చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అనారోగ్యం

*రెండేళ్లుగా సెరిబ్రల్‌ అనైరిజమ్‌తో బాధపడుతున్న చైనా అధ్యక్షుడు

Update: 2022-05-11 04:11 GMT

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అనారోగ్యం

China: ప్రపంచాన్ని ఏలాలన్న కల ఆర్థికంగా అమెరికాపై పై చేయి సాధింపు ఎన్నో దేశాలకు అప్పులు ఇచ్చి ఆర్థిక సంబంధాలు నెలకోల్పుకున్నాడు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌. జీవిత కాలం అధ్యక్షుడిగా తనను తానే ప్రకటించుకున్న జీ చైనాలో ఆయన మాటే శాసనం సర్వం ఆయన కనుసన్నల్లోనే నడవాల్సిందే. జిన్‌పింగ్‌ ఆగ్రహానికి గురైతే అతి పెద్ద ధనవంతుడైనా కనిపించకుండా పోతాడు. తమ దేశంలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి అస్సలు తెలియనివ్వని బీజింగ్‌ అధిపతి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. రెండేళ్లుగా ఆయన కనిపించకపోవడంతో అది నిజమేనని కథనాలు వెలువడుతున్నాయి. గతేడాది చివర్లో ఆసుపత్రి పాలైన జీ సెరిబ్రల్‌ అనైరిజమ్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు కథనాలు వెలువుడుతున్నాయి.

సాధారణంగా సెరిబ్రల్‌ అనైరిజమ్‌ అనే వ్యాధి సోకితే శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ జిన్‌పింగ్‌ మాత్రం సంప్రదాయ పద్ధతుల్లోనే వ్యాధిని నయం చేసుకోవడానికి యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే చైనా అధ్య్షక్షుడు బయటి ప్రపంచానికి దూరంగా ఉన్నారట. రెండేళ్ల క్రితం కరోనా వైరస్‌ బయటపడినప్పటి నుంచి ఇటీవల ముగిసిన బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్ వరకు విదేశీ నేతలతో జిన్‌పింగ్‌ అస్సలు కలవనేలేదు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలోనూ జీ బయటకు వచ్చిన సందర్భాలు కూడా లేవు. కేవలం రష్యా విదేశాంగ శాఖ మంత్రి మాత్రం పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. చైనా అధ్యక్షుడు మాత్రం కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. దీంతో ఆయన వ్యాధిబారిన పడినట్టు వస్తున్న కథనాలకు బలం చేకూరుతోంది.

2019 మార్చిలో ఇటలీ పర్యటనలోనూ నడవడానికి ఇబ్బందులు పడ్డారని ప్రచారమైంది. ఫ్రాన్స్‌లో ప‌ర్య‌టిస్తున్న‌ప్పుడు కూర్చునేందుకు స‌హాయ‌కుల మ‌ద్ద‌తు తీసుకున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. 2020లో షెన్‌జెన్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడేందుకు వ్యాధి కారణంగానే ఆలస్యంగా వచ్చినట్టు చెబుతున్నారు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ద‌గ్గుతూ నెమ్మ‌దిగా త‌న ప్ర‌సంగాన్ని పూర్తి చేయ‌డాన్ని బ‌ట్టే జీ జిన్‌పింగ్ అనారోగ్యం పాల‌య్యార‌న్న కథనాలకు రెక్కలు వచ్చాయి. ఇక సెరిబ్రల్‌ అనైరిజమ్‌ వ్యాధికి గురైతే మెదడులోని రక్తనాళాలు ఉబ్బుతాయి. దీంతో మెదడులోని రక్తం నిండిపోతుంది. అంతేకాకుండా ఎటువంటి లక్షణాలు లేకుండానే రక్త నాళాల నుంచి రక్తం బయటకు వస్తుంది. ఫలితంగా తీవ్రమైన తలనొప్పి ప్రాణాంతక స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి చికిత్సకు పలు పద్ధతులను ఆచరిస్తారు. రక్తాన్ని అవసరానికి మించి సరఫరా కాకుండా చూస్తారు. అయితే జిన్‌పింగ్‌ మాత్రం శస్త్ర చికిత్సకు బదులు సంప్రదాయ వైద్యాన్ని ఆశ్రయించనట్టు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోగ్యం పైనా జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. రెండ్రోజుల క్రితం జరిగిన విక్టరీ డే వేడుకల్లోనూ పుతిన్‌ ఇబ్బంది పడినట్టు పాశ్చాత్య మీడియాలో కథనాలు వచ్చాయి. అందుకు వేడుకల్లో భాగంగా పుతిన్‌ వేదికపై కూర్చొని కాళ్లపై కప్పుకున్న ఓ దుప్పటి లాంటి దాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. పుతిన్‌కు కూడా ఉదర క్యాన్సర్‌ సోకినట్టు ప్రచారమవుతోంది. ఆయన సర్జరీకి కూడా సిద్ధమవుతున్నట్టు పశ్చాత్య మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ కథనాలపై ఇప్పటివరకు మాస్కో వర్గాలు మాత్రం స్పందించడం లేదు. పుతిన్ ఆరోగ్యంపై తమకు ఎలాంటి సమాచారం లేదని మాత్రం అమెరికా చెబుతోంది.

Tags:    

Similar News