర్తి మద్దతు ఉంటుంది అని స్పష్టంచేశారు. అంతేకాదు.. ఇరాన్ జరిపిన మిస్సైల్స్ దాడిని అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు విజయవంతంగా తిప్పికొట్టాయని చెబుతూ ఆ రెండు దేశాల రక్షణ బలగాలను బైడెన్ ప్రశంసించారు. దీన్నిబట్టే అమెరికా ఎవరివైపు ఉంటుందో ప్రత్యేకించి లెక్కలేసుకోవాల్సిన అవసరం లేదు.
మరి బ్రిటన్ సంగతేంటి?
బ్రిటన్ కూడా ఇరాన్‌పై కారాలు, మిరియాలు నూరుతోంది. పశ్చిమాసియాలో ఇరాన్ వల్లే అశాంతి నెలకొందని బ్రిటన్ ప్రధాని కీయర్ స్టార్మర్ చెబుతున్నారు. తమ పూర్తి మద్దతు ఇజ్రాయెల్‌కే ఉంటుందని స్టార్మర్ ప్రకటించారు.
ఫ్రాన్స్ వైఖరేంటో చెప్పిన అధ్యక్షుడు
ఫ్రాన్స్ కూడా ఇరాన్‌ని వ్యతిరేకిస్తోంది. ఇజ్రాయెల్ పౌరుల రక్షణే తమ తొలి ప్రాధాన్యత అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రోన్ తెలిపారు. అంతేకాదు.. పశ్చిమాసియాలో ఇరాన్ దాడులను తిప్పికొట్టి పరిస్థితిని చక్కబెట్టడం కోసం ఇజ్రాయెల్‌కి సైనిక వనరులను పంపిస్తున్నట్లు ఫ్రాన్స్ స్పష్టంచేసింది.
ఇక జపాన్ విషయానికొస్తే.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైల్స్ దాడిని జపాన్ కూడా ఖండిస్తోంది. ఇరాన్ మిస్సైల్స్ దాడి చేయడం సరికాదని జపాన్ కొత్త ప్రధాని షిగేరు ఇషిబా ప్రకటించారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నివారించేందుకు తాము అమెరికాతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌కి జపాన్ మద్దతు ఇస్తున్నప్పటికీ అది మాటల వరకే పరిమితమయ్యే అవకాశం ఉంది. యుద్ధం అంటూ జరిగితే జపాన్ నేరుగా రంగంలోకి దిగకపోవచ్చు.
జర్మనీ రూటెటు వైపు?
ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైల్స్ దాడిని ఖండించిన జర్మనీ.. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణానికి కారణమవుతున్న ఇరాన్ ఇకనైనా తమ దాడులను ఆపాలని పిలుపునిచ్చింది. దీంతో జర్మనీ కూడా ఇజ్రాయెల్ వైపే ఉందని స్పష్టమైపోయింది.
ఆస్ట్రేలియా వెర్షన్ ఏంటంటే..
ఇరాన్ వైఖరిని ఆస్ట్రేలియా కూడా తప్పుపట్టింది. ఇకనైనా ఇరాన్ దాడులకు స్వస్తి పలకాలని ఆస్ట్రేలియా హితవు పలికింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ బుధవారం మెల్‌బోర్న్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఇరాన్ చేస్తోన్న దాడులు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు.
ఇవేకాకుండా ఇజ్రాయెల్‌కి పొరుగునే ఉన్న సౌది అరేబియా, జోర్డాన్ వంటి దేశాలు కూడా ఇజ్రాయెల్‌కే అండగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్‌లో అత్యధికంగా ఉన్న షియా తెగను ఆ పక్కనే ఉన్న అరబ్ దేశాల్లోను సున్నీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. అలా ఇరాన్‌తో వారికి కొన్ని మతపరమైన విభేదాలు ఉండటం, అలాగే ఇజ్రాయెల్, అమెరికాలతో అన్నివిధాల సత్సంబంధాలు కలిగి ఉండటం అనేది వారిని ఇరాక్‌కి వ్యతిరేకం చేసే ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
మరి ఇదంతా చూస్తోంటే.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, సౌది అరేబియా లాంటి అగ్రరాజ్యాల మద్దతు, అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా ఇరాన్ వైపు నిలిచే ధైర్యం చేసేవాళ్లు లేనేలేరా అనే ప్రశ్న కూడా రావొచ్చు. యస్ అక్కడికే వస్తున్నాం.
ఇజ్రాయెల్‌పై దాడుల విషయంలో టర్కీ, రష్యా, లెబనాన్, చైనా, యెమెన్ లాంటి దేశాలు ఇరాన్‌కి అండగా నిలుస్తున్నాయి.
