Canada: ధూమపానంపై కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం

Canada: ప్యాక్‌తో పాటు సిగరేట్ పైనా హెచ్చరికలు

Update: 2022-06-14 13:00 GMT

Canada: ధూమపానంపై కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం

Canada: పొగాకు ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రభుత్వాలు హెచ్చరికలను ముద్రించినా ధూమపానం మాత్రం ఆగడం లేదు. సిగరెట్‌ ప్యాకింగ్‌పై క్యాన్సర్ ప్రభావితమైన వ్యక్తుల ఫొటోలు ఉన్నా పట్టించుకోవడం లేదు. ప్యాకెట్‌లోని సిగరెట్లను తీసుకుని దాన్ని పక్కన పడేస్తుంటారు. పొగరాయుళ్లు స్టైల్‌గా పొగలను గుప్పు గుప్పున వదులతూ ఎంజాయ్ చేస్తుంటారు. హెచ్చరికలు చేస్తున్నా పొగరాయుళ్లు మాత్రం వదలకపోవడంతో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సిగరెట్‌ ప్యాకెట్లతో పాటు ప్రతి సిగరెట్‌ మీదా హెచ్చరికలను ముద్రించాలని నిర్ణయించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇలాంటి నిర్ణయాన్ని ఏ దేశమూ తీసుకోలేదు. సిగరేట్‌ మీద హెచ్చరికలను ముద్రించే తొలి దేశంగా కెనడా రికార్డులకెక్కనున్నది.

ప్రస్తుతం సిగరెట్‌ ప్యాక్‌ల మీద వస్తున్న హెచ్చరిక సందేశాలను జనం పట్టించుకోవడం లేదని కెనడా ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో పొగరాయుళ్లను హెచ్చరించేందుకు ఒక్కో సిగరెట్ మీద హెచ్చరికను ముద్రించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇలా చేస్తే యువతతో సహా ప్రజలందరికీ చేరువవుతాయని తెలిపింది. చాలా సందర్భాల్లో ఒక్క సిగరెట్‌ను తీసుకోవడం ద్వారా ప్యాకింగ్ మీద ఉన్న హెచ్చరిక పక్కకు వెళ్లిపోతోంది. అందుకే సిగరెట్‌ మీదే ముద్రించాలనుకుంటున్నామంటూ ఆరోగ్యశాఖ తెలిపింది. అందుకు సంబంధించిన మార్పులపై రెండ్రోజుల్లో చర్చలు జరపనున్నట్టు తెలిపింది.

2023 జూన్‌ నాటికి తాజా మార్పులకు శ్రీకారం చుట్టే దిశగా కెనడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అలాగే 'ప్రతి పఫ్‌లోనూ విషం ఉంది' అనే హెచ్చరికను ఉంచాలని ఆలోచన చస్తోంది. ఈ తరహా విధానం ఏ దేశం అమలు చేయలేదని కెనడా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ హెచ్చరికను ఎవరూ తోసిపుచ్చలేరని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రతి పొగరాయుడికి సిగరేట్‌ మీద ఈ హెచ్చరిక కనిపిస్తుందని స్పష్టం చేసింది. కెనడా ఆరోగ్యశాఖ నివేధికల ప్రకారం 10 శాతం మంది కెనడియన్లు ధూమపానం చేస్తున్నారు. ఈ పొగ తాగే రేటు 2035 నాటికి సగానికి తగ్గించాలని ఆ దేశం చూస్తోంది. 

Tags:    

Similar News