India's Digital War on China : డ్రాగన్‌పై డిజిటల్‌ యుద్ధం.. వేలకోట్ల ఆదాయం కోల్పోనున్న చైనా కంపెనీలు

Update: 2020-07-01 06:00 GMT

India's digital war on china : డ్రాగన్‌ కంట్రీకి దీటుగా బదులిచ్చేందుకు సిద్ధమైంది భారత్‌. సరిహద్దుల్లో భద్రతను పెంచటమే కాకుండా అటు ఆర్థిక యుద్ధానికి కూడా తెరలేపింది. చైనా యాప్‌లపై నిషేధిస్తూ భారత ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

చైనా యాప్‌లపై భారత్‌ కొరడా ఝళిపించింది. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. చైనా ఆధారితంగా తయారైన యాప్‌లను దేశ ప్రజలు వాడొద్దని సూచించింది. ఈ యాప్‌ల ద్వారా యూజర్ల సమాచారం సేకరిస్తున్నారంటూ చైనాకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధించిన యాప్‌లలో షేరిట్‌, యూసీ బ్రౌజర్‌, బైడు మ్యాప్‌, ఎంఐ కమ్యూనిటీ, క్లబ్‌ ఫ్యాక్టరీ యాప్‌లు కూడా ఉన్నాయి.

గాల్వన్ ఘటన తర్వాత చైనాతో ఓవైపు శాంతియుతంగా చర్చలు జరుపుతూనే మరోవైపు, చైనా ఆగడాలను ఎలా ఎదుర్కునేందుకు వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది కేంద్రం‌. అందులో భాగంగానే, పలు చైనా ఉత్పత్తులు, యాప్‌ల‌పై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

టిక్ టాక్ కు ఇండియాలో ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. 75శాతం మంది ఫోన్లలో టిక్‌ టాక్‌ యాప్ ఉందంటే దాని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అలాంటి యాప్ ను ఇప్పుడు ఇండియా బ్యాన్ చేసింది. అయితే, గాల్వన్ ఘటన తర్వాత చైనా వస్తువులు, యాప్స్‌‌పై దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. చైనా వస్తువులను, యాప్‌లను వినియోగించొద్దని, వాటిని బ్యాన్‌ చేయాలని డిమాండ్లు వచ్చాయి. ఆ తర్వాత టిక్ టాక్ రేటింగ్ దారుణంగా పడిపోయింది.

గూగుల్ ప్లే స్టోర్ లో టిక్ టాక్ యాప్ రేటింగ్ ఫోర్ ప్లస్ ఉండేది. అయితే, గాల్వన్ ఘటన తర్వాత ఒకటికి పడిపోయింది. ఇక, ఇప్పుడు పూర్తిగా బ్లాక్ చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోవడంతో వేల కోట్ల సంపాదన చైనా కంపెనీకి వెళ్లకుండా అడ్డుకోవడమే అంటున్నారు. మొత్తమ్మీద మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News