నెతన్యాహును అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చిన టర్కీ
"ఇరాన్‌పై వరుస దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ని ఇంకా ఏ మాత్రం సమయం వృధా చేయకుండా ఐక్యరాజ్య సమితి తక్షణమే అడ్డుకోవాలి. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆపాలి" అని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలన్నీ ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. అడాల్ఫ్ హిటర్ల్ తరహాలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా రెచ్చిపోతున్నారు కానీ త్వరలోనే ఆగిపోక తప్పదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అభిప్రాయపడ్డారు.
అయితే, ఇజ్రాయెల్‌ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న టర్కీ.. యుద్ధం అంటే వస్తే ఇరాన్ తరుపున నేరుగా బరిలోకి దిగుతుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి.
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో రష్యా ఎటువైపు?
రష్యా - ఇరాన్ దేశాల మధ్య దశాబ్ధాల తరబడి సత్సంబంధాలున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే.. ఇజ్రాయెల్‌పై పోరాడుతున్న హెజ్బొల్లా, హమాస్ లాంటి సంస్థలకు ఇరాన్ అండగా నిలుస్తోందంటే.. అందుకు రష్యా సహకారం కూడా లేకపోలేదనే అభిప్రాయం కూడా ఉంది. ఆయుధాలు ఇచ్చిపుచ్చుకోవడంలోనూ రెండు దేశాల మధ్య పరస్పర సహకారం ఉందని అంతర్జాతీయ దౌత్యవేత్తలు చెబుతుంటారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైల్ ఎటాక్ చేయడానికి సరిగ్గా వారం రోజుల ముందే రష్యా ప్రధాన మంత్రి మిఖేల్ మిసస్టిన్ ఇరాన్‌లో పర్యటించారు. అప్పుడే ఇజ్రాయెల్‌పై ప్రతీకారదాడికి వ్యూహం సిద్ధమవుతోందా అనే వార్తలొచ్చాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైల్స్ వర్షం కురిపించింది.
అయితే, ఇజ్రాయెల్‌పై ఇరాన్ యుద్ధంలో రష్యా ఏమేరకు సహకరిస్తుందంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే గత మూడేళ్లుగా రష్యా, ఉక్రెయిన్‌తో యుద్ధంలో తలమునకలై ఉంది. ఉక్రెయిన్ పై ఆధిపత్యం చాటుకుంటున్నప్పటికీ.. అందుకోసం రష్యా చాలానే శ్రమించాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఇజ్రాయెల్‌తో యుద్ధానికి కాలు దువ్వుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి పెద్ద దేశాలన్నీ కలిసొచ్చి ఇరాన్‌పై యుద్ధం ప్రకటిస్తే తప్ప ఇరాన్ కోసం రష్యా రాకపోవచ్చు అనే అభిప్రాయం వినిపిస్తోంది.
లెబనాన్ వైఖరి అందరికీ తెలిసిందే
లెబనాన్ గడ్డపై ఇజ్రాయెల్ ఆధిపత్యానికి చెక్ పెట్టడం కోసమే ఇరాన్ పోరాడుతోంది. పైగా లెబనాన్ గడ్డపై నుండి ఇజ్రాయెల్‌కి వ్యతిరేక పోరాటాలు చేస్తోన్న హెజ్బొల్లా, హమాస్ వంటి సంస్థలకు ఇరాన్ మొదటి నుండి అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అంటూ జరిగితే అందులో లెబనాన్ పాత్ర ఎంతో కీలకం కానుంది. అంతేకాదు.. ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధక్షేత్రం లెబనాన్ గడ్డే అయినా ఆశ్చపోనక్కర్లేదు. ఇది లెబనాన్ పరిస్థితి.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ యుద్ధంలో చైనా మద్దతెవరికి?
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అంటూ వస్తే చైనా ఇరాన్‌కే ఎక్కువ మద్ధతిచ్చే అవకాశాలున్నాయి. కాకపోతే ఆ మద్దతు మాటల వరకే ఉంటుందా లేక చేతల్లో కూడా ఉంటుందా అంటే మొదటి మాటకే అవుననుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మీటింగ్ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్‌తో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ సమావేశమయ్యారు. " పశ్చిమాసియాలో అంతర్జాతీయ, ప్రాంతీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. ఇరాన్ అంతర్గత వ్యవహారాలలో విదేశీ శక్తులు జోక్యం చేసుకోవడాన్ని తాము సమర్ధించబోం" అని చైనా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది. అంతేకాకుండా గాజాలో ఇజ్రాయెల్ దాడులను సైతం చైనా అంతే తీవ్రంగా ఖండించింది. కానీ ఇజ్రాయెల్‌పై యుద్ధానికి చైనా ముందుకొస్తుందా అంటే ఆ విషయంలో చైనా వైఖరిని అనుమానించాల్సిందే.
