ఫోర్బ్స్ 2022 కుబేరుల జాబితా విడుదల.. జాబితాలో 166 మంది భారతీయులు.. 12 మంది తెలుగువారికి చోటు
Forbes Billionaires List 2022: ప్రపంచ కుబేరుడు, ఎలక్ట్రికల్ కార్ల సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మళ్లీ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌లో నిలిచాడు.
Forbes Billionaires List 2022: ప్రపంచ కుబేరుడు, ఎలక్ట్రికల్ కార్ల సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మళ్లీ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌లో నిలిచాడు. 16 లక్షల కోట్ల రూపాయల సంపదతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్‌ను ఎలాన్ మస్క్ వెనక్కి నెట్టారు. ఈసారి టాప్‌టెన్ కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చేరారు. 6 లక్షల 80వేల కోట్ల రూపాయల సంపదతో భారత్‌లో నెంబరు వన్ కుబేరుడిగా ముకేష్ అంబానీ నిలిచారు. ప్రపంచ కుబేరుల జాబితాలో 10వ స్థానంలో ముకేశ్ అంబానీ నిలవగా, 11వ స్థానంలో అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ నిలిచారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వైపు కరోనా కల్లోలం అలా ముగిసిందో లేదో.. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. ఏడాదంతా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అయినా ప్రపంచ కుబేరుల జాబితా ఏమాత్రం తగ్గలేదు. బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2022 కుబేరుల జాబితాను తాజాగా విడుదల చేసింది. మొత్తం 2వేల 668 మంది కుబేరులకు ఫోర్బ్స్ 36వ వార్షిక ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కింది. వారి మొత్తం సంపద 960 లక్షల కోట్ల రూపాయలని ఫోర్స్బ్ తెలిపింది. అయితే 2021 జాబితాతో పోలిస్తే.. 87 మంది కుబేరులు తగ్గారు. మొత్తం సంపదలో 3వేల 24 కోట్ల రూపాయలు తగ్గాయి. అయితే ఈసారి వెయ్యి మంది బిలియనీర్లు గతేడాది కంటే ఈసారి తమ సంపదను మరింత పోగేసుకున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో కొత్తగా 236 మంది బిలియనీర్లు చేరారు. తాజా బిలియనీర్ల జాబితాలో 166 మంది భారతీయులకు చోటు దక్కింది. వారిలో 12 మంది తెలుగువారు ఉండడం విశేషం.
ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ మళ్లీ ప్రపంచ కుబేరుడి స్థానాన్ని దక్కించుకున్నారు. 16 లక్షల కోట్లతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్‌ను వెనక్కి నెట్టి.. ఫోర్స్ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ఎలాన్ మస్క్ నిలిచారు. సుమారు 13 లక్షల కోట్లతో జెఫ్ బేజోస్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. నాలుగేళ్లుగా రెండో స్థానంలో నిలచే 50 ఏళ్ల ఎలాన్ మస్క్ ఈ ఏడాది కార్ల విక్రయంలో 5 లక్షల కోట్లను అదనంగా సంపాదించి సంపదను వృద్ధి చేసుకోవడంతో అగ్రస్థానం వరించింది. ఎల్‌వీఎంహెచ్‌కు చెందిన బెర్నడ్ అర్నో కుటుంబం మూడో స్థానంలో నిలవగా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ నాలుగో స్థానంలో, బెర్క్‌షైర్ హాతవే చైర్మన్ వారెన్ బఫెట్ ఐదో ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. 6 లక్షల కోట్ల రూపాయలతో టాప్ టెన్ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీనే అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ 11వ స్థానంలో నిలిచారు.
ఫోర్స్బ్ జాబితాలో 166 మంది భారతీయులకు చోటు దక్కింది. వారిలో 12 మంది తెలుగు వారు ఉన్నారు. వారంతా ఫార్మా రంగానికి చెందిన పారిశ్రామిక వేత్తలే కావడం విశేషం. ఇక భారతీయ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్‌లో 6 లక్షల 80 వేల కోట్ల రూపాయల సంపదతో ముకేశ్ నెంబరు వన్‌గా నిలిచారు. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ 6 లక్షల 75 వేల కోట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. అయితే రోజువారీగా ధనవంతుల సంపదలో హెచ్చుతగ్గులను సూచించే ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీరస్ జాబితా ప్రకారం అదానీయే భారత అగ్ర కుబేరుడు. ప్రస్తుతం ఆయన ఆస్తి 8 లక్షల 35 వేల కోట్ల రూపాయలు. ముకేశ్ అంబానీ నెట్‌వర్త్ 7 లక్షల 54వేల కోట్ల రూపాయలు. అంతేకాదు రియల్ టైమ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అదాని 9వ స్థానానికి ఎగబాకగా, అంబానీ 10వ స్థానానికి పరిమితమయ్యారు.
ఈసారి ఫోర్బ్స్ జాబితాలో అమెరికన్ కుబేరుల హవా కొనసాగింది. అమెరికా నుంచి అత్యధికంగా 735 మంది కుబేరులకు ఈసారి జాబితాలో స్థానం దక్కింది. వారి సంపద మొత్తం 35 లక్షల కోట్ల రూపాయలు. అత్యధిక కుబేరులున్న దేశాల జాబితాలో చైనా రెండో స్థానంలో నిలిచింది. చైనాలో మొత్తం 607 బిలియనీర్లకు ఫోర్బ్స్ జాబితాలో చోటు లభించింది. వారి సంపద విలువ 17 లక్షల కోట్ల రూపాయలుగా ఫోర్బ్స్ స్పష్టం చేసింది. ఇక రష్యా, చైనా నుంచి బిలియనీర్ల సంఖ్య తగ్గింది. ఉక్రెయిన్ ఆక్రమణతో రష్యా బిలియనీర్ల సంపద పడిపోయింది. దీంతో 34 మంది బిలియనీర్ల సంఖ్య తగ్గింది. అయితే చైనాలోనూ 87 మంది కుబేరులు తగ్గారు. అక్కడి కంపెనీలపై చైనా ప్రభుత్వం ఉక్కు పాదం మోపడమేనని ఫోర్బ్స్ తెలిపింది.
2022 మార్చి 11 నాటికి స్టాక్ విలువ, ఎక్స్చేంజ్ ధరల ఆధారంగా కుబేరుల జాబితాను రూపొందించినట్టు అమెరికా బిజినెస్ మ్యాగజైన్ స్పష్టం చేసింది. ఏటా ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన తరువాత వార్షిక ధనవంతుల జాబితాను సిద్ధం చేస్తుంది ఫోర్బ్స్. అయితే రోజువారీ ధనవంతుల జాబితాను కూడా ఫోర్బ్స్ ప్రత్యేకంగా రూపొందిస్తుంది.