China: తైవాన్‌ను తమ నుంచి వేరు చేయలేరన్న చైనా

*తైవాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటిస్తే యుద్ధానికి ఏమాత్రం వెనుకాడేది చైనా హెచ్చరికలు

Update: 2022-06-11 12:00 GMT

తైవాన్‌ను తమ నుంచి వేరు చేయలేరన్న చైనా

China: తైవాన్‌ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఎవరైనా తైవాన్‌ను చైనా నుంచి విడదీయాలని చూస్తే యుద్ధమేనని అమెరికాకు బీజింగ్‌ హెచ్చరించింది. తైవాన్‌ తమ భూభాగమని దాన్ని ఎవరూ టచ్‌ చేయొద్దంటూ డ్రాగన్ హూంకరిస్తోంది. దక్షిణాసియాలో తైవాన్ మరో ఉక్రెయిన్‌గా మారుతోందంటూ జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా ఆందోళన వ్యక్తం చేశారు. తాజా పరిణామాలతో దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలోనైనా తైవాన్‌పై డ్రాగన్ కంట్రీ దాడి చేసే అవకాశం ఉంది. దీంతో తైవాన్‌ ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని భయంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.

తమ భూభాగం నుంచి తైవాన్‌ను ఎవరూ వేరు చేయలేరని చైనా స్పష్టం చేసింది. తైవాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటిస్తే యుద్ధానికి ఏమాత్రం వెనుకాడేది లేదని చైనా హెచ్చరించింది. తైవాన్‌, చైనా ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో తొలిసారి అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్‌ ఆస్టిన్, బీజింగ్‌ రక్షణ శాఖ మంత్రి వే ఫింఘీ సింగపూర్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు వివాదాస్పద అంశాలపై అమెరికా చర్చించింది. అందులో భాగంగా దక్షిణ చైనా సముద్రం, షింజియాన్‌ ప్రావిన్స్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, హాంకాంగ్‌ అంశాలపై లాయిడ్‌ ఆస్టిన్‌ ప్రస్తావించారు. అయితే వీటన్నింటిలోనూ తైవాన్‌ విషయమే కీలకంగా మారింది. తైవాన్‌ సమీపంలో ఇటీవల చైనా సైనిక కార్యకలాపాలపై ఆస్టిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మరోసారి తైవాన్‌పై చైనా మరింత స్పష్టతనిచ్చారు. తైవాన్‌ను చైనాను నుంచి విడదీయాలని చూస్తే యుద్ధం తప్పదని వే ఫింఘీ హెచ్చరించారు. దక్షిణాసియాలో తైవాన్‌ మరో ఉక్రెయిన్‌గా మారుతోందని జపాన్‌ ప్రధాని ఫుజియో కిషిదా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను కిషిదా ప్రస్తావించారు.

