చైనాలో మళ్లీ కరోనా కేసులు.. బీజింగ్‌లో 147, షాంఘైలో 36 కేసులు
*బీజింగ్‌లో మాత్రం ఓక్కో వ్యక్తి మూడు సార్లు టెస్ట్ *పాజిటివ్ బాధితులను క్వారంటైన్‌కు తరలింపు
China: చైనీయులను క్వారంటైన్ కేంద్రాలు వణికిస్తున్నాయి. తాజాగా బీజింగ్‌లో 200 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ బాధితులు సిటీ సెంటర్ హెవెన్ సూపర్ మార్కెట్ బార్‌కు వెళ్లినట్టు తేలడంతో ప్రభుత్వం ఏకంగా వేలాది మందిని ఇళ్లలో నిర్బంధించింది. పెద్ద ఎత్తున ప్రజలకు కరోనా పరీక్షలను నిర్వహిస్తోంది. గతవారమే బీజింగ్‌లో కరోనా నియమాలను సడలించిన చైనా ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్ విధించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారు క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అయినా నెగిటివ్ రిపోర్టు చూపించినా బీజింగ్ అధికారులు మాత్రం బలవంతంగా క్వారంటైన్ కేంద్రాలకు ప్రజలను తరలిస్తున్నారు.
చైనా రాజధాని బీజింగ్, ఆర్థిక రాజధాని షాంఘై ఈ నగరాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వారం రోజుల క్రితం కోవిడ్ ఆంక్షలను చైనా ప్రభుత్వం క్రమంగా సడలించి చివరికి ఎత్తి వేసింది. నెలల తరబడి లాక్‌డౌన్‌లో మగ్గిన ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. పూర్తి నిబంధనలు ఎత్తివేసి వారం, పది రోజులు గడిచిందో లేదో అంతలోనే మళ్లీ కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం బీజింగ్ ప్రావిన్స్‌లోని చాయోయాంగ్‌లోని సెంట్రల్ హెవెన్ సూపర్ మార్కెట్ పరిధిలో 147 కేసులు నమోదయ్యాయి. దీంతో చైనా అధికారులు జూలు విదిల్చారు. 35 లక్షల జనాభా ఉన్న చాయోయాంగ్ అంతటా పెద్ద ఎత్తున ప్రజలకు కరోనా టెస్టులను చేయడం ప్రారంభించారు. ఓ వ్యక్తికి ఒక్కసారి టెస్ట్ చేస్తే వైరస్ పట్టుబడుతుందో లేదోనని చైనా అధికారులు భావించారమో ఏకంగా ఒక్కో వ్యక్తికి రోజుకు మూడు సార్లు చొప్పున టెస్టులు నిర్వహిస్తూ చైనా అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇక టెస్టుల్లో ఎక్కడ పాజిటివ్ వస్తుందోనని ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు.
ఆర్థిక రాజధాని షాంఘైలో 2 కోట్ల 50 లక్షల మందికి కరోనా టెస్టులు చేసిన తరువాత.. మే నెల మధ్యలో లాక్‌డౌన్‌ను తొలగించారు. తాజాగా మళ్లీ 37 కేసులు నమోదవడంతో షాంఘై మళ్లీ మూతపడింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 37 కేసులకే ప్రభుత్వం ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. షాంఘైలో మళ్లీ కరోనా వైరస్ నిర్ధారణకు పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా విధించిన లాక్‌డౌన్ మళ్లీ ఎన్నాళ్లు ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల లాక్‌డౌన్ తరువాత ఇటీవలే బయటకు వచ్చిన షాంఘైవాసులు మళ్లీ ఇళ్లకే పరిమితమయ్యారు. జీరో కోవిడ్ పేరుతో ప్రపంచంలో ఏ దేశమూ చేయని విధంగా చైనా ప్రభుత్వం ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తోందో ఇప్పటికీ అర్థం కావడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చైనా జీరో కోవిడ్ పాలసీపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. జిన్‌పింగ్ ప్రభుత్వం మాత్రం విమర్శలను లెక్క చేయడం లేదు. జీరో కోవిడ్ పేరుతో ఒక కాలనీలో ఒక కేసు గుర్తించినా.. ఆ కాలనీకి చెందిన మొత్తం ప్రజలను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. పోనీ క్వారంటైన్ కేంద్రాల్లో వసతులు బాగున్నాయా? అంటే అదీ లేదు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు జైళ్లను తలపిస్తున్నాయి. సమయానికి ఆహారం, నీళ్లు ఇచ్చే దిక్కు ఉండదు. ఎవరితోనూ మాట్లాడేందుకు అవకాశం ఉండదు. కనీసం తమకు ఏదైనా కావాలని అడిగే అవకాశం కూడా ఉండదు. క్వారంటైన్‌లో ఉండేవారికి రోబోలో ఆహారాన్ని అందిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దంటూ ప్రచారాన్ని కూడా డాగ్ రోబోలచే నిర్వహిస్తున్నారు. క్వారంటైన్ కేంద్రాలు దారుణంగా ఉండడంతో.. పలువురు కరోనా టెస్టింగ్ చేయించుకునేందుకే జంకుతున్నారు. పాజిటివ్ వస్తే.. క్వారంటైన్ కేంద్రాలకు పంపుతారని భయాందోళన చెందుతున్నారు.
చైనా పరిస్థితులు ఇలా ఉంటే మన దేశంలోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరుకోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా 8వేల కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ తగ్గాయి. అయితే పాజిటిటీ రేటు మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం 3.24శాతంగా నమోదయ్యింది. 24 గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలోనే అత్యధికంగా ఉన్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా మళ్లీ కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నాయి. మాస్క్ తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ ప్రభుత్వాలు ఇటీవల మార్గదర్శకాలను జారీ చేశాయి.
మన దేశంలో 8వేల కేసులు నమోదవుతున్నా ఎలాంటి లాక్‌డౌన్లు, టెస్టులు నిర్వహించడం లేదు. అయితే చైనా మాత్రం కేవలం 300 కేసులకే హడావిడి చేస్తోంది. అత్యవసరంగా భారీగా టెస్టులు నిర్వహిస్తోంది. లాక్‌డౌన్లతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.