చైనాలో భారీగా కరోనా కేసులు నమోదు.. పూర్తిస్థాయి లాక్‌డౌన్...
China - Coronavirus: షాంఘైతో పాటు జిలిన్ ప్రావిన్స్‌లోనూ లాక్‌డౌన్...
China - Coronavirus: కరోనా నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అన్ని దేశాల్లోనూ కోవిడ్ ఆంక్షలు ఎత్తివేశారు. కానీ.. కోవిడ్ పుట్టినిల్లు చైనాలో మాత్రం ఇప్పుడు లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. చైనా ఆర్థిక రాజధాని షాంఘై నగరంలో ఆదివారం ఒక్కరోజే 3వేల 450 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఇవి 70 శాతం కావడం గమనార్హం. దీంతో డ్రాగన్ కంట్రీ అప్రమత్తమైంది. ఐదు రోజుల పాటు షాంఘై నగరంలో కంప్లీట్ లాక్‌డౌన్ విధించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదంటూ హెచ్చరికలు జారీ చేసింది. చైనాలో లాక్‌డౌన్‌తో మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలయ్యింది. మహమ్మారి ఎక్కడ విజృంభిస్తోందనని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి.
కరోనాకు పుట్టినిల్లు చైనా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టించినా.. ఆ దేశంలో మాత్రం అంత ప్రభావం చూపించలేదు. లక్షలాది మంది పిట్టల్లా రాలుతున్నా.. డ్రాగన్ కంట్రీలో మాత్రం ప్రశాంతంగా ఉంది. అక్కడక్కడా కేసులు నమోదువుతున్నా.. జీరో కోవిడ్ విధానాన్ని ప్రవేశపెట్టి... కఠినంగా వ్యవహరించింది. కరోనా లక్షణాలున్న వారిని ప్రత్యేక గదుల్లో బంధించింది. దీంతో కరోనాను దాదాపుగా అడ్డుకుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి ఆగిపోయింది. కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొన్ని దేశాల్లో కొత్త కేసులు నమోదవుతున్నా.. తక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. దీంతో కోవిడ్ నిబంధనలను అన్ని దేశాలు ఎత్తివేశాయి.
జీరో కోవిడ్ విధానం డ్రాగన్ కంట్రీని కొంప ముంచింది. ఇప్పుడు చైనాలో నిత్యం 4వేలకు పైగా కేసులు నమోదువుతున్నాయి. ప్రపంచమంతటా కేసులు తగ్గుతుంటే.. ఈ దేశంలో మాత్రం ఉధృతంగా పెరుగుతున్నాయి. రెండ్రోజులుగా చైనాలోని అతి పెద్ద నగరం, 2 కోట్లా 60లక్షల జనాభా ఉన్న షాంఘైలో కేసులు భారీగా పెరిగాయి. నిత్యం 3వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం షాంఘై నగరాన్ని పూర్తిగా మూసేసింది. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దంటూ ప్రభుత్వం హెచ్చరించింది. అన్ని రకాల సేవలను నిలిపేసింది. కేవలం ఎమర్జెన్సీ సేవలను మాత్రమే అనుమతించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. 2019లో మొదటి సారి వైరస్ గురించిన వూహాన్ నగరంలో 2020 లాక్‌డౌన్ విధించారు. ఆ తరువాత అత్యధిక రోజులు లాక్‌డౌన్ విధించడం షాంఘైలోనే తొలిసారి కావడం గమనార్హం.
చైనా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దేశ సరిహద్దులను మూసివేశారు. వైరస్ గుర్తించబడిన నగరాల్లో స్కూళ్లను మూసివేశారు. రవాణా వ్యవస్థలను నిలిపేశారు. ప్రయాణాలను రద్దు చేశారు. అంతర్జాతీయ విమానాలను కూడా చైనా రద్దు చేసింది. ఏప్రిల్ 5న చైనా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించే పెద్దల పండుగను ప్రభుత్వం నిషేధించింది. స్టాక్ మార్కెట్లలో తక్కువ సిబ్బందిని బబుల్ పద్ధతిలో నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా.. ఆహార తయారీ కంపెనీల్లో ఉద్యోగులు అక్కడే ఉండి.. పని చేసేలా ఏర్పాట్లు చేసింది. వైరస్ కట్టడికి అన్నిరకాల ప్రయత్నాలను చైనా ప్రభుత్వం ముమ్మరం చేసింది.
చైనా వ్యాప్తంగా ఈనెలలో 56వేల కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జిలిన్ ప్రావిన్స్‌లోనే గుర్తించారు. ప్రస్తుతం ఇక్కడ నిత్యం వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదువుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని పలు నగరాల్లో కఠిన ఆంక్షలను విధించారు. జిలిన్ ప్రావిన్స్‌తో పాటు సుజోయూ, షెన్యాంగ్, షాంఘైతో పాటు పలు నగరాల్లో కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా నగరాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు టీకా ప్రక్రియను చైనా ముమ్మరం చేసింది. ఇప్పటివరకు 87 శాతం పూర్తయ్యింది. టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు చైనా ఏర్పాట్లు చేస్తోంది.