Elon Musk: ఒకప్పుడు బద్దవ్యతిరేకి.. ఇప్పుడు ట్రంప్‌నకు జాన్ జిగ్రీ ఎందుకయ్యారు?
Why Elon Musk supported Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్ కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనను పొగిడారు. అధ్యక్షుడిగా పనికిరాడని ఒకప్పుడు ట్రంప్ గురించి చెప్పిన మస్క్.... తిరిగి ఆయనే అధ్యక్షుడిగా ఎందుకు కావాలనుకున్నారు? ట్రంప్ గెలవకపోతే తనకు కష్టాలు తప్పవని తెలిసి కూడా మస్క్ ఎందుకంత రిస్క్ తీసుకున్నారు? డెమోక్రాట్లతో ఆయనకు ఎక్కడ, ఎందుకు చెడిందో ఓసారి తెలుసుకుందాం.
ట్రంప్ ప్రచారంలో మస్క్ కీలకం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్‌తో పాటు ఇతర రిపబ్లికన్‌లకు మస్క్ 132 మిలియన్లను విరాళంగా ఇచ్చారని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ ఎఫ్ఎఫ్‌సీ ఎన్నికలకు ముందు రోజు తుది నివేదికలో వెల్లడించింది. ఈ ఎన్నికల కోసం ఆయన పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. స్వింగ్ స్టేట్‌లలో ఆయన నగదు బహుమతిని ప్రారంభించారు. ఇది ఎన్నికల చట్టాలను ఉల్లంఘించడమేనని యుఎస్ న్యాయశాఖ వార్నింగ్ ఇచ్చింది. దీన్ని ఆయన పెన్సిల్వేనియా కోర్టులో సవాల్ చేశారు. తన వాదనలను మస్క్ సమర్ధంగా కోర్టులో వినిపించారు. దీంతో దీన్ని కొనసాగించవచ్చని కోర్టు ఆదేశించింది. ట్రంప్‌నకు అనుకూలంగా సోషల్ మీడియాలో మస్క్ ప్రచారం చేశారు. ట్రంప్ గెలిస్తే అమెరికన్లకు కలిగే ప్రయోజనాలతో పాటు పలు అంశాల గురించి ఆయన వివరించారు. స్వేచ్ఛ గురించి ఆయన స్పందిస్తారు. వాక్‌స్వాతంత్ర్యం, ప్రభుత్వ జోక్యం, వ్యక్తిగత స్వేచ్ఛపై మస్క్ వ్యక్తిగత విశ్వాసాలు ట్రంప్‌నకు మద్దతు పలికేలా చేశాయి. ఈ విషయాలపై ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు.
అప్పట్లో ట్రంప్‌నకు వ్యతిరేకి
డోనల్డ్ ట్రంప్‌నకు మస్క్ అప్పట్లో వ్యతిరేకంగా ఉన్నారు. అధ్యక్ష పదవికి ఆయన సరైన వ్యక్తి కాదని 2017లో ట్రంప్‌పై తన అసంతృప్తిని బయటపెట్టారు. 2022 ఎన్నికల్లో పోటీ చేయవద్దని కూడా ట్రంప్‌నకు సూచించారు. నిత్యం హైడ్రామానే ట్రంప్ పాలనలో ఉంటుందని ఆయన సెటైర్లు వేశారు. బైడెన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత మస్క్ డెమోక్రాట్ల వైపు నుంచి రిపబ్లికన్ల వైపునకు మళ్లారు. 2016, 2020 ఎన్నికల్లో ఆయన డెమోక్రాట్ల పక్షానే నిలిచారు.
బైడెన్‌తో ఎందుకు చెడింది?
కరోనా సమయంలో బైడెన్ తీసుకున్న నిర్ణయాలు మస్క్‌కు నచ్చలేదు. వీటిపై ఆయన బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇది బైడెన్‌కు నచ్చలేదనే ప్రచారం కూడా ఉంది. 2021లో ఎలక్ట్రిక్ వాహనాలపై జరిగిన మీటింగ్‌కు టెస్లా కంపెనీకి ఆహ్వానం అందలేదు. ఇది మస్క్ అసంతృప్తికి కారణమైంది. 2021లో మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ చేపట్టిన అంతరిక్ష యాత్ర సక్సెస్ అయింది. దీనిపై బైడెన్ స్పందించలేదు. ఇంకా ఆయన నిద్రపోతున్నట్లున్నారని ఓ నెటిజన్ ప్రశ్నకు మస్క్ సెటైరికల్‌గా స్పందించారు. డెమోక్రటిక్ పార్టీ విద్వేషపూరితమైన పార్టీ అని.. విభజనకారులకు నిలయమని ఆయన విమర్శించారు.
మనసు మార్చుకున్న మస్క్
ఎన్నికల ప్రచారంలో పెన్సిల్వేనియాలో బట్లర్ కౌంటీలో ట్రంప్ దాడి తర్వాత మస్క్ మనసు మార్చుకున్నారు. గాయం నుంచి కోలుకోవాలని ట్రంప్‌ను కోరారు. దేశాన్ని రక్షించేందుకు ట్రంప్‌నకు ఓటు వేయాలని ఆయన ఓటర్లను కోరారు. బట్లర్ కౌంటీలో రెండోసారి జరిగిన ర్యాలీలో మస్క్ డ్యాన్స్ చేశారు.