గోధుమలు ఇస్తే.. ఇళ్లను ఇస్తామంటున్న బిల్డర్లు

*గోధుమలు లేకపోతే వెల్లుల్లి అయినా ఓకే అని ఆఫర్లు

Update: 2022-06-28 11:04 GMT

గోధుమలు ఇస్తే.. ఇళ్లను ఇస్తామంటున్న బిల్డర్లు

China: వరుస కోవిడ్‌ లాక్‌డౌన్లు, ఉక్రెయిన్‌-రష్యా యుద్దంతో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ దుస్థితి పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలనే కాదు.. అగ్రదేశాలను కూడా కుదిపేస్తోంది. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనాలో మరింత తీవ్రమవుతోంది. అక్కడి పారిశ్రామిక, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో తీవ్ర సంక్షోభం నెలకొన్నది. సెంట్రల్‌ చైనాలోని హెనిన్ ప్రావిన్స్‌లో రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలింది. నిర్మించిన ఇళ్లను విక్రయించడానికి అక్కడి డెవలర్స్‌ అష్టకష్టాలు పడుతున్నారు. గత్యంతరంలేక ఇళ్లను నగదుకు బదులు గోధమలు, వెల్లుల్లి రూపంలో చెల్లింపులు చేయాలని ఆఫర్లు ఇస్తున్నారు. అయినా ఇళ్ల కొనుగోలుకు అక్కడి ప్రజలు ముందుకు రావడం లేదు.

2020 నుంచి కోవిడ్‌ మహమ్మారి విజృంభించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. ఆరు నెలల క్రితం నుంచి పలు దేశాల్లో వైరస్‌ ఉధృతి తగ్గుముఖం పడుతున్నా ఇప్పటికీ ఆర్థికంగా కోలుకోలేదు. మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడంతో ప్రపంచ దేశాలు కుదలేవుతున్నాయి. ఆహారం, చమురు, గ్యాస్‌ దిగుమతులు నిలిచిపోవడంతో పేద, ధనిక దేశాలు అన్న తేడా లేకుండా సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి. నిత్యావసరాలు, ఇంధనం, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. నగదు కొరత ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే వివిధ దేశాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం పూర్తిగా పడిపోయింది. కట్టిన ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్లు అలా దిష్టిబొమ్మ మిగిలిపోవడంతో బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు.

ఇళ్ల అమ్మకాలపై చైనాలోని హెనాన్‌ ప్రావిన్సుకు చెందిన బిల్డర్లు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. ఇంటిని కొనుగోలు విషయంలో డౌన్‌పేమెంట్‌గా గోధమలు, వెల్లుల్లి చెల్లిస్తే చాలంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇళ్ల కొనుగోలుకు గోధుమలు, వెల్లుల్లి చెల్లించడమేమిటని అవాక్కవుతున్నారా? మీరు చూస్తున్నది నిజంగా నిజమే. అయితే బిల్డర్లు ఈ ఆఫర్‌ ఇవ్వడం వెనుక మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి అంతర్జాతీయంగా గోధుమలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. రెండోవది చైనాలో నగదు కొరత పెరిగింది. మూడో కారణం హెనాన్‌ ప్రావిన్స్‌లో రైతులు అధికంగా ఉంటారు. వారిని ఆకట్టుకోవడమే ఈ ఆఫర్‌ ప్రధాన లక్ష్యం. ఈ ఆఫర్‌లో 24వేల డాలర్ల విలువైన గోధుమలు ఇస్తే ఇంటిని తమ పేరిట బుక్‌ చేసుకోవచ్చని బిల్డర్లు చెబుతున్నారు. మిగిలింది క్యాష్‌ రూపంలో ఇవ్వాలంటూ షరతు పెడుతున్నారు. ఒకవేళ గోధుమలు లేకపోతే వెల్లుల్లి తేవాలని కూడా సూచిస్తున్నారు. 16 రోజుల్లో 30 గోధుమల లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. బిల్డర్లు ఆశించినంతగా స్పందన లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

గతేడాది నుంచి చైనా వ్యాప్తంగా 70 శాతం ఇళ్ల విక్రయాలు పడిపోయాయి. 6 కోట్ల 50 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అంటే దాదాపు ఫ్రాన్స్‌ మొత్తం జనాభాకు సరిపడా ఇళ్లు ఉన్నాయన్నమాట. వాటిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అలాగే ఉండిపోతాయేమో అనే ఆందోళన బిల్డర్లలో వ్యక్తమవుతోంది. అందుకు కారణం చైనాలో ఏటా కోటి 50 లక్షలకు పైగా ఇళ్లను బిల్డర్లు నిర్మిస్తున్నారు. ఇన్ని ఇళ్లు కట్టడం అవసరమా? అంటే పెట్టుబడులకు రియల్‌ ఎస్టేట్‌ మంచిదని చైనీయుల నమ్మకం. దీంతో చాలా మంది రెండు, మూడు ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి చైనా యువకుడు ఇల్లు కొన్న తరువాతే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. చైనాలో మంచి ఇళ్లు ఉండడం స్టేటస్‌గా ఫీల్‌ అవుతారు. ఈ నేపథ్యంలోనే ఇళ్లయితే ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుందని బిల్డర్లు భారీగా నిర్మిస్తున్నారు. కానీ వారి అంచనాలు ఇప్పుడు కుప్పకూలుతున్నాయి. గతేడాది నుంచి ఇళ్ల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

గతేడాది నుంచి రియల్‌ ఎస్టేట్‌ పడిపోవడంతో చైనాకు చెందిన భారీ నిర్మాణ సంస్థలు తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నాయి. చైనాలో అత్యంత పేరుగాంచిన ఎవర్ గ్రాండ్‌ గ్రూప్‌, కైసా గ్రూప్‌, సునాక్‌ చైనా హోల్డింగ్స్‌, యూజూ గ్రూప్‌, ఫ్యాంటేసియా హోల్డింగ్స్‌ గ్రూప్‌ సంస్థలు కుప్పకూలాయి. చైనా ప్రాపర్టీ రంగాన్ని భారీగా కుదిపేశాయి. మూడువంతుల చైనా బిల్డర్స్‌ ఈ ఏడాది అప్పులపాలయ్యారు. 22 నిర్మాణ రంగ కంపెనీలు అప్పులను ఎగవేశాయి. దీంతో 32 చైనా బ్యాంకుల్లో 17 బ్యాంకులు హౌసింగ్‌ సెక్టర్‌ లోన్లను నిలిపేశాయి. ఈ ఏడాదిలో మొత్తం 11వేల 700 కోట్ల డాలర్ల రుణాన్ని బిల్డర్లు చెల్లించాల్సి ఉంది. మేలో కేవలం 33శాతం ఇళ్లు మాత్రమే బిల్డర్లు విక్రయించారు. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది చైనా ప్రాపర్టీ సెక్టర్‌ కుప్పకూలింది.

జీరో కోవిడ్‌ విధానంతో ఒక్క కేసు వచ్చినా.. జిన్‌పింగ్‌ ప్రభుత్వం లాక్‌డౌన్లను విధిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక రంగం పూర్తిగా చితికిపోయింది. ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో చైనా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలని కలలు కంటోంది బీజింగ్‌.. ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానందంట.. అంటే ఇదేనేమో..

Tags:    

Similar News