40 ఏళ్లుగా తైవాన్ వివాదం సాగుతోంది. ఈ ద్వీప దేశాన్ని తమదిగా చెబుతోంది. అయితే తైవాన్‌పై చైనా దాడి చేస్తే అమెరికా సైన్యం రంగంలోకి దిగుతుందని అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత చైనా నుంచి తైవాన్‌ విడిపోయింది. చైనా కమ్యూనిస్టు పార్టీ, నేషనలిస్టు పార్టీ ప్రభుత్వం మధ్య వివాదాలు తలెత్తాయి. 1949లో చైనా కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించడంతో.. మావో జిడాంగ్‌ అధికారం చేపట్టారు. దీంతో నేషనలిస్టు పార్టీ నేతలు తైవాన్‌కు పారిపోయారు. అప్పటి నుంచి తైవాన్‌లో నేషనలిస్టు పార్టీ పుంజుకుంది. ఆ తరువాత స్వతంత్ర దేశంగా తైవాన్‌ ప్రకటించుకుంది. తైవాన్‌ను 13 దేశాలు అధికారికంగా గుర్తిస్తున్నాయి. అయితే చైనా మాత్రం తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించొద్దని.. ఆయా దేశాలపై ఒత్తిడి తెస్తోంది. తైవాన్‌ చుట్టూ నిత్యం సైన్యాన్ని మోహరిస్తూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తోంది. చైనా సైనిక శక్తి ముందు.. తైవాన్‌ చాలా బలహీనమైనది. అయితే రంగంలోకి అమెరికా దిగడంతో ప్రపంచ దేశాల నుంచి సహాయం అందుతుందని తైవాన్ భావిస్తోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. చైనా వన్‌ పాలసీతో మరో యుద్ధం నెలకొనే అవకాశం ఉంది. దక్షిణ చైనా సముద్రంలోని నిర్మానుష్య దీవులను సైనిక స్థావరాలుగా మార్చిన డ్రాగన్‌ కంట్రీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆయా దీవుల్లో భారీగా ఆయుధాలను, యుద్ధ నౌకలను, భారీ హెలికాప్టర్లను, లేజర్‌ ఆయుధాలతో పాటు సైన్యాన్ని మోహరించింది. దీంతో దక్షిణ సముద్రంలోని తైవాన్‌, సింగపూర్‌, మలేసియా, ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పైన్‌ దేశాల్లో బీజింగ్‌ తీరుపై ఆందోళన నెలకొన్నది. చైనా ఒక్కటే ఒకవైపు ఈ ఆరు దేశాలు మరోవైపు ఉన్నాయి. చైనా సైన్యం, ఆయుధ శక్తితో పోల్చుకుంటే.. ఈ దేశాలు అత్యంత బలహీనమైనవని నిపుణులు చెబుతున్నారు. బీజింగ్‌ దాడి చేస్తే అడ్డుకోవడం ఆయా దేశాలకు ఏ మాత్రం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. ఇప్పటివరకు ఒక్క తైవాన్‌కు మాత్రమే అమెరికా అండగా ఉంటామని తేల్చి చెప్పింది. అయితే తమ పరిస్థితి ఏమిటోనని మిగతా దేశాల ఆందోళన చెందుతున్నాయి.

ఇక భారత్‌ సరిహద్దులోనూ డ్రాగన్‌ కంట్రీ దూకుడును ప్రదర్శిస్తోంది. నిత్యం రోడ్లు, వంతెనల నిర్మాణాలను చేపడుతోంది. భారీగా సైన్యాన్ని, యుద్ధ విమానాలను సరిహద్దులకు తరలిస్తోంది. తాజాగా చైనీస్‌ వైమానిక దళం 25 ఫ్రంట్‌లైన్‌ ఫైటర్లను లడక్‌ సమీపంలోని హోటాన్‌ ఎయిర్‌బేస్‌కు తరలించింది. ఇందులో జే-11, జే-20 ఫైటర్‌ జెట్లు ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఇక్కడ మిగ్‌-21 ఫైటర్‌ జెట్లు ఇక్కడ ఉండేవి. అయితే ఇప్పుటు వాటి స్థానంలో ఆధునాతన విమానాలను చైనా రంగంలోకి దింపింది. ఇటీవల సరిహద్దులో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ స్థావరాలను పటిష్ఠం చేస్తోంది. భారీ కార్యకలాపాలకు అనువుగా రన్‌వే పొడవులను పెంచుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌ కూడా అందుకు తగినట్టు చర్యలు తీసుకుంటోంది. సుఖోయ్‌-30, మిగ్‌-29, మిరాజ్‌-2000 యుద్ధ విమానాలను ఫార్వర్డ్‌ ఎయిర్‌ బేస్‌కు తరలించింది.

మొత్తంగా చైనా సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. పలు భూభాగాలను తనలో కలుపుకునేందుకు తహతహలాడుతోంది. ఈ క్రమంలో సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతోంది. దక్షిణ సముద్రంలోని దేశాలు చిన్నవి సైనిక శక్తి కూడా అంతంతే కానీ భారత్‌ వంటి దేశాలతో యుద్ధానికి సాహసించకపోయినా.. ఉద్రిక్త పరిస్థితులను మాత్రం సృష్టిస్తోంది.

Tags:    

Similar News