ఐస్‌క్రీం యాడ్‌ వివాదం.. ప్రకటనల్లో మహిళలపై నిషేధం..

Iran: ఓ యాడ్ ఇప్పుడు ఇరాన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Update: 2022-08-06 14:00 GMT

ఐస్‌క్రీం యాడ్‌ వివాదం.. ప్రకటనల్లో మహిళలపై నిషేధం

Iran: ఓ యాడ్ ఇప్పుడు ఇరాన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చిన్న ఐస్‌క్రీం యాడ్ ఆ దేశంలో పలు వివాదాలకు తెరతీసింది. మహిళలు వంటింటికే పరిమితం కావాలిఇలా యాడ్సూ గీడ్సూ అంటూ నటించారో ఖబర్థార్ అంటూ ఏకంగా ఇరాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ప్రపంచవ్యాప్తంగా హాట్ ‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ యాడ్‌లో ఏముంది అంతలా వ్యతిరేకించడానికి గల అసలు కారణాలేంటి..?

ఇటీవల రిలీజైన ఈ ఐస్‌క్రీం యాడ్‌ ఇరాన్‌లో తీవ్ర వివాదం సృష్టిస్తోంది. మహిళలతో రూపొందించిన ఐస్‌క్రీం యాడ్‌లపై ఇరాన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. మహిళలు ఐస్‌క్రీం తిన్నట్లుగా ఇటీవల రెండు యాడ్‌లు విడుదల అయ్యాయి. అయితే అందులో హిజాబ్‌ను నిర్లక్ష్యం చేశారని మహిళలను అభ్యంతరకరరీతిలో చూపెట్టారని ఇరాన్ మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఐస్‌క్రీం తయారీ సంస్థపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా కోరారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్లైయింది. ఈ క్రమంలోనే అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలకు లేఖ రాసిన ఆ దేశ సాంస్కృతికశాఖ ఇకపై ఎటువంటి ప్రకటనల్లో నటించడానికి మహిళలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. సుప్రీం కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రెవల్యూషన్ తీర్పులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా 1979లో ఇస్లామిక్ విప్లవం నుంచి ఇరాన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. మరోవైపు చాలామంది మహిళలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయంపై ఈ మధ్య కొంతమంది మహిళలు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ తమ నిరసన గళాన్ని కూడా విన్పించారు. యాడ్స్‌లో మగవాళ్లు నటించవచ్చు కానీ ఆడవాళ్లు ఎందుకు నటించకూడదంటూ విమర్శలు గుప్పించారు. ఆడవాళ్లుగా మేం చేసిన తప్పేంటి అని ప్రశ్నించారు. అసలే మహిళలపై అర్థంపర్థంలేని ఆంక్షలు విధించే ఇరాన్ ప్రభుత్వం దీన్ని మరింత రాద్దాంతం చేసింది. ఏకంగా ఇరాన్ సాంస్కృతికశాఖ కొత్త ఆదేశాలు జారీ చేస్తూ అడ్వర్టైజ్‌మెంట్లు, కమర్షియల్స్‌లో సైతం మహిళలను నిషేధించాలని ఆదేశించింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాలపై మహిళలు మండిపడుతున్నారు. తమ హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు.

మహిళలపై ఇలాంటి ఆదేశాలకే కాదు ఇరాన్ ప్రభుత్వం మహిళలపై గతంలో కూడా ఇటువంటి ఆంక్షలే విధించింది. మహిళలు పిజ్జా లేదా శాండ్ విచ్ తింటూ స్క్రీన్‌పై కనిపించకూడదని హుకుం జారీ చేసింది. అంతేకాదు పనిచేసే చోట మహిళలకు పురుషులు టీ సర్వ్ చేయకూడదని ఆదేశించింది. అలాగే మహిళలు లెదర్ గ్లౌవ్స్‌ ధరించి కనిపించకుండా సెన్సార్ అమలు చేయాలని ఆదేశించింది.

మహిళలు ఐస్‌క్రీం యాడ్స్‌ సహా ఎలాంటి కమర్షియల్ యాడ్స్‌లో నటించకూడదన్న ఇరాన్ ప్రభుత్వం ఆదేశాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న మహిళా సంఘాలు ఇరాన్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పురుషులతో సమానంగా మహిళలకు కూడా హక్కులుంటాయని వాటిని కాలరాసే హక్కు ఏ ప్రభుత్వాలకు ఉండవని మహిళా సంఘాలు గొంతెత్తి నినదిస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 


Tags:    

Similar News