రిషి సునాక్ తప్ప ఎవరైనా ఓకే.. బ్రిటన్ ప్రధాని ఎన్నికపై బోరిస్ వ్యూహం?!
Boris Johnson: తనను పదవి నుంచి దించేందుకు అతడే కారణమనని బ్రిటన్ తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్ పగతో రగిలిపోతున్నారా?
Boris Johnson: తనను పదవి నుంచి దించేందుకు అతడే కారణమనని బ్రిటన్ తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్ పగతో రగిలిపోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బ్రిగ్జిట్ ఉద్యంలో తనకు మద్దతు ఇచ్చిన ఆ వ్యక్తి.. ఇప్పుడు తన ఎగ్జిట్‌కు కారణమని ఆగ్రహంగా ఉన్నారు. ఆ వ్యక్తి తనకు ద్రోహం చేశారని అతడి కారణంగానే పార్టీ నేతలు కూడా దూరమయ్యారని బోరిస్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆ కారణంగా ప్రధాని అభ్యర్థి ఎన్నికల్లో అతడికి తప్ప ఎవరికైనా ఓటేయాలని పార్టీలో తన అనుచరులకు, సహచర ఎంపీలకు బోరిస్ జాన్సన్ సూచిస్తున్నారట ఇప్పుడు బ్రిటన్‌లో ఆ వ్యక్తి వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది.
2015లో ఐరోపా నుంచి బ్రిటన్ బయటకు వచ్చేయాలన్న బ్రిగ్జిట్ డిమాండ్ ఊపందుకుంది. యునైటెడ్ కింగ్ డమ్‌లో అధికార పార్టీ కర్జర్వేటివ్స్‌లో కొందరు దీనికి వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయినా బోరిస్ జాన్సన్ మాత్రం పట్టువదలకుండా బ్రిగ్జిట్ కోసం ఉద్యమించారు. ఆ సమయంలో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన రిచ్‌మండ్ నియోజకవర్గం యువ ఎంపీ, భారత సంతతికి చెందిన రిషి సునాక్ బోరిస్‌కు అండగా నిలిచారు. బ్రిగ్జిట్ ఉద్యమానికి ప్రజల నుంచి భారీగా మద్దతు లభించింది. అటు బోరిస్ జాన్సన్, ఇటు రిషి సునక్ 2019 ఎన్నికల్లో మళ్లీ బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో అడుగుపెట్టారు. బ్రిగ్జిట్‌లో తనకు తోడుగా నిలిచిన రిషి సునక్‌కు ప్రధాని బాధ్యతలు చేపట్టిన బోరిస్ జాన్సన్ పట్టుబట్టి మరీ ఆర్థికశాఖ మంత్రిగా చేశారు. దీంతో రిషి ఒక్కసారిగా వార్తల్లో నిలిచిపోయారు. ఆ తరువాత కూడా జాన్సన్‌కు అండగా నిలిచాడు సునక్ ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి మధ్య విభేదాలకు కారణం బోరిస్ కుంభకోణాలే బోరిస్ ప్రతిసారీ వివాదాల బారిన పడడం వాటిని కప్పిపుచ్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు.
2020 కరోనా ఉధృతి నేపథ్యంలో యూకేలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ సమయంలో ప్రధాని అధికారిక నివాసం 10 డౌన్‌స్ట్రీట్‌లో బర్త్‌డే సందర్భంగా ప్రధాని తన సహచర ఎంపీలకు మద్యం విందు ఇచ్చాడు. ఇది బ్రిటన్‌లో తీవ్ర వివాదంగా మారింది. ఈ విందుకు రిషి సునక్ కూడా హాజరయ్యారు. ప్రజలు కష్టాల్లో ఉంటే మీరు విందులు చేసుకుంటారా? అంటూ ప్రతిపక్షాలు నిలదీశాయి. పార్టీగేట్‌గా పిలిచే ఈ కుంభకోణం బోరిస్ జాన్సన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీనిపైనే ఆయన అవిశ్వాస తీర్మానాన్ని కూడా ఎదుర్కొన్నారు. పార్టీగేట్ వ్యవహారంలో పార్లమెంట్‌లో బోరిస్ జాన్సన్ క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో రిషి సునక్ సమావేశానికి రాలేదు. ప్రధానిపై వస్తున్న ఆరోపణలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే రిషీ సభకు గైర్హాజరైనట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అప్పటి నుంచే బోరిస్‌కు, రిషి సునక్‌కు మధ్య దూరం పెరిగినట్టు చెబుతున్నారు.
