Lebanon Pager Blasts: హెజ్‌బొల్లా పేజర్లలో ఇజ్రాయెల్ బాంబులు ఎలా పెట్టింది?
How Pagers Exploded In Lebanon: లెబనాన్, హెజ్‌బొల్లాను షాక్‌కి గురి చేసిన దాడి ఇది. పేజర్లు బాంబులై పేలిపోయాయి. దాదాపు గంట వ్యవధిలో వేల సంఖ్యలో పేజర్లు పేలిపోయిన ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. దాదాపు మూడు వేల మంది గాయపడ్డారు. ఇది ఇజ్రాయెల్ చేసిన పనేనని లెబనాన్‌తో పాటు హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థ అగ్ర నాయకులు ఆరోపిస్తున్నారు. హెజ్‌బొల్లాకు మద్దతునిస్తున్న ఇరాన్ కూడా ఇది ఇజ్రాయెల్ పనే అని అంటోంది. లెబనాన్, హెజ్‌బొల్లా, ఇరాన్ చేస్తోన్న వరుస ఆరోపణలతో ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ దాడి జరిగిన తీరు ఎవరూ ఊహించని విధంగా ఉంది. పేజర్లలో బాంబులు పెట్టి, అన్నీ ఒకేసారి పేలడం నిజానికి ప్రపంచాన్నే షాక్‌కు గురి చేసింది. ఆధునిక సాంకేతిక రంగంలో అగ్రగామిగా చెప్పుకునే అమెరికా సహా ప్రపంచదేశాలే నివ్వరెపోయేలా ఈ పేజర్ దాడులు జరిగాయి. నిఘా వ్యవస్థలో, రహస్య దాడుల్లో ఆరితేరిన మొసాదే ఈ పని చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్ ఇంత తెలివిగా, హెజ్‌బొల్లాకు అస్సలేమాత్రం అనుమానమే రాకుండా పేజర్లని ఉపయోగించి ఎలా దాడిచేసింది? సరిగ్గా హెజ్‌బొల్లా చేతుల్లో ఉన్న పేజర్లలోకి పేలుడు పదార్థాలు ఎలా చొప్పించింది? ఎక్కడో సరిహద్దుల అవతల ఉండి ఆ పేజర్లను ఎలా పేల్చింది? ఇజ్రాయెల్ ఇంతపెద్ద స్కెచ్ వేస్తోంటే చురుకైన ఇంటెలిజెన్స్ నేపథ్యం ఉన్న హెజ్‌బొల్లా ఎందుకు పసిగట్టలేకపోయింది?
హెజ్‌బొల్లా అతితెలివిని తెలివిగా దెబ్బతీసిన ఇజ్రాయెల్
హెజ్‌బొల్లానే లక్ష్యంగా లెబనాన్‌లో జరిగిన దాడి రాత్రికి రాత్రే జరిగిన ప్లానింగ్ కాదు. అందుకోసం వాళ్లు నెలల కిందటే ప్లాన్ చేశారు. అదెలానో తెలియాలంటే ముందుగా హెజ్‌బొల్లాకు పేజర్స్ వినియోగించాల్సిన అవసరం ఎందుకొచ్చిందో తెలుసుకోవాలి. మొబైల్ ఫోన్లతో మాట్లాడుకున్నా, మెసేజ్ చేసుకున్నా వాటిని ఇజ్రాయెల్ ఇంటెలీజెన్స్ వ్యవస్థ సిగ్నల్ ట్రాకింగ్‌తో ఇట్టే పసిగట్టేస్తుంది. ఆ భయంతోనే ఇజ్రాయెల్‌కే కాదు ఇంకెవ్వరికీ చిక్కకుండా హెజ్‌బొల్లా పాతకాలం నాటి పేజర్లను ప్రత్యామ్నాయంగా వాడటం మొదలుపెట్టింది. హెజ్‌బొల్లా ఫైటర్స్ కోసం తైవాన్‌కి చెందిన గోల్డ్ అపోలో అనే సంస్థకు 5,000 పేజర్లు తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. ఆ పేజర్లలో తక్కువ పరిమాణంలో పేలుడు పదార్థాలను దట్టించే పని మొసాద్ చేసిందని లెబనాన్ సెక్యూరిటీ అధికారులు చెప్పినట్లు రాయిటర్స్ సంస్థ రిపోర్ట్ చేసింది. ఆ తరువాత అపోలో గోల్డ్ కంపెనీ నుంచి ఆ పేజర్లు హెజ్‌బొల్లాకు సరఫరా అయ్యాయి. ఇదంతా కూడా బయటి ప్రపంచానికి తెలియకుండా జరిగిపోయిన వ్యవహారం. ఇజ్రాయెల్ చేసిందని చెబుతున్న ఈ కుట్ర, గోల్డ్ అపోలో కంపెనీకి తెలిసే జరిగిందా లేక తెలియకుండా జరిగిందా? పేజర్లు తయారు చేసే కంపెనీకి కూడా తెలియకుండా ఇజ్రాయెల్ నిఘావర్గాలు మేనేజ్ చేశాయా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాల్సి ఉంది. అయితే, తాము లెబనాన్ ఆర్డర్ చేసిన పేజర్ల తయారీని ఒక యూరప్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి చేయించామని అపోలో గోల్డ్ కంపెనీ తాజాగా ప్రకటించింది.
ఎక్కడో ఉండి లెబనాన్‌లోని పేజర్లను ఎలా పేల్చగలిగారు?
పేజర్ల తయారీ దశలోనే వాటిలో పేలుడు పదార్థాలు అమర్చడంతోపాటు, తాము భవిష్యత్‌లో వాటిని ఎప్పుడు పేల్చాలనుకుంటే అప్పుడు పేల్చేలా ఒక ట్రిగ్గర్ ఏర్పాటు చేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా జస్ట్ ఒక సాధారణ మెసేజ్ పంపిస్తే ఆ ట్రిగ్గర్ యాక్టివేట్ అయ్యేలా అధునాతన పరిజ్ఞానం ఉపయోగించారు. ఎప్పటిలాగే మంగళవారం మధ్యాహ్నం హెజ్‌బొల్లా ఉపయోగిస్తున్న పేజర్లకి ఒక మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ తమ అధినేతల నుండి వచ్చిందే అయ్యుంటుందని హెజ్‌బొల్లా మిలిటెంట్స్ భావించారు. ఆ మెసేజ్ రావడంతోనే ఆ పేజర్లలో ఉన్న రిమోట్ ట్రిగ్గర్ యాక్టివేట్ అయ్యి వెంటనే పేజర్లు వేడెక్కడం మొదలయ్యింది. ఆ తరువాత క్షణాల్లోనే ఆ పేజర్లు పేలిపోయాయి. లెబనాన్‌లో జరిగిన ఈ పేలుళ్లలో గాయపడిన వారిలో ఇరాన్ రాయబారితోపాటు హెజ్‌బొల్లా అగ్రనేతలు కూడా ఉన్నట్లు సమాచారం.
ఈ కుట్రను పసిగట్టడంలో హెజ్‌బొల్లా ఎందుకు ఫెయిలైంది?
సిగ్నల్ ట్రాకింగ్ సిస్టంకి చిక్కకుండా హెజ్‌బొల్లా అగ్రనేతలు, ఫైటర్స్ గత కొద్ది నెలలుగా ఈ పేజర్లను ఉపయోగిస్తున్నారు. ఈ దాడి విషయమై లెబనాన్‌కి చెందిన ఉన్నతస్థాయి భద్రతాధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. పేజర్లలో ఉన్న పేలుడు పదార్థాలను రెగ్యులర్ స్కానర్స్ పసిగట్టలేవని, అందుకే ఈ విషయంలో హెజ్‌బొల్లా ఫెయిలైందని అన్నారు. స్కానర్లు కూడా పసిగట్టలేని ఆ పేలుడు పదార్థాలు ఏమై ఉంటాయన్న ప్రశ్న కూడా ఇప్పుడు వినిపిస్తోంది.
