Pakistan: వాచీలు కొట్టేసిన ఇమ్రాన్
Pakistan: కొత్త ప్రభుత్వం వచ్చాక పాత ప్రభుత్వం మీద నిందలు వేయడం, విమర్శలు చేయడం మామూలే.
Pakistan: కొత్త ప్రభుత్వం వచ్చాక పాత ప్రభుత్వం మీద నిందలు వేయడం, విమర్శలు చేయడం మామూలే. కానీ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ మీద మాత్రం చాలా దారుణమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టి షెహబాజ్ షరీఫ్.. ఇమ్రాన్ మీద ఏకంగా దొంగతనం ఆరోపణలే చేస్తున్నారు. ఇప్పటికే ఆయన మీద నమోదైన నగల చోరీ కేసుకు ఆజ్యం పోస్తున్నారు.
కుంభకోణాల్లో ఇరుక్కుపోవడం రాజకీయ నాయకులకు కొత్తేం కాదు. కాకపోతే మరీ చాలా చీప్ గా ఆరోపణలు ఎదుర్కోవడం మాత్రం దాదాపు ఇదే అంటున్నారు రాజకీయ నిపుణులు. ఇమ్రాన్ మీద ఆయన పార్టీ నేతలు సైతం అసహ్యించుకునే ఆరోపణలు పాకిస్తాన్లో వెల్లువెత్తుతున్నాయి. పాక్ లో ఇప్పుడు అధికారంలో ఉన్న షెహబాజ్ షరీఫ్.. ఇమ్రాన్ ను ఒక పెద్ద దొంగగా చెబుతున్నాడు. దేశానికి చెందిన అత్యంత విలువైన, పురాతనమైన వస్తువులు భద్రంగా దాచి ఉంచే తోషాఖానా నుంచి ఎన్నో విలువైన వస్తువులను ఇమ్రాన్ తస్కరించాడని షరీఫ్ అభియోగం మోపారు. ఒక్కటి కాదు.. చాలా విలువైన రిస్ట్ వాచీలు, నెక్లేస్ లు, గోల్డ్ కోటెడ్ గన్, బ్రాస్ లెట్లు, ఒక జీపు.. ఇలా చాలా వస్తువులను ఆయన సొంతానికి మళ్లించుకున్నాడని షరీఫ్ ఆరోపిస్తున్నారు. అత్యంత విలాసాలు అనుభవించే సౌదీ అరేబియా వ్యాపారులకు ఆయన ఆ వస్తువులు అమ్ముకున్నారంటున్నారు. దేశ ప్రధానిగా బాధ్యతల్లో ఉన్న వ్యక్తి.. ఆయన విదేశీ పర్యటనలు చేసినప్పుడు.. గౌరవ సూచకంగానో లేక దేశాలతో సంబంధాలను దృష్టిలో ఉంచుకునో.. విలువైన గిఫ్టులు ఇస్తూంటారు. వాటిపై దేశానికే హక్కులుంటాయి తప్ప.. వ్యక్తులకు ఉండవని షరీఫ్ వాదిస్తున్నారు. అందువల్ల ఆయన సౌదీలో అమ్మేసిన నగలను, డైమండ్ నెక్లేస్ లను, ఇతర విలువైన వస్తువులన్నింటినీ వెనక్కి రప్పిస్తామంటున్నారు. దీంతో ఇమ్రాన్.. పదవితో పాటే పరువు కూడా పోతుందా ఏమిటన్న ఆందోళనలో పీటీఐ నేతలు పడిపోయారంటున్నారు... పాక్ లోని రాజకీయ పండితులు.
ఇమ్రాన్ అరబ్బు షేకులకు అమ్మిన ఆభరణాల విలువ సుమారు 14 కోట్లు అవుతుందంటున్నారు పాక్ పాలకులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ కు 14 కోట్ల రూపాయలంటే చాలా పెద్దమొత్తమేనని ఆర్థిక వేత్తలు సెటైర్లు వేస్తున్నారు. అసలు ఈ 14 కోట్ల కోసం దేశ ప్రధాని పరువును, తద్వారా దేశం పరువును బజారున పడేయడం కాకపోతే.. చూసీ చూడనట్టు వదిలేయొచ్చు కదా అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఇమ్రాన్ పార్టీ నేతలు మాత్రం.. ఆ నగల్ని ఇమ్రాన్ ఖరీదు కట్టి సొంతం చేసుకున్నాడని, అందువల్ల ప్రభుత్వ తోషాఖానాకు హక్కులు ఉండవంటున్నారు. ఈ కేసు ఇప్పటికే పాకిస్తాన్ కోర్టులో కొద్ది నెలలుగా నడుస్తోంది. విచారణ కొలిక్కి వస్తున్న ఈ కేసులో ఆభరణాల వివరాలను తాము కోర్టుకే చెబుతాం తప్ప.. బయటికి చెప్పాల్సిన అవసరం లేదని ఇమ్రాన్ వర్గీయులు అంటున్నారు. ఇమ్రాన్ 2018లో అధికారం చేపట్టినప్పుడు.. పాక్ ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. దాన్ని గాడిన పెట్టేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో మూలనపడి ఉన్న వింటేజ్ వాహనాలను, మిలిటరీ వెహికల్స్ ను అడ్డగోలు ధరలకు ఇమ్రాన్ అమ్మేశాడు. విమాన ప్రయాణాలు కూడా తగ్గించుకున్నట్లు అప్పట్లో వార్తొలొచ్చాయి. మరి అంత త్యాగధనుడి మీద ఇంత చీప్ మరకలెందుకనేది కోర్టులైనా తేల్చాలి... లేదా ఇమ్రాన్ వర్గీయులైనా ప్రజలకు వివరించుకోవాలి.