India to Israel: లెబనాన్‌లో రిస్కులో 900 మంది భారతీయ సైనికుల ప్రాణాలు.. యూఎన్ బంకర్లపై ఇజ్రాయెల్ దాడులు

Update: 2024-10-11 15:18 GMT

Indian Soldiers Lives In Lebanon At Risk: లెబనాన్ - ఇజ్రాయెల్ మధ్య వరుస దాడుల నేపథ్యంలో అక్కడ శాంతి నెలకొల్పేందుకు ఐక్య రాజ్య సమితి చొరవతో వివిధ దేశాలకు చెందిన సైనికులు లెబనాన్ గడ్డపై ఉండి పీస్ కీపర్స్‌గా వ్యవహరిస్తున్నారు. వీరినే యునైటెడ్ నేషన్స్ ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్ (UNIFL) అని అంటారు. అందులో దాదాపు 900 మంది మన భారతీయ సైనికులు కూడా ఉన్నారు.

దక్షిణ లెబనాన్‌లో పీస్ కీపర్స్ బలగాలు

దక్షిణ లెబనాన్ - ఇజ్రాయెల్ మధ్య సరిహద్దుల్లోని బ్లూ లైన్ ఉన్న ప్రాంతంలో పీస్ కీపర్స్ బంకర్స్‌పై తాజాగా ఇజ్రాయెల్ సైనిక బలగాలు దాడులు చేశాయి. పీస్ కీపర్స్ గస్తీ కోసం ఏర్పాటు చేసుకున్న వాచ్ టవర్‌ని ఇజ్రాయెల్ బలగాలు తమ యుద్ధ ట్యాంకర్లతో పేల్చేశాయి. ఈ ఘటనలో టవర్‌పై నుండి కిందపడిన ఇద్దరు పీస్ కీపర్స్ గాయపడ్డారు. అదే సమయంలో పీస్ కీపర్స్ సమాచార మార్పిడి కోసం ఏర్పాటు చేసుకున్న కమ్యునికేషన్ సిస్టంని కూడా ఇజ్రాయెల్ సైనిక బలగాలు ధ్వంసం చేశాయి.

పీస్ కీపర్స్‌కి చెందిన నకౌరా హెడ్ క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ బలగాలు పదేపదే దాడులు చేస్తున్నట్లుగా లెబనాన్‌లోని యునైటెడ్ నేషన్స్ ఇంటెరిమ్ ఫోర్స్ వెల్లడించింది. ఇజ్రాయెల్ బలగాలకు, హెజ్బొల్లా ఫైటర్స్ కి మధ్య జరుగుతున్న గ్రౌండ్ ఎటాక్స్‌తో దక్షిణ లెబనాన్‌లో ఊర్లకే ఊర్లే ధ్వంసమవుతున్నాయి.

ఆందోళన వ్యక్తంచేసిన భారత విదేశాంగ శాఖ

ఇజ్రాయెల్ సైనిక బలగాలు చివరకు పీస్ కీపర్స్ స్థావరాలపైనా దాడులు చేస్తుండటం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇదే ఘటనలపై భారత్ సైతం ఆందోళన వ్యక్తంచేసింది. ఐక్య రాజ్య భద్రతా మండలి నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఐక్య రాజ్య సమితి పంపించిన పీస్ కీపర్స్‌ ఉంటున్న ప్రాంతంపై దాడికి పాల్పడటం అంటే ఐరాస భద్రత మండలిని ధిక్కరించడమే అవుతుందని భారత్ గుర్తుచేసింది. ఇది ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి నియమాలకు విరుద్ధం అవుతుందని భారత్ స్పష్టంచేసింది. 

Tags:    

Similar News