New Zealand: గిన్నీస్ రికార్డులకెక్కిన బాహుబలి ఆలు
New Zealand: న్యూజీలాండ్‌లో 7.8 కేజీల బంగాళదుంప
New Zealand: బంగాళదుంప అంటే ఎంత ఉంటుంది? మహా అంటే పిడికిలి కంటే కొంచెం పెద్ద సైజులో ఉండొచ్చు. కానీ న్యూజీలాండ్‌లో వెలుగుచూసిన ఓ బంగాళ దుంపను చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఇప్పుడు దుంప ఏకంగా గిన్నీస్‌బుక్ రికార్డులకు ఎక్కింది. నిజానికి గతేడాది ఆగస్టులోనే దాన్ని గుర్తించినా శాస్త్రీయమైన పరిశోధనలు పూర్తి చేసిన తరువాత తాజాగా బాహుబలి దుంపగా గిన్నీస్‌బుక్ ప్రకటించింది. 7 కిలోలా 800 గ్రాముల బరువున్న ఈ బంగాళా దుంపను చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
న్యూజీలాండ్‌లోని క్రెయిగ్ బ్రౌన్, డొన్నా దంపతులకు తమ తోటలో ఈ బంగాళ దుంప కనిపించింది. బంగారు వర్ణంలో ఉన్న ఈ దుంపను ఏదో అనుకుని తవ్వి వెలికి తీశారు. అయితే దాని రుచి చూసిన తరువాత ఆలుగడ్డగా గుర్తించారు. 2011లో బ్రిటన్‌లో 5 కేజీల బరువున్న బంగాళదుంపను గుర్తించారు. అప్పట్లో అది గిన్నీస్‌బుక్ రికార్డులకు ఎక్కింది. దాని రికార్డును బ్రేక్ చేస్తూ 7 కేజీల 800 గ్రాముల బరువున్న న్యూజీలాండ్‌కు చెందిన బంగాళదుంప తాజాగా గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించింది. స్థానికంగా ఈ బంగాళ దుంప సెలబ్రిటీగా మారింది. పలువురు దాన్ని చూసేందుకు తరలివస్తున్నట్టు క్రేయిగ్-డొన్నా దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.