China: విదేశీయులను తాకొద్దంటూ చైనా ఆదేశాలు
*స్కిన్ టు స్కిన్ తాకొద్దంటూ..చైనా సీడీసీ చీఫ్ వూ జున్యూ హెచ్చరిక
China: కరోనా వైరస్‌తో విలవిలలాడుతున్న చైనాకు... తాజాగా మంకీపాక్స్ భయం మొదలయ్యింది. డ్రాగన్ కంట్రీలో మంకీపాక్స్ ఫస్ట్ కేసు నమోదయ్యింది. దీంతో ఆ దేశం దారుణమైన ప్రకటన చేసింది. విదేశీయులను ఎవరినీ తాకొద్దంటూ చైనా అధికారులు ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. చైనా అంటు వ్యాధుల నివారణ సంస్థ-సీడీసీ చీఫ్, ఎపిడమయాలజిస్ట్ వూ జున్యూ.. అక్కడి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విదేశీయులను స్కిన్ టు స్కిన్ తాకొద్దంటూ తన పోస్టులో వెల్లడించారు. ఇప్పుడు ఆయన పోస్టుపై తీవ్ర దుమారం రేగుతోంది. చైనా తీరు.. జాత్యాహంకారంలా ఉందని పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే సోషల్ మీడియాలో ఉన్న వూ జున్యూ పోస్టు మాయమైంది.
చైనాలోని చాంగ్‌కింగ్‌లో తొలి మంకీపాక్స్ నమోదయ్యింది. ఈ నేపథ్యంలోనే వూ జున్యూ వ్యాఖ్యలు చేశారు. ఇది వెంటనే భారీగా షేర్ అయ్యింది. అయితే వైరస్‌ను నివారించడానికి చర్యలు తీసుకోకుండా.. విదేశీయులను తాకరాదంటూ పిలుపునివ్వడం చైనా తీరుకు అద్దం పడుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా చైనా ప్రభుత్వం తలపట్టుకుంటుంది. జీరో కోవిడ్ విధానం పేరుతో ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.. వైరస్ మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ కేసు నమోదు కావడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా.. జోరో కోవిడ్ విధానంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. బీజింగ్ మాత్రం చర్యలను ఆపడం లేదు.