Nepal - Fuel Shortage: నేపాల్‌కు చమురు సెగ.. భారీగా పెరిగిన చమురు కొరత...

Nepal - Fuel Shortage: ప్రభుత్వ రంగ సంస్థలకు రెండ్రోజులు సెలవులు...

Update: 2022-04-18 09:25 GMT

Nepal - Fuel Shortage: నేపాల్‌కు చమురు సెగ.. భారీగా పెరిగిన చమురు కొరత...

Nepal - Fuel Shortage: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ప్రపంచంలోని పలు దేశాలకు తీరని కష్టాలను తెచ్చిపెడుతోంది. అసలే ఆర్థిక సంక్షోభం(Economic Crisis) తో అల్లాడుతున్న శ్రీలంకలో.. చమురు దిగుమతులు నిలిచిపోవడంతో.. ప్రజలు తీవ్ర ఆందోళనలు చేశారు. పొరుగున ఉన్న పాకిస్థాన్‌లోనూ చమురు ధరలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం మన దేశంలోనూ ధరలు పెరుగుతున్నప్పటికీ చమురు కొరత అయితే లేదు.. మన పొరుగు దేశమైన నేపాల్‌(Nepal) లోనూ ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి.

ఉన్న చమురును కాపాడుకునేందుకు ఏకంగా నేపాల్‌ ప్రభుత్వం పబ్లిక్‌ సెక్టార్లకు రెండ్రోజులు సెలవు మంజూరు చేసే దిశగా అడుగులు వేస్తోంది. చమురు కష్టాలను తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చేపడుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టిన నాటి నుంచి అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 24కు ముందు బ్యారెల్‌ ధర 90 డాలర్లు పలికేది. యుద్ధం తరువాత ఒకానొక దశలో బ్యారెల్‌ ముడి చమురు ధర 130 డాలర్లకు చేరుకుంది.

ప్రస్తుతం.. బ్రైంట్‌ రకం బ్యారెల్‌ ధర 112 డాలర్ల పలుకుతోంది. క్రూడాయిల్‌(Crude Oil) ధరలు పెరిగినా.. సరఫరా ఆగిపోవడంతో పలు చిన్న దేశాలు విలవిలలాడుతున్నాయి. మన పొరుగున ఉన్న శ్రీలంక, పాకిస్థాన్‌, నేపాల్‌లో పెట్రోలు, డీజిల్‌ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. మన దేశంలోనూ లీటరు పెట్రోలు, డీజల్‌పై 10 రూపాయల మేర పెరిగింది. అయితే శ్రీలంకలో మాత్రం చమురు కొరత తీవ్రమైంది. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకేయులకు ఇంధన కొరత మరింత క్రుంగదీసింది.

పాకిస్థాన్‌(Pakistan) లోనూ కొత్త ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ ధరలు పెంచేందుకు సిద్ధమైనట్టు తెలిపింది. లీటరు పెట్రోలుపై ఏకంగా 21 రూపాయలు, లీటరు డీజిల్‌పై 51 రూపాయలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ చమురు సెగ ఇప్పుడు నేపాల్‌ను తాకింది. ఇంధన దిగుమతులు నిలిచిపోవడంతో హిమాలయ దేశం అల్లాడుతోంది. పర్యాటక రంగమే నేపాల్‌ ప్రధాన ఆదాయం. కరోనా నేపథ్యంలో నేపాల్‌కు పర్యాటకులు రాక ఆగిపోయింది. దీంతో ఆ దేశ ఆదాయం పూర్తిగా పడిపోయింది.

ఫలితంగా విదేశీ మారకం నిల్వలు తగ్గిపోయాయి. మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా.. ఇప్పుడు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. నాలుగైదు రోజుల్లో ముగుస్తుందనకున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం 50 రోజులు దాటినా ఎండ్‌ కార్డు మాత్రం పడలేదు. ఆ యుద్ధం ఎన్ని రోజులు సాగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ప్రధాన చమురు ఎగుమతిదారైన రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. చమురు నిల్వలు అత్యధికంగా ఉండే ఇరాన్‌, వెనుజులా దేశాల మీదా ఆంక్షలు ఉన్నాయి.

దీంతో నేపాల్‌ చమురు దిగుమతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక సబ్సిడీకి ఇంధనాన్ని విక్రయించే నేపాల్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అంతర్జాతీయంగా పెరిగిన ధరల కారణంగా నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో దేశ వ్యాప్తంగా చమురు కొరత నెలకొంది. చమురు ఇబ్బందులను పరిష్కరించేందుకు నేపాల్‌ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో చమురు భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ నెలలో రెండ్రోజులు సెలవులు ప్రకటించాలని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ నేపాల్-సీబీఎన్‌‌, నేపాల్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌-ఎన్‌వోసీ ప్రభుత్వానికి సూచించాయి. అయితే దీనిపై నేపాల్‌ ప్రభుత్వం స్పందించిది. రెండ్రోజుల సెలవు విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది.

చమురు నిధుల చెల్లింపుల కోసం డాలర్ల కొరతను అధిగమించేందుకు విదేశాల్లో ఉండే నేపాలీలు డాలర్ల రూపంలో పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం కోరింది. అంతేకాకుండా. ఖరీదైన కార్లు, విలాసవంతమైన వస్తువులు, బంగారం వంటి దిగుమతులు తగ్గించుకునేందుకు చర్యలు చేపడుతోంది. శ్రీలంక సంక్షోభాన్ని నేపాల్‌ ప్రభుత్వం గుర్తించిందేమో... పూర్తిగా మునిగిపోకముందే.. చర్యలకు ఖాట్మాండు వర్గాలు ఉపక్రమించాయి. ఇలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే శ్రీలంక తీవ్ర సంక్షోభంలో కూరుకపోయింది. అయితే శ్రీలంకకు, నేపాల్‌కు ఉన్నా సారూప్యత ఏమిటంటే.. ఇరు దేశాలకు కూడా పర్యాటక రంగమే ప్రధాన ఆదాయం.

అంతేకాకుండా ఇరు దేశాలు చైనా నుంచి భారీగా అప్పులు తీసుకున్నాయి. భవిష్యత్తుపై అంచనా లేకపోవడంతో శ్రీలంక ప్రభుత్వం విదేశీ దిగుమతులు, ప్రాజెక్టులకు ఇష్టారాజ్యంగా నిధులను వెచ్చించింది. ప్రస్తుత సంక్షోభాన్ని కొని తెచ్చుకుంది. ఇంధన కొరత నెలకొంటోందని నేపాలీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా పెట్రోలు బంకుల ఎదుట క్యూలు కడుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి.. ఫుల్‌ ట్యాంకుతో పాటు అధనంగా పెట్రోలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే చమురు కొరతతో పలు పెట్రోలు బంకులు మూతపడ్డాయి. దీంతో ప్రజలు అప్రమత్తమవుతున్నారు.

అధికంగా చమురును కొనుగోలు చేస్తున్నారు. చమురు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ కొరతతో ధరలు నింగినంటే అవకాశం ఉందని పెట్రోలు బంకులు యజమానులు చెబుతున్నారు. మరోవైపు చమురు రవాణా వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. రవాణా చార్జీలను పెంచాలని డిమాండ్‌ చేస్తూ.. నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నాయి. దీంతో చమురు కొరత మరింత తీవ్రమైనట్టు నేపాలీ ప్రజలు చెబుతున్నారు. ఏదేమైనా ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో పలు చిన్న దేశాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది. యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌, రష్యా కంటే.. ఈ చిన్న దేశాలే అధికంగా నష్టపోతుండడం గమనార్హం.

Tags:    

Similar News