ప్రతీకారం తీర్చుకుంటామన్న హెజ్‌బొల్లా
హెజ్‌బొల్లా లక్ష్యంగా జరిగిన ఈ దాడికి తప్పకుండా ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుని రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెజ్‌బొల్లా నేతలు చెబుతున్నారు. ఇజ్రాయెల్ చేసిన ఈ దాడికి తప్పకుండా తగిన శిక్ష అనుభవిస్తుందని హెజ్‌బొల్లా హెచ్చరించింది. "ఈ దాడిలో హెజ్‌బొల్లా సైనికులతో పాటు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఇది కేవలం ఏ ఒక్కరో, లేక ఇద్దరిపైనో జరిగిన దాడి కాదు.. యావత్ దేశంపైనే జరిగిన దాడి" అని హెజ్‌బొల్లా ఉన్నతాధికారి హుసేన్ ఖలీల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
హెజ్‌బొల్లా ఇంత దారుణంగా ఎప్పుడు ఫెయిలవలేదు
గతంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పనిచేసిన అమెరికాకి చెందిన మాజీ ఇంటెలీజెన్స్ ఆఫీసర్ జొనథన్ పానికాఫ్ ఈ పేజర్ల పేలుళ్ల ఘటనపై స్పందించారు. గత కొన్ని దశాబ్ధాలలో హెజ్‌బొల్లా ఇంటెలిజెన్స్ వర్గాలు ఎన్నడూ ఇంత ఘోరంగా ఫెయిల్ అవలేదని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
తమకు సంబంధం లేదన్న అమెరికా
లెబనాన్‌లో జరిగిన పేజర్ల పేలుళ్ల ఉదంతంపై అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. ఈ దాడిలో తమకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. అంతేకాదు, దాడికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం కూడా లేదన్నారు. పేలుళ్లు జరిగిన తరువాతే ఆ ఘటనపై తాము సమాచారం తెప్పించుకుంటున్నామని మాథ్యూ మిల్లర్ తెలిపారు. ఇప్పటివరకు ఏం తెలుసుకున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు మాథ్యూ స్పందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ జర్నలిస్టులు ఎలాగైతే సమాచారం తెలుసుకుంటున్నారో, తాము కూడా అలాగే తెలుసుకుంటున్నామని అన్నారు. అంతకుమించి తమ వద్ద మరే ఇతర సమాచారం లేదని మాథ్యూ బదులిచ్చారు.
ఇంతకీ ఇజ్రాయెల్ ఏం చెబుతోంది?
లెబనాన్‌లో పేజర్ల పేలుళ్ల దాడి కచ్చితంగా ఇజ్రాయెల్ చేసిన పనేనని లెబనాన్, హెజ్‌బొల్లా ఆరోపిస్తున్నాయి. హెజ్‌బొల్లాను వెనుకుండి నడిపిస్తున్న ఇరాన్ కూడా అదే వాదన వినిపిస్తోంది.
ఇక ఇదే విషయమై అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ కూడా ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ దాడిని ఇజ్రాయెల్ నిఘా సంస్థ అయిన మొసాద్, అలాగే ఇజ్రాయెల్ మిలిటరీ కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అని తెలిసిందని సీఎన్ఎన్ ఆ వార్తా కథనంలో పేర్కొంది. అంతేకాదు, ఈ విషయంపై మాట్లాడదలచుకోలేదని ఇజ్రాయెల్ మిలిటరీ చెప్పినట్లు కూడా ఆ వార్తా కథనం స్పష్టంచేసింది. అయితే, ఇజ్రాయెల్ ఇప్పటివరకు ఈ దాడిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఏదేమైనా, మొన్నటికి మొన్న గాజాలో హమాస్ శిబిరాలపై వైమానిక దాడులు, నిన్న ఇలా లెబనాన్‌లో హెజ్‌బొల్లానే లక్ష్యంగా జరిగిన పేజర్ల పేలుళ్ల దాడితో ఇజ్రాయెల్ విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే, సాంకేతిక దాడుల్లో తమ సత్తా ఏంటో ఇజ్రాయెల్ ఈ దాడులతో చాటుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెజ్‌బొల్లా ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.