చైనాను కలవరపెడుతోన్న కరోనా సెకండ్ వేవ్
* వారం రోజులుగా మళ్లీ నమోదవుతోన్న పాజిటివ్ కేసులు * షాంఘై ఎయిర్‌పోర్టులో ఇద్దరు సిబ్బందికి కరోనా * అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది * టియాంజిన్‌లో ఐదు లోకల్ ట్రాన్స్‌మిషన్ కేసులు
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కొత్త కేసులతో కలవరం మొదలైంది. లాక్‌డౌన్ సడలింపులతో మళ్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది చైనా. వారం రోజులుగా నమోదైన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారివే అయినా.. రెండు లోకల్ ట్రాన్స్‌మిషన్ కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోంది.
ఇక గడిచిన రెండు రోజుల్లో రోజుకు 11 కేసులు నమోదైనట్లు తెలిపింది చైనా ప్రభుత్వం. షాంఘైలో నమోదైన కేసుల్లో ట్రాన్స్‌మిషన్ కేసులు ఉన్నట్లు తెలపింది. ఇక సోమవారం బయటపడ్డ కేసుల్లో షాంఘై ఎయిర్‌పోర్టులో ఇద్దరు సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఎయిర్‌పోర్టు సిబ్బందికి భారీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు.
అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మరోసారి విస్తృతంగా కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే టియాంజిన్‌లో ఇరవై లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. మంజౌలిలో రెండు లక్షల మందికి పరీక్షలు చేశారు. పలుచోట్ల స్కూళ్లను కూడా మూసివేసేందుకు చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. అయితే శీతాకాలం కూడా ప్రారంభం కావటంతో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయంటున్నారు వైద్యులు. ఈ సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.