Whittier Town: ఒకే భవనంలో నివసిస్తున్న గ్రామం
Whittier Town: అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో విట్టియర్‌లోని.. ఒకే భవనంలోనే అన్ని సదుపాయాలు.. స్కూల్ మాత్రం వేరే చోట
Whittier Town: సాధారణంగా ఊళ్లు ఎలా ఉంటాయి? మన దగ్గరైతే.. ఓ ఆలయము, బొడ్రాయి.. చావడి, స్కూలు, పంచాయతీ కార్యాలయం ఇలా ఉంటాయి.. అదే విదేశాల్లో అనుకోండి.. కాలనీలు, దుకాణాలు స్కూళ్లు, ఓ ప్రార్థనా మందిరం ఇలా ఉంటాయి. ఊరు అంటే.. మనకు టక్కున ఇవే గుర్తొస్తాయి. కానీ.. అమెరికాలోని అలస్కా రాష్ట్రంలోని విట్టియార్ అనే గ్రామానికి వెళ్తే మాత్రం ఆశ్చర్యపోతారు. ఇదేమి చోధ్యమని ముక్కున వేలేసుకుంటారు.. మనం గ్రామంటే ఊహించుకున్న ఊహలకు పూర్తి భిన్నంగా ఉంటుంది విట్టియార్. 300 మంది జనాభా ఉన్నా... ఆ గ్రామస్థులందరూ ఒకే భవనంలో ఉంటారు. పోస్టాఫీసు నుంచి పోలీసుస్టేషన్ వరకు.. షాపింగ్ మాల్ నుంచి ఆసుపత్రి వరకు... ఇలా అన్నీ ఆ భవనంలోనే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
అలస్కా రాష్ట్రంలోని అంకోరేజ్ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విట్టియార్ గ్రామం. ఈ గ్రామం జనాభా మొత్తం 300 మంది. అందులో 180 మందికి పైగా ప్రజలు 14 అంతస్థుల భవనంలోనే నివసిస్తున్నారు. ఆ భవనం పేరు బిగిచ్ టవర్స్. ఈ భవనం చుట్టూ ఇతర ఇళ్లు కూడా ఉన్నాయి. కానీ.. ఉండేది మాత్రం చాలా తక్కువ మందే. అయితే అధికశాతం మంది ప్రజలు ఒకే భవనంలో ఉండడం వెనుక ఓ కారణం ఉంది. విట్టియార్ గ్రామం నిరంతరం మంచుతో కప్పబడి ఉంటుంది. మంచు నుంచి రక్షణకు.. ప్రజలకు హీటర్లు పెట్టడం పెద్ద సమస్యగా మారింది. అంతే కాకుండా.. రక్షణ పరంగా కూడా భద్ర కల్పించడం ఇబ్బందిగా మారింది. దీంతో గ్రామస్థులందరినీ ప్రభుత్వం బిగిచ్ టవర్‌లోకి తరలించింది.
ఎవరైనా విట్టియార్ గ్రామ సందర్శనకు వచ్చే టూరిస్టులకు కూడా బిగిచ్ టవర్స్‌లోనే వసతి, బస ఏర్పాటు చేస్తారు. అంతేకాదు.. బిగిచ్ టవర్స్‌లోనే చిన్న షాపింగ్ మాల్, పోస్టాఫీసు, పోలీసు స్టేషన్ ఆసుపత్రి ఉన్నాయి. మరో విచిత్రమేమిటంటే.. బిగిచ్ టవర్స్‌లో అన్ని ఉన్నా... స్కూల్‌ను మాత్రం ఏర్పాటు చేయలేదు. స్కూల్‌కు వెళ్లాలంటే.. పిల్లలు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. భవనం నుంచి స్కూల్‌కు ఒక సొరంగ మార్గం ఉంది. నిత్యం విద్యార్థులు ఈ సొరంగ మార్గంలోనే వెళ్లి వస్తుంటారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నా.. ఇటీవల ఈ గ్రామం బాగా ప్రచారమవుతోంది. దీంతో విట్టియార్ విశేషాలను తెలుసుకుని.. చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. పర్యాటకుల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు కూడా వెలిశాయి.
విట్టియర్ గ్రామాన్ని ఏటా 70వేల మందికి పైగా సందర్శిస్తున్నారు. ఇక్కడకు వెళ్తే.. సముద్రంతో పాటు మంచు కొండలను కూడా సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే.. అమెరికాలోనే అత్యంత పొడవైన 2.5 మైళ్ల సొరంగ మార్గం గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక అక్కడ సముద్రతీరంలో నౌకలోనూ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ రెస్టారెంట్లన్నీ అందుబాటులోనే ఉంటాయి. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడిన కొండలతో ఉంటుంది. చూసేందుకు కూడా ఎంతో మనోహరంగా ఉంటుంది. అందుకే ఇక్కడికి పర్యాటకులు ఏటా పెరుగుతున్నారు. విట్టియార్‌కు వెళ్లాంటే మాత్రం కొండల మధ్యన, ఘాట్ రోడ్లు, టన్నెళ్లలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తెలియని వారికి ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రయాణమే.