Boris Johnson: అవిశ్వాస పరీక్షలో గట్టెక్కిన బ్రిటన్ ప్రధాని
Boris Johnson: బోరిస్‌కు అనుకూలంగా 211 ఓట్లు, వ్యతిరేకంగా 148 ఓట్లు
Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అవిశ్వాస పరీక్షలో నెగ్గారు. సొంత పార్టీ నేతలు తెచ్చిన సవాల్‌ను బోరిస్ సమర్థంగా ఎదుర్కొన్నారు. విశ్వాస ఓటింగ్‌లో 211 మంది ఎంపీల మద్దతును పొందారు. 148 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు బోరిస్ జాన్సన్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒక్క ఓటు తేడాతో అయినా బోరిస్ ఓడిపోతారని భావించిన ప్రతిపక్షాలకు నిరాశే మిగిలింది. అయితే ఓటింగ్ రోజు హైడ్రామా నడిచింది. పార్టీ గేట్ వ్యవహారంలో ఆరోపణలు వచ్చినప్పటికీ తనపై నమ్మకం ఉంచాలని, అనుకూలంగా ఓటు వేయాలని సొంత పార్టీ నేతలను బోరిస్ వేడుకున్నారు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నిర్వహించిన ఓటింగ్‌లో విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే బోరిస్‌కు 180 మంది సొంత పార్టీ నేతల మద్దతు అవసరం అయితే 211 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు. అవిశ్వాసంలో బోరిస్ జాన్సన్ విజయం సాధించినందు వల్ల కన్జర్వేటివ్ పార్టీ నిబంధనలు ప్రకారం మరో ఏడాది పాటు ఆయనపై అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి వీల్లేదు.
యూకే పీఎం బోరిస్ జాన్సన్ రెండేళ్లుగా పార్టీ గేట్ కుంభకోణాన్ని ఎదుర్కొంటున్నారు. దేశమంతటా కరోనా ఆంక్షలు అమలు అవుతున్నప్పుడు ఆయన తన అధికారిక నివాసంలో రహస్యంగా పార్టీల్లో పాల్గొన్నాడని, గ్యాదరింగ్స్ నిర్వహించాడన్న ఆరోపణలు దుమారం రేపాయి. ఈ విషయమై ప్రతిపక్షం సహా సొంత పార్టీ నేతల్లోనూ తీవ్ర అసహనం నెలకొంది. ఈ నేపథ్యంలోనే కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు కొందరు బోరిస్ జాన్సన్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. జాన్సన్ తన అబద్ధాలతో పార్లమెంటును తప్పుదారి పట్టించారని మండిపడ్డారు. సొంత పార్టీకి చెందిన 40 మంది సభ్యులు బోరిస్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అందులో బోరిస్ విజయం సాధించారు.