ఆ తరువాత లైంగిక వేదింపుల కేసును ఎదుర్కొంటున్న కన్జర్వేటివ్ ఎంపీ క్రిస్ పిన్చర్‌కు డిప్యూటీ విఫ్ పదవి బోరిస్ ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. ఎంపీ క్రిస్ పిన్చర్ ఎంపీ పదవికి రాజీనామా చేసినా అప్పటికే నష్టం జరిగిపోయింది. విపక్షాలు, అటు ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేశారు. దీంతో బోరిస్‌పై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కన్జర్వేటివ్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని వెంటనే బోరిస్ రాజీనామా చేయాలని పార్టీకి చెందిన ఎంపీలు ఒత్తిడి తెచ్చారు. ఈ సమయంలోనే రిషి సునక్ అందరికంటే ఓ అడుగు ముందుకేసి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆరోగ్యశాఖ మంత్రి పదవికి సాజిద్ జావెద్ రాజీనామా చేశారు. దీంతో వరుసగా 50 మందికి మేర పదవులకు రాజీనామా చేశారు. దీంతో గత్యంతరం లేక ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి రిషి సునక్‌పై బోరిస్ రగిలిపోతున్నారు. మొదట మంత్రిపదవికి రాజీనామా చేసి తనపై ఒత్తిడి పెంచినట్టు బోరిస్ కోపంగా ఉన్నారు. అవమానకర రీతిలో తాను నిష్క్రమించడానికి సునకే కారణమంటూ మండిపడుతున్నారు.
తాజాగా బ్రిటన్ ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపికకు ఓటింగ్ జరుగుతోంది. ప్రధాని అభ్యర్థిగా రిషి సునక్ కూడా పోటీ చేస్తున్నారు. అయితే తాత్కాలిక ప్రధానిగా వ్యహరిస్తున్న బోరిస్ జాన్సన్ ఇప్పుడు రిషికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారట. తనను పదవిని నుంచి దించిన రిషికి మాత్రం ప్రధానమంత్రి పదవి దక్కకుండా చేయడానికి పావులు కదుపుతున్నారట. ప్రధాని అభ్యర్థులు ఎవరికైనా ఓటేయండి అతడికి మాత్రం వేయొద్దంటూ తన సహచరులు, అనుచరులకు బోరిస్ జాన్సన్ సూచిస్తున్నట్టు బ్రిటన్‌లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల గురించి తెలిసిన ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా ఇప్పుడు ఇదే మాట్లాడుకుంటున్నారట. కష్ట సమయంలో తనకు అండగా ఉన్న లిజ్ ట్రస్, జాకబ్ రీస్, డోరిస్, పెన్నీ మోర్డాంట్‌లో ఎవరికి మద్దతు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చెబుతున్నారట.
10 డౌన్ స్ట్రీట్ రిషిని వ్యక్తిగతంగా ద్వేషిస్తోందని బోరిస్‌ను పదవి నుంచి దించేందుకు సునక్ కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజాగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే సునక్‌ను ఓడించేందుకు బోరిస్ పట్టుదలతో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన సన్నిహితులు ఖండిస్తున్నారు. అయితే రిషి తనకు ద్రోహం చేశారన్న బాధ మాత్రం బోరిస్‌కు ఉందని చెబుతున్నారు.