Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని పదవికి రిషి సునక్‌ నామినేషన్‌

Rishi Sunak: కర్జర్వేటివ్‌ లీడర్‌, ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్టు వెల్లడి

Update: 2022-07-10 08:25 GMT

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని పదవికి రిషి సునక్‌ నామినేషన్‌

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవికి భారత సంతతికి చెందిన కన్సర్వేటివ్‌ ఎంపీ రిషి సునక్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. కన్జర్వేటివ్‌ లీడర్‌ రేసులో తాను కూడా ఉన్నానని, ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరో ఒకరు ముందడుగు వేసి... సరైన నిర్ణయం తీసుకోవాలల్సిన అవసరం ఉందని రిషి తెలిపారు. అందుకే తాను ముందుకు వచ్చినట్టు స్పస్టం చేశారు. ఇప్పటికే ఆయన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. రెడీ ఫర్‌ రిషి పేరుతో ఓ వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. ఆ వీడియోలో తన గతాన్ని తెలిపారు. తన నాయనమ్మ మంచి జీవితం కోసం ఇంగ్లాండ్‌కు వచ్చిందని తామె తమ కోసం ఎంతో కష్టపడిందని చెప్పారు.

తనకు కుటుంబమే సర్వస్వమని ఎంపీ రిషి తెలిపారు. తన తల్లి ఫార్మసిస్ట్‌ అని.. తండ్రి జాతీయ ఆరోగ్య సేవల్లో వైద్యుడని చెప్పారు. తన కుటుంబం అన్నీ ఇచ్చిందన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించే అవకాశం రావాలనే తాను రాజకీయల్లోకి వచ్చినట్టు రిషి తెలిపారు. ప్రస్తుతం దేశం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకుని.. తమ ప్రధానిని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు వేసే ఓటే బ్రిటీష్‌ ప్రజల తరువాత తరంపై ప్రభావం చూపుతందన్నారు. రాజకీయాలపై నమ్మకం పెంచుకుని.. ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతురు అక్షతా మూర్తితో 2009లో పెళ్లయ్యింది. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో ఎంబీకే చదువుకునే రోజుల్లో అక్షతా మూర్తితో పరిచయం ఏర్పడింది. 2014లో పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన రిషి సునక్‌ తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగాడు. బ్రెగ్జిట్‌ ఉద్యమంతో బోరిస్‌ జాన్సన్‌ సాన్నిహిత్యం పెరిగింది. దీంతో బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. కరోనా సమయంలో సమర్థవంతంగా పని చేసి ప్రజల మనన్న పొందారు. అయితే కరోనా సమయంలో బర్త్‌డే సందర్భంగా బోరిస్‌ జాన్సన్‌ ఇచ్చిన విందు.. తీవ్ర దుమారం రేపింది. ఆ విందులో రిషి కూడా పాల్గొన్నారు. దీనితో పాటు భార్య పౌరసత్వం, పన్నుల మినహాయింపు వంటివి సునక్‌కు మైనస్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

పార్టీ గేట్‌, ఇతర కుంభకోణాలతో బోరిస్‌ జాన్సన్‌ ఉక్కిరి బిక్కిరి అయ్యారు. తాజాగా క్రిష్‌ పించర్‌కు డిప్యూటీ మేయర్‌ పదవిని కట్టబెట్టడంపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కుంభకోణంతో బోరిస్‌ కేబినెట్‌లో తాము ఉండలేమంటూ.. ఆర్థిక శాఖ మంత్రి పదవికి రిషి సునక్‌, ఆరోగ్య శాఖ మంత్రి పదవికి సాజిద్‌ జావెద్ రాజీనామా చేశారు. ఆ తరువాత 50 మంది మేర వరుస రాజీనామాలతో బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. పార్టీ మంత్రులు, ఎంపీల ఒత్తిడికి బోరిస్‌ జాన్సన్‌ తలొగ్గారు. పదవికి రాజీనామా చేస్తున్నట్టు బోరిస్‌ ప్రకటించారు. అయితే అక్టోబరులోగా కొత్త ప్రధాని ఎన్నిక పూర్తవుతుందని తెలిపిన బోరిస్‌.. ప్రధాని కార్యాలయాన్ని వీడెందుకు ససేమిరా అంటున్నారు. కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకు ఇక్కడే ఉంటానని పట్టుబడుతున్నారు.

Tags:    

Similar News