అప్పట్లో బిన్‌లాడెన్ కోసం అమెరికా కమాండోలు చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ గురించి వివరించారు అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది సైన్యం ఎలా ప్రిపేర్ అయింది.. ఎలా అటాక్ చేసింది.. ఇలా ప్రతీ విషయాన్ని తన పుస్తకం ఏ ప్రామిస్డ్ ల్యాండ్‌లో రాసుకొచ్చారు. అబొట్టాబాద్‌లోని పాకిస్తాన్ మిలిటరీ కంటోన్మెంట్ శివారులోని ఓ సురక్షిత ప్రాంతంలో లాడెన్ దాక్కున్నట్లు సమాచారం వచ్చిందని ఆ తర్వాత కార్యచరణ అమలు చేశామని అన్నారు ఒబామా. ప్రభుత్వంలోని అత్యంత తక్కువ మందికి మాత్రమే ఈ రహస్య ఆపరేషన్ గురించి తెలిసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు.
జాడ గురించి పాకిస్తాన్‌కు చెప్తే అది లాడెన్‌కు చేరే ప్రమాదం ఉందని అందుకే పాకిస్థానీలను ఇందులో భాగస్వాములను చేయొద్దని గట్టిగా నిర్ణయించుకున్నామని చెప్పారు. కమాండో ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత జాతీయ, అంతర్జాతీయ నేతల నుంచి అనేక ఫోన్ కాల్స్ వచ్చాయని పాకిస్థాన్ అధ్యక్షుడు నుంచి ఫోన్ వస్తే మాత్రం ఇబ్బంది తప్పదని భావించానని ఒబామా చెప్పారు. లాడెన్‌ను మట్టుబెట్టడం మంచి విషయం అని జర్దారీ అన్నారని చెప్పారు.