పుతిన్ అధ్యక్ష పదవిపై జోరుగా చర్చ
Vladimir Putin: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. రష్యా ప్రజల్లో పుతిన్‌పై వ్యతిరేకత?
Vladimir Putin: ఉక్రెయిన్ మారణహోమం, పాశ్యాత్య దేశాల ఆంక్షలతో రష్యా విలవిలలాడుతోంది. అయినా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యుద్ధాన్ని కొనసాగించేందుకే మొగ్గుచూపుతున్నారు. తాజాగా ఉక్రెయిన్ యుద్ధం బాధ్యతలను కొత్త జనరల్ అలెగ్జాండర్ డ్వొర్నికోవ్‌కు అప్పగించారు. మాస్కో బలగాలు దాడులు మరింత పెంచే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నారు. క్రెమ్లిన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని కోరుతున్నారు. రష్యా ఆంక్షలు, యద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పదవిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.. ఆయన అధికారంలో ఉంటారా? ఊడుతారా? అన్న ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడు వారాలవుతోంది. ఉక్రెయిన్‌పై మాస్కో బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయ. నగరాలకు నగరాలను ధ్వంసం చేశాయి. అయినా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను మాత్రం చేజిక్కించుకోలేకపోయాయి. ఆయుధాలు, ఆహారం అందకపోవడంతో.. రష్యా బలగాలు గత్యంతరం లేక అక్కడి నుంచి వెనుదిరిగాయి. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతం వైపునకు మాస్కో దళాలు కదిలాయి. డాన్‌బాస్ ప్రాంతంలో రష్యా అనుకూలవాదులు ఉండడంతో, ఆహారం, ఆయుధాలకు ఇబ్బంది ఉండదని క్రెమ్లిన్ భావిస్తోంది. అందుకే సైన్యాన్ని అటుగా మళ్లించింది. అక్కడి నుంచి దాడులు ఉధృతం మాస్కో ప్రణాళికలను రచిస్తోంది. అందని ద్రాక్షగా మిగిలిన కీవ్‌ను ఆక్రమించుకునేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఉక్రెయిన్ యుద్ధం బాధ్యతలను మాస్కో ప్రభుత్వం కొత్త జనరల్‌కు అప్పగించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అత్యంత అనుకూలమైన సైనికాధికారి అలెగ్జాండర్ డ్వొర్నికోవ్‌కు యుద్ధం బాధ్యతలను అప్పగించింది. దీంతో పుతిన్ సేనలు మరిన్ని దాడులు చేసే అవకావం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.
ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, ఐరోపా సమాఖ్యతో పాటు, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు తీవ్ర ఆంక్షలను విధించాయి. దీంతో రష్యా లావాదేవీలు భారీగా పడిపోయాయి. ఆర్థికంగా మాస్కోకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం తగ్గడం లేదు. మరింత దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యాలో పుతిన్ ప్రతిష్ట మసకబారుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. శాశ్వాతంగా అధికారంలో ఉండాలని కలలు కంటున్న పుతిన్‌పై ఉక్రెయిన్ యుద్ధంతో ఇంటా బయటా.. వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన ఎన్నాళ్లు పదవిలో కొనసాగుతారని అందరూ ప్రశ్నిస్తున్నారు. పుతిన్ అధ్యక్షుడిగా 2036 వరకు కొనసాగనున్నారు. అప్పటివరకు ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదని నిపుణులు చెబుతున్నారు.
రష్యాలో ప్రతిపక్షాలను ఎదగకుండా పుతిన్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. బలంగా ఎదుగుతున్న ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీని పుతిన్ జైలుకు పంపారు. అంతేకాకుండా ఆయనకు వ్యతిరేకంగా కథనాలు రాసే మీడియాపైనా ఉక్కుపాదం మోపుతున్నారు. 22 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పుతిన్ రష్యా సైన్యం, నిఘా సంస్థలు, అధికార వర్గాలను తన గుప్పెట్లో పెట్టుకున్నారు. దేశంలో తనకు ఎదురులేకుండా రంగం సిద్ధం చేసుకున్నాడు. అంతేకాకుండా ప్రజల్లో తన ప్రతిష్ట మసకబారకుండా ఎప్పటికప్పుడు పుతిన్ కొత్త వ్యూహాలను అనుసరిస్తుంటారు. సోవియట్ యూనియన్ భావజాలమున్న ప్రజల్లో పుతిన్‌కు బ్రహ్మాండమైన మద్దతు ఉంది. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంపైనా రష్యన్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో మాస్కోతో పాటు పలు రష‌్యన్ నగరాల్లో పుతిన్‌కు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు తెలిపారు. ఉక్రెయిన్ అనుకూల ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేశారు. పలువురు పుతిన్ వ్యతిరేకులు దేశం విడిచి వెళ్లిపోయారు.
సోవియట్ యూనియన్‌లో అత్యంత బలమైన నేత నికితా క్రుష్చేవ్. ఆయనకు కమ్యూనిస్టు పార్టీలో తిరుగులేని ఆధిపత్యం ఉండేది. అయితే అతడి ఆర్థిక నిర్ణయాలు, క్యూబాలో అణ్వాయుదాలు అమర్చడం వంటి విమర్శలు క్రుష్చేవ్‌ను చుట్టుముట్టాయి. దీంతో బలమైన నేత క్రుష్చేవ్‌ను అప్పటి పార్టీ నేతలు బలవంతంగా పదవి నుంచి దించేశారు. ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో బలమైన నేత ఎదిగిన పుతిన్‌ను కూడా అలా దించే అవకాశాలు ఉన్నాయని కొందరు వాదిస్తున్నారు. సంస్థాగత పార్టీ నిర్మాణంలోనూ పుతిన్‌కు ఎదురుచెప్పే నాయకుడే లేడని మరికొందరు వాదిస్తున్నారు. కనీసం ఉక్రెయిన్ యుద్ధం తప్పు అని కూడా ఎత్తి చూపే అవకాశమే లేదని చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధంతో రష్యాకు భారీగా నష్టం వాటిల్లింది. దీంతో గత్యంతరంలేక సైన్యాన్ని పలు నగరాల నుంచి పుతిన్ వెనక్కి తీసుకోవడం ఉక్రెయిన్ వ్యతిరేక నేతల్లో నిరాశన కలిగించాయి.
ఉక్రెయిన్ యుద్ధం ఇలాగే నెలల తరబడి కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు పుతిన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం కొనసాగిస్తే.. ప్రపంచ దేశాలు యథావిధిగా వ్యాపారాలు నిర్వహించే అవకాశం లేదని దీనివల్ల తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. దీంతో ప్రజల్లో తిరుగుబాటు రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.