India: ఉక్రెయిన్‌ సరిహద్దులవైపు వెళ్లొద్దు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు

India: భారతీయులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు

Update: 2022-02-26 07:45 GMT

India: ఉక్రెయిన్‌ సరిహద్దులవైపు వెళ్లొద్దు

India: ఉక్రెయిన్‌ సరిహద్దులవైపు వెళ్లొద్దంటూ భారతీయులను ఇండియా హెచ్చరించింది. సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని.. ఉక్రెయిన్‌ నుంచి దేశానికి తరలించేందుకు సమీప దేశాలతో రాయబార కార్యాలయం చర్చలు జరుపుతున్నట్టు భారత్‌ తెలిపింది.

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టడంతో ఆ దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న వేలాది మంది భారతీయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఉక్రెయిన్‌ గగన తలాన్ని మూసేయడంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భారతీయులను తరలించేందుకు ప్రత్నామ్నాయ మార్గాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలతో భారత్‌ చర్చలు ప్రారంభించింది.

మరోవైపు పలువురు భారతీయులు దేశానికి వచ్చేందుకు సొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు భారత్‌ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోకి ఎవరూ వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. రాయబార కార్యాలయానికి సమాచారం ఇవ్వకుండా సరిహద్దులోకి వెళ్తే చిక్కులు తప్పవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సరిహద్దుల్లో పరిస్థితులు బాగాలేవని, ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచించింది.

అయితే తాము ఇక్కడ కనీసం మార్కెట్‌కు కూడా వెళ్లడానికి భయపడుతున్నామని ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులు చెబుతున్నారు. పశ్చిమ ప్రాంతంలోని రొమేనియా సరిహద్దు తమకు 200 కిలోమీటర్లు దూరం ఉందని.. అంత దూరం ఎలా వెళ్లగమని ప్రశ్నిస్తున్నారు. తాము బంకర్లలోనే ఉంటున్నామని ఆహారం, నీరు అయిపోతున్నాయని.. ఇలా ఎంత కాలం ఉండాలో తెలియడం లేదని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉక్రెయిన్‌లోని పలువురు భారతీయులు తమను వెంటనే దేశానికి తరలించాలని సోషల్‌ మీడియా ద్వారా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సత్వరమే ఉక్రెయిన్‌ నుంచి దేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది. రొమేనియా రాజధాని బుచారెస్ట్‌ నుంచి ఇప్పటికే ఓ విమానంలో భారతీయులను కేంద్రం దేశానికి తరలించింది.

Tags:    

Similar News