Israel-Hamas War: ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య భీకర యుద్ధం

Israel-Hamas War: బందీలను విడిపించేందుకు ఖతార్ మధ్యవర్తిత్వం

Update: 2023-10-10 10:15 GMT

Israel-Hamas war: ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య భీకర యుద్ధం

Israel-Hamas War: ఇజ్రాయెల్‌ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ హమాస్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. డ్రోన్ దాడులు, రాకెట్ లాంఛర్లతో దక్షిణ ఇజ్రాయెల్‌ భీతావహంగా మారింది. హమాస్‌ మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ జవాన్ల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. గాజా నుంచి ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చొచ్చుకువచ్చిన తీవ్రవాదులు వీధుల్లో జవాన్లతో తలపడుతున్నారు. హమాస్‌ దుశ్చర్య పట్ల ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌ సైన్యం పెద్ద సంఖ్యలో రాకెట్లను గాజాపై ప్రయోగించింది. ఈ దాడుల్లో గాజాలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల నుంచి తప్పించుకోవడానికి గాజా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇప్పటికే 20 వేల మంది ఇళ్లు విడిచి వెళ్లిపోయినట్లు అంచనా. దాడులు, ప్రతి దాడుల్లో ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌, గాజాలో కలిపి 15 వందల మందికిపైగా మరణించినట్లు తెలుస్తోంది.

హమాస్‌ దాడులకు ప్రతీకారంగా వారు తలదాచుకుంటున్న సరిహద్దులోని గాజా స్ట్రిప్‌ను అష్టదిగ్బంధనం చేసే యోచనలో ఉన్నట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడంతో పాటు ఆ ప్రాంతానికి పూర్తిగా ఆహారం, ఇంధన సరఫరాలను స్తంభింపజేసి, వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. తమ దేశంపై దాడి చేయడమే కాకుండా.. ఇక్కడి మహిళలను బందీలుగా తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేస్తున్న నేపథ్యంలో వాళ్లను కలుగుల్లోంచి బయటకు లాగేందుకే ఇజ్రాయెల్‌ ఈ వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచంలో అధికశాతం రవాణా జలమార్గాల ద్వారానే జరుగుతుంది. ప్రస్తుతం గాజాకు కూడా ఇదే ప్రధాన ఆధారం. అందువల్ల ఇజ్రాయెల్‌ ప్రధానంగా గాజాను జలదిగ్బంధనం చేయాలని యోచిస్తోంది. దీనికోసం గాజా సరిహద్దులోని పోర్టులు, తీరప్రాంతాలు, సముద్ర చెక్‌పాయింట్ల వద్ద తమ సైన్యాన్ని మోహరిస్తుంది. అనుమానాస్పదంగా కనిపించిన ఓడలను పరిశీలించి.. గాజాకు సరకులు సరఫరా చేస్తున్నట్లు తేలితే.. వెంటనే వాటిని వెనక్కి తిప్పిపంపుతుంది. ఇక గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్‌ తమ సేనలను భారీగా మోహరిస్తుంది. రోడ్డు మార్గం ద్వారా ఆ ప్రాంతానికి ఎలాంటి సరకులు వెళ్లకుండా అడ్డుకుంటుంది. కేవలం సరకులు మాత్రమే కాకుండా అనుమానాస్పద వ్యక్తులను కూడా లోపలికి అనుమతించడం లేదు. శత్రువులకు కావాల్సిన సామగ్రి వాయుమార్గంలో కూడా వెళ్లకుండా.. వైమానిక దళాన్ని ఇజ్రాయెల్‌ మోహరిస్తుంది. ఇక కీలకమైన ఆర్థిక వ్యవస్థపై కూడా ఇజ్రాయెల్‌ ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి.

గత మూడ్రోజులుగా ఇజ్రాయెల్ దళాలకు, హమాస్ మిలిటెంట్లకు మధ్య భీకర పోరు సాగుతోంది. హమాస్ మిలిటెంట్ గ్రూప్ చేపట్టిన భయానక దాడుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇజ్రాయెల్ ప్రతీకార జ్వాలలతో రగిలిపోతోంది. గాజా స్ట్రిప్ లోని హమాస్ స్థావరాలను వెతికి మరీ నేలమట్టం చేస్తోంది. అయితే, పౌర నివాస సముదాయాల నడుమ ఉన్న హమాస్ స్థావరాలపై వైమానిక, క్షిపణి దాడులు దాడి చేయడం వల్ల సాధారణ పౌరులు బలవుతుండడంతో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ ఎత్తున భూతల యుద్ధం చేపట్టడం ద్వారా హమాస్ ను తుదముట్టించాలని భావిస్తోంది. అందుకోసం 3 లక్షల మంది రిజర్వ్ సైనికులను రంగంలోకి దించింది. గాజా స్ట్రిప్ లో ఉన్న సాధారణ పౌరులు తమ నివాసాల నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

ఇక మిలిటెంట్‌ సంస్థ హమాస్‌ చెరలో ఉన్న ఇజ్రాయెల్‌ మహిళలు, చిన్నారులను విడిపించేందుకు ఖతార్‌ రంగంలోకి దిగింది. ఆ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న 36 మంది పాలస్తీనా మహిళలు, చిన్నారులను విడుదల చేస్తే.. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారిని అప్పగించేలా మధ్యవర్తిత్వం చేస్తోంది. ఈ మేరకు హమాస్‌ కీలక నేతలతో ఖతార్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మరోవైపు తమ చేతిలో ప్రస్తుతం 100 మందికి పైగా ఇజ్రాయెల్‌ మహిళలు, చిన్నారులు ఉన్నట్లు హమాస్‌ చెబుతోంది. కానీ, కచ్చితమైన సంఖ్యను మాత్రం బయటపెట్టడం లేదు. ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని ఇజ్రాయెల్‌ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం 36 మంది పాలస్తీనియన్ల కోసం.. వందలాది మందిని విడుదల చేసేందుకు హమాస్‌ అంగీకరిస్తుందా? అనే విషయంపై స్పష్టత లేదు. 

Tags:    

Similar News