Donald Trump: నేషనల్ ఎమర్జెన్సీకి ట్రంప్ ప్లానింగ్.. వారిని దేశం దాటించేందుకు భారీ స్కెచ్
Mass deportation in US with National emergency: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే తొలిరోజే ఆయన పలు సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదే విషయమై గతంలోనే హెచ్ఎంటీవీ ఒక వివరణాత్మక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
ట్రంప్ సోమవారం సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేశారు. అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ విధించనున్నట్లు ఆ ప్రకటనలో స్పష్టంచేశారు. అనధికారికంగా అమెరికాలోకి ప్రవేశించిన విదేశీయులను వారి వారి సొంత దేశాలకు పంపించేందుకు ఆ నేషనల్ ఎమర్జెన్సీని ఉపయోగించుకోనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ నేషనల్ ఎమర్జెన్సీ, మాస్ డిపోర్టేషన్ అమలు చేయడం కోసం అమెరికా మిలిటరీని రంగంలోకి దింపనున్నట్లు ట్రంప్ తేల్చిచెప్పారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాల్లో ఇమ్మిగ్రేషన్ పాలసీ ముఖ్యమైనది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో ఆయన అలసత్వం కారణంగా ఎంతోమంది అమెరికాలోని అక్రమంగా ప్రవేశించారని డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే వారిని తిరిగి దేశం దాటిస్తానని అమెరికన్స్ కు హామీ ఇచ్చారు. అలాగే మెక్సికోతో అమెరికాకు ఉన్న సరిహద్దు వివాదానికి ఫుల్ స్టాప్ పెడతానని అన్నారు. అందుకే ఆ హామీని నిజం చేసుకునేందుకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అమెరికాలో భారీ సంఖ్యలో అక్రమంగా ఉంటున్న వారిపైనే (Mass deportation) తొలుత చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.
ఇమ్మిగ్రేషన్ అధికారుల లెక్కల ప్రకారం అమెరికాలో కోటి 10 లక్షల మంది అక్రమంగా వలస వచ్చి ఉంటున్నారు. ఆ జాబితాలో ప్రపంచ దేశాలకు చెందిన జనం ఉన్నారు. అయితే, ట్రంప్ సర్కారు ముందుగా ఆయా దేశాధినేతలతో మాట్లాడాల్సి ఉంటుంది. ఆ దేశాలకు సొంత ఖర్చులపై విమానాలు ఏర్పాటు చేసి వారి వారి సొంత దేశాలకు తరలించాల్సి ఉంటుంది. ఇదంతా ట్రంప్ సర్కారుకు పెద్ద సవాలుగా మారనుందని ఇప్పటికే అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. ఆ 11 మిలియన్స్ మంది అక్రమ వలసదారులను దేశం దాటించడం ద్వారా 2 కోట్ల కుటుంబాలపై ప్రత్యక్షంగా ప్రభావం ఉంటుందని తెలుస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు కూడా జో బైడెన్ సర్కారు కూడా డిపోర్టేషన్ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక విమానం అక్టోబర్ 22న ఢిల్లీకి బయల్దేరినట్లు అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యురిటీ డిపార్ట్‌మెంట్ స్పష్టంచేసింది. 2024 లో ఇండియా సహా 145 దేశాలకు చెందిన 1,60,000 మంది అక్రమ వలసదారులను వారి సొంత దేశాలకు పంపించినట్లు అమెరికా ఆ ప్రకటనలో పేర్కొంది. వారి డిపోర్టేషన్ కోసం 495 విమానాలను ఉపయోగించినట్లు అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యురిటీ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ సెక్రటరీ క్రిస్టీ కెనగాలో తెలిపారు. చట్టబద్ధత లేకుండా అమెరికాలో ఉంటున్న విదేశీయులను వారి సొంత దేశాలకు పంపించడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా ఆమె చెప్పుకొచ్చారు.