Sri Lanka: ఆహార, ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక

Sri Lanka: *సిలిండర్ ధర రూ.2,657, లీటర్ పాలు రూ.1,195 *సరఫరా తగ్గింది.. ఆహార కొరత ఏర్పడింది

Update: 2021-10-12 05:41 GMT

Sri Lanka: ఆహార, ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక

Sri Lanka: ద్వీప దేశం శ్రీలంక ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతోంది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో నిత్యావసరాల ధరలు అమాంతం ఆకాశన్నంటాయి. నిత్యావసర ఆహార పదార్థాలపై ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేయడమే ఇందుకు కారణం. దీంతో ప్రస్తుతం అక్కడ వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 90శాతం పెరిగి 2వేల 675కు చేరింది.

ఇక కిలో పాల ధర ఐదు రెట్లు పెరిగి 11వందల 95గా ఉంది. గోధుమపిండి, పంచదార, పప్పులు ఇతర నిత్యావసర వస్తువులు, సిమెంట్ సహా దాదాపు అన్నింటి ధరలూ ఆకాశాన్నంటాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు.

ఏడాది కాలంగా శ్రీలంకను ఆహార, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా పతనమైంది. మరోవైపు కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌తో ఎగుమతులు దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది.

దీంతో ఉన్న కాసిన్ని విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. అయితే నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమ పిండి, కూరగాయాలు వంటి వస్తువులకు కూడా శ్రీలంక దిగుమతులపైనే ఆధారపడాలి. ప్రభుత్వ నిషేధంలో ఆ వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి.

గత గురువారం అధ్యక్షుడు రాజపక్స అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని నిర్ణయించింది. దీని వల్ల అక్రమ నిల్వలను బయటకు తీసుకురావొచ్చని, తద్వారా సరఫరా పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే నిత్యావసరాలపై ధరల నియంత్రణను తొలగిస్తున్నట్లు గత శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి!

Tags:    

Similar News