Jeff Bezos: నాసా'కు బ్లూ ఆరిజిన్ వ్యవస్థాపకుడు బెజోస్ బంపర్ ఆఫర్
Jeff Bezos: హ్యూమన్ ల్యాండింగ్ సిస్టంను తయారు చేస్తామని వెల్లడి
Jeff Bezos: అమెజాన్, బ్లూ ఆరిజిన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 'నాసా'కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. 2024లో మూన్ యాత్రకు కావాల్సిన హ్యూమన్ ల్యాండింగ్ సిస్టంను బ్లూ ఆరిజిన్ ద్వారా నిర్మిస్తామని వెల్లడించారు. అయితే, నాసా ఇప్పటికే 'స్పేస్ ఎక్స్'తో 2.9 బిలియన్ డాలర్లకు ఏప్రిల్‌లోనే డీల్ కుదుర్చుకుంది. కానీ, బెజోస్ మాత్రం ఈ ఒప్పందాన్ని తమకు అప్పగిస్తే రెండు బిలియన్ డాలర్ల డిస్కౌంట్ ఇస్తామని కళ్లుచెదిరే ఆఫర్ ప్రకటించారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 15వేల కోట్ల డిస్కౌంట్ అన్నమాట.
నాసాతో ఈ ఒప్పందాన్ని బెజోస్ ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. భవిష్యత్‌లో అంతరిక్షయాన రంగంలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ స్పేస్ టూర్ ట్రిలియన్ డాలర్ల వ్యాపారంగా అభివృద్ధి చెందే అవకాశముంది. దీంతో నాసా ప్రాజెక్టును దక్కించుకుంటే ఈ రంగంపై పట్టు సాధించవచ్చన్నది బెజోస్ ప్లాన్.
ఇప్పటికే నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్‌కు బెజోస్