Nepal Landslide Today : నదిలోకి దూసుకెళ్లిన 2 బస్సులు..63 మంది ప్రయాణికులు గల్లంతు
Nepal Landslide Today :
Nepal Landslide Today : నేపాల్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఉదయం సెంట్రల్ నేపాల్‌లోని మదన్-అషిర్తా హైవేపై భారీ కొండచరియలు విరిగిపడటంతో సుమారు 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో బస్సులో ఉన్న 63 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టాయి. నదిలో గల్లంతైన వారిని రక్షించేందుకు స్థానికులు కూడా అధికార యంత్రాంగానికి సహకరిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, రెండు బస్సులలో బస్సు డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన తెల్లవారుజామున 3:30 గంటలకు జరిగినట్లు సమాచారం.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్థరాత్రి కావడం..చీకటి ఉండటంతో కొండచరియలు పడినట్లు డ్రైవర్లు గుర్తించలేకపోయారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగి పడటంతో రెండు బస్సులు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. నేపాల్‌లోని చిత్వాన్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇంద్రదేవ్ యాదవ్ మాట్లాడుతూ.. సంఘటన స్థలంలో ఉన్నామని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని మీడియాకు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సహాయచర్యలకు ఇబ్బందికలిగిస్తున్నాయన్నారు. గత కొన్ని రోజులుగా నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీని వల్ల ఇప్పటి వరకు చాలా మంది చనిపోయారు. చాలా చోట్ల కొండచరియలు విరిగిపడటంతో నివాస ప్రాంతాలు దెబ్బతిన్నాయి.