Pakistan: కానుకల ఆరోపణలపై ఇమ్రాన్ స్పందన
Pakistan: దుబాయ్‌లో కానుకలను అమ్ముకున్నారంటూ ప్రస్తుత పాక్ ప్రధాని షెహబాజ్ ఖాన్ ఆరోపణలు
Pakistan: ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఎన్నో ఆభరణాలను అమ్ముకున్నారన్న ఆరోపణలపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) స్పందించారు. నాకు వచ్చిన కానుకలకు నా ఇష్టం. వాటిని ఏమైనా చేసుకునే వెసులుబాటు నాకు ఉంటుంది. అడగడానికి మీరెవరు? అంటూ ప్రశ్నించారు. నిబంధనలను అనుసరించి 50 శాతం చెల్లించి ప్రభుత్వ ఖజానా నుంచి తోఫాను తీసుకున్నట్ుట ఇమ్రాన్ స్ఫష్టం చేశారు. మూడేళ్ల కాలంలో తనపై ఈ ఒక్క ఆరోపణ మాత్రమే చేయగలిగినందకు సంతోషం అంటూ ఇమ్రాన్ అధికార పక్షంపై సెటైర్ వేశారు.
విదేశాల్లో పర్యటించినప్పుడు, విదేశీ ముఖ్యులు పాకిస్థాన్(Pakistan)కు వచ్చినప్పుడు ప్రధానికి అందించిన కానుకలు సహజంగా ప్రభుత్వ ఖజానాకు చెందుతాయి. అయితే వాటిని ప్రధాని ముచ్చపడి తీసుకోవాలనుకుంటే మాత్రం ఆయా కానుకలకు వెలకట్టి దానిలో 50 శాతం విలువను చెల్లించాలి. అయితే ప్రధానిగా ఉన్న సమయంలో ఇమ్రాన్‌ఖాన్ తనకు వచ్చిన విలువైన కానుకలను నిబంధనలకు విరుద్ధంగా సొంతం చేసుకున్నారని, వాటిని ఇమ్రాన‌్ దుబాయ్‌లో అమ్ముకున్నట్టు ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. దుబాయ్‌లో విక్రయించిన 5.9 కోట్ల విలువైన వజ్రాల నగలు కూడా అందులో ఉన్నాయన్నారు. ఖజానా నుంచి తీసుకొన్న ఓ గడియారం ఇప్పటికీ ఇమ్రాన్ చేతికి ఉందని షెహబాజ్ తెలిపారు. ఈ ఆరోపణలను ఇమ్రాన్‌ఖాన్ వర్గీయులు ఖండించారు. కానుకల వ్యవహారాన్ని ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఏ ఇప్పటికే విచారణ ప్రారంభించింది.
ఇమ్రాన్ ఖాన్‌కు వచ్చిన కానుకలను దుబాయ్‌లో అమ్ముకున్నారని షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif) ఆరోపణలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో 58 ఖరీదైన బహుమతులను అందుకున్నారు. వాటిలో 38 లక్షల రూపాయల విలువైన రోలెక్స్ గడియారాన్ని కేవలం 7 లక్షల 50 వేల రూపాయలకు ఇమ్రాన్ సొంతం చేసుకున్నారట. 15 లక్షల విలువ చేసే మరో రోలెక్స్ గడియారాన్ని 2 లక్షల 94వేలు మాత్రమ చెల్లించారట. ఇలా మూడో వంతు కంటే తక్కువగా కట్టి, పలు కానుకలను ఇమ్రాన్ సొంతం చేసుకున్నట్టు షెహబాజ్ ఆరోపించారు. ఇవే కాకుండా 8 లక్షల విలువైన కానుకలకు రూపాయి కూడా ఖజానాకు చెల్లించకుండా తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల విలువైన వజ్రాల నగలతో పాటు పలు కానుకలను దుబాయ్‌లో ఇమ్రాన్ విక్రయించినట్టు షెహబాజ్ ఆరోపించారు.
తోఫాపై అధికార పార్టీ పీఎంఎల్‌ఎన్(PMLN) చేస్తున్న విమర్శలను మాజీ ప్రధాని ఇమ్రాన్ తోసిపుచ్చారు. అవన్నీ నిరాధారణమైన ఆరోపణలు అన్నారు. అవి నాకు వచ్చిన కానుకలు నిబంధనల ప్రకారం ఖజానాకు 50 శాతం చెల్లించి వాటిని తీసుకున్నాను. అందులో తప్పేముందని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు చూపిస్తే తాను కూడా ముందుకు వస్తానన్నారు. మూడేళ్ల కాలంలో తనపై ఈ ఒక్క ఆరోపణ మాత్రమే చేయగలిగినందుకు సంతోషం అంటూ సెటైర్ వేశారు. నాటకీయ పరిణామాల మధ్య పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ వైదొలిగారు. సొంత పార్టీ నేతల తిరుగుబాటు, మిత్రపక్షాల మద్ధతు ఉపసంహరణతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. అవిశ్వాస తీర్మాణంపై జరిగిన ఓటింగ్‌లో ప్రతిపక్షాలు బలనిరూపణ చేసుకున్నాయి. ప్రస్తుతం పీఎంఎల్‌ఎన్, పీపీపీ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రధానిగా పీఎంఎల్‌ఎన్ పార్టీకి చెందిన షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా ఎన్నికయ్యారు.
ఇదిలా ఉంటే తాజాగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఫై పీఎంఎల్‌ఎన్ మరో కీలక ఆరోపణ చేసింది. 310 మిలియన్ రూపాయలను ఇమ్రాన్‌ఖాన్ పార్టీ దుర్వినియోగం చేసినట్టు ఆరోపించింది. దీనిపై ఈ విషయమై ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలకు మేరకు పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్-ఈసీపీ రేపటి నుంచి విచారణ చేపట్టనున్నది. నెలలోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. నిషేధిత వర్గాల నుంచి నిధులు వచ్చాయో లేదో నిర్ధారించడం అవసరమని కోర్టు వ్యాఖ్యానించింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఇమ్రాన్‌ఖాన్‌కు శిక్ష తప్పదని ప్రధాని షెహబాజ్ అన్నారు. హైకోర్టులో ఈ కేసును పీటీఐ పార్టీకి చెందిన ఓ వ్యవస్థాక సభ్యుడు ఫిర్యాదు చేశారు. ఈ కేసు 2014 నుంచి పెండింగ్‌లో ఉంది. 2008 నుంచి 2013 వరకు పార్టీకి చెందిన పలు ఖాతాలను ఇమ్రాన్‌ఖాన్ పార్టీ రద్దు చేసినట్టు జనవరి 4న పాక్ ఎలక్షన్ కమిషన్ కమిటీ నివేదిక ఇవ్వడం గమనార్హం.
మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై పీఎంఎల్‌ఎన్ మరిన్ని కేసులు పెట్టేందుకు యత్నిస్తోంది. ఇమ్రాన్ మెడకు అవినీతి ఉచ్చును బిగించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పాత కేసులన్నింటిని తోడుతున్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.