American Military: ఎర్ర సముద్రంలో యూఎస్ నేవీ వర్సెస్ హౌతీ రెబెల్స్
American Military: హౌతీ ఆధీనంలో ఉన్న భూభాగంలో నుంచి గాల్లోకి ఎగిరిన క్షిపణులు
American Military: ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ ప్రయోగించిన రెండు యాంటి షిప్ బాలిస్టిక్ మిసైళ్లను కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ ప్రకటించింది. ఈ మిసైళ్లను హౌతీ రెబెల్స్ యెమెన్ నుంచి ప్రయోగించినట్లు తెలిపింది. గడిచిన మూడు రోజుల్లో హౌతీ మిలిటెంట్ల మిసైళ్లను అమెరికా మిలిటరీ కూల్చివేయడం ఇది రెండోసారి. ది మెర్స్క్ హాంగ్‌ఝూ అనే కంటైనర్ నౌకపై హౌతీలు క్షిపణి దాడి చేశారు. 10 రోజుల క్రితం అంతర్జాతీయ సంకీర్ణ సేనలు ఎర్ర సముద్రంలో గస్తీ మొదలుపెట్టిన తర్వాత మొదటి సారి హౌతీ రెబెల్స్ దాడి చేశారు. మరో రెండు బాలిస్టిక్ క్షిపణులను అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్ గ్రావ్‌లీ కూల్చివేసింది.
హాంగ్‌ఝూపై ప్రయోగించిన క్షిపణులు యెమెన్‌లోని హౌతీ ఆధీనంలో ఉన్న భూభాగంలో నుంచి గాల్లోకి ఎగిరినట్లు గుర్తించారు. దాడికి గురైనా ఈ నౌక ప్రయాణానికి ఇబ్బంది లేదని అమెరికా దళాలు వెల్లడించాయి. డెన్మార్క్‌కు చెందిన ఈ నౌక సింగపూర్ పతాకంతో ప్రయాణిస్తోంది. ఇది సింగపూర్ నుంచి ఈజిప్టులోని పోర్టు సయీద్‌కు వెళ్తోంది. డెన్మార్క్ కూడా ఎర్ర సముద్రంలోని అంతర్జాతీయ కూటమిలో చేరిన రెండో రోజే ఈ దాడి జరిగింది.
ఎర్ర సముద్రంలో దాడులు పెరగడంతో ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ సంస్థల్లో ఒకటైన మెర్స్క్‌తమ రవాణా నౌకలను సూయజ్ నుంచి కేప్ ఆఫ్ గుడ్‌హోప్ వైపు మళ్లించింది. కానీ, అంతర్జాతీయ కూటమి ఎర్ర సముద్రం రక్షణకు సంయుక్త పహారా చేపట్టడంతో.. తిరిగి ఈ మార్గంలో తమ నౌకలు ప్రయాణిస్తాయని ఇటీవలే పేర్కొంది. ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ కోసం అమెరికా, ఫ్రాన్స్, యూకేకు చెందిన ఐదు యుద్ధ నౌకలు ఈ సముద్రంలో గస్తీ కాస్తున్నాయి. ఇవి పశ్చిమ గల్ఫ్ ఆఫ్ ఎడెన్, ఎర్ర సముద్రంలో పహారా చేపట్టాయి. ఈ ఆపరేషన్ మొదలైన నాటి నుంచి 17 డ్రోన్లు, నాలుగు యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులను ఇవి కూల్చేశాయి. హౌతీలు మాత్రం ఇజ్రాయెల్‌కు వెళుతున్న నౌకలను లక్ష్యంగా చేసుకొంటామని ప్రకటించారు.