అమెరికా, ఇజ్రాయెల్‌కి తన పవర్ చూపించుకుంటున్న యెమెన్
ఇజ్రాయెల్‌కి, ఆ దేశానికి అండగా నిలుస్తోన్న అమెరికాకు అడపాదడపా తన పవర్ చూపించుకోవడంలో యెమెన్ వెనుకంజ వేయడం లేదు. యెమెన్ - ఇరాన్ మద్దతుతో ఏర్పడిన హూతీ రెబెలియన్ సంస్థ కూడా ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకారంతో రగిలిపోతోంది. హెజ్బొల్లా అగ్రనేత హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ మట్టుపెట్టడం హూతీకి మరింత కోపం తెప్పించింది.
అందుకే న్యూయార్క్‌లో జరిగిన ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కోసం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెళ్లి వస్తుండగా ఇజ్రాయెల్ ప్రధాన విమానాశ్రయంపై హౌతీస్ బాలిస్టిక్ మిసైల్‌తో పేలుడు దాడికి పాల్పడింది. నెతన్యాహుకు వార్నింగ్ ఇవ్వడం కోసమే ఈ దాడి జరిగింది.
అలాగే యెమెన్ గగనతలంలోకి వచ్చిన అమెరికా మిలిటరీ డ్రోన్‌ని కూల్చేయడం, ఇజ్రాయెల్ అంతర్జాతీయ వర్తకంలో కీలక రవాణా మార్గమైన రెడ్ సీలో వెళ్తున్న ఒక పెద్ద నౌకని డ్రోన్‌తో పేల్చేయడం వంటి పరిణామాలు ఆ ప్రతీకార కాంక్షలోంచి వచ్చినవే.
సిరియా, ఇరాక్, ఈజిప్ట్, ఖతార్ వైఖరేంటి?
సిరియా, ఇరాక్ కూడా ఇరాన్‌కి తమ మద్దతు ప్రకటిస్తున్నాయి. అందుకు కారణం వాటికి అమెరికాతో పడకపోవడమే. ఒకవేళ ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ప్రతీకారదాడులకు పాల్పడితే.. తాము ఇరాక్‌లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులకు పాల్పడుతాం అని ఇప్పటికే ఇరాక్‌లోని కొన్ని మిలిటెంట్ సంస్థలు అమెరికాను హెచ్చరించాయి.
ఇక ఈజిప్ట్ విషయానికొస్తే.. ఇజ్రాయెల్‌కి ఈజిప్టుతో అస్సలే పొసగడం లేదు. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు పంచాయతీలు నడుస్తున్నాయి. ఇజ్రాయెల్ ఈజిప్టులోకి చొచ్చుకొస్తోందని ఆరోపిస్తోన్న ఈజిప్ట్.. ఏకంగా ఆ దేశంతో తమ సరిహద్దుని కూడా మూసేయడంతో ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య కనీసం వాణిజ్య సంబంధాలు కూడా లేవు.
కతార్ చిన్న దేశమే అయినప్పటికీ.. హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో మధ్యవర్తి పాత్ర పోషించింది. గతేడాది నవంబర్‌లో హమాస్ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ వాసులను విడిపించడంలోనూ కతార్ సక్సెస్ అయింది. అంతేకాదు.. ఇరాన్ అండదండలున్న హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియెకు ఒకప్పుడు ఆశ్రయం కూడా ఇచ్చింది. కాకపోతే పశ్చిమాసియాలో అమెరికాకి చెందిన అతిపెద్ద మిలిటరీ స్థావరం కూడా కతార్‌లోనే ఉంది. అలాంటప్పుడు ప్రత్యక్ష యుద్ధంలో కతార్ ఎటువైపు ఉంటుందనేది ప్రస్తుతానికేమీ చెప్పలేని పరిస్థితి.
మరి ఇండియా మద్దతెవరికి?
ఇండియా విషయానికొస్తే.. ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలతోనూ భారత్‌కి సత్సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ నుండి భారత్ చమురు, సహజ వాయువు దిగుమతి చేసుకుంటోంది. ఇక ఇజ్రాయెల్‌తో అత్యాధునిక ఆయుధ సంపత్తి సహాయం పొందుతోంది. భారత్‌కి ఈ రెండు దేశాలు కూడా ముఖ్యమే. అందుకే భారత్ మొదటి నుండి కూడా ఈ రెండు దేశాల మధ్య శాంతిని కోరుకుంటోంది.
పౌరుల రక్షణ దృష్ట్యా రెండు దేశాలు సహనంతో ఉండి యుద్ధం రాకుండా చూడాల్సిందిగా భారత్ అప్పీల్ చేస్తూ వస్తోంది. పైగా భారత్‌కి చమురు మోసుకొచ్చే నౌకలకు ప్రధాన రవాణా మార్గమైన రెడ్ సీ, స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్ ఛానెల్‌లో ఎలాంటి అవాంతరాలు ఏర్పడినా.. అది భారత్‌లో ఇంధనం కొరతకు దారితీస్తుంది అనే భయం కూడా ఉంది. అందుకే అసలు ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధమే కోరుకోని దేశాల్లో భారత్ ముందుంది.