Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు.. చెవికి తాకిన బుల్లెట్‌..

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మరోసారి అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై దాడి జరిగింది.

Update: 2024-07-14 04:53 GMT

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మరోసారి అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై దాడి జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. వేదికపై ట్రంప్‌ మాట్లాడుతుండగా ఒక్కసారిగా అగంతకుడు కాల్పులు జరిపాడు. దీంతో ట్రంప్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అలర్టయిన సెక్యూరిటీ.. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల ఘటనలో ట్రంప్‌ చెవికి తీవ్ర గాయమైంది. అయితే.. ఆ బుల్లెట్‌ ప్రచారానికి హాజరైన మరో వ్యక్తికి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు.

ట్రంప్‌ ప్రచారం నిర్వహిస్తుండగా దుండగుడు కాల్పులు జరిపారు. దీంతో ఆయన ఒక్కసారిగా స్టేజిపై కింద పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్‌ చుట్టూ మోహరించారు. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్.. తన మద్దతుదారులకు పిడికిలి బిగించి నినాదాలు చేసి ఉత్సాహపరిచారు. ఆయన ముఖానికి రక్తం కూడా అంటుకోవడంతో వేదిక పైనుంచి దించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ట్రంప్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్టు భద్రతా అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్టున్నట్టు చెప్పారు.

తనపై జరిగిన కాల్పుల ఘటనపై స్పందించారు డొనాల్డ్ ట్రంప్. తన కుడిచెవి పైభాగంలో బుల్లెట్ తగిలిందన్నారు. ఊహించని ఘటన జరిగిందని అర్థమైందని, ఏదో దూసుకెళ్లినట్లు శబ్దం వచ్చిందని ఆయన చెప్పారు. చర్మంలోకి బుల్లెట్ దూసుకుపోయిందని, తీవ్ర రక్తస్రావం జరిగిందని అన్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు అధ్యక్షుడు జో బైడెన్. తాను ట్రంప్, ఆయన ఫ్యామిలీ, అక్కడ ఉన్న ప్రజలందరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో ఇలాంటి హింసకు తావు లేదని ఆయన ట్వీట్‌ చేశారు. ఇక.. కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అటు.. ట్రంప్‌పై కాల్పుల ఘటనపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఖండించారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అమెరికాలో హింసకు చోటు లేదన్నారామె.

ట్రంప్‌పై కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు ప్రధాని మోడీ. ట్రంప్‌పై దాడి ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసిందని, రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


Full View


Tags:    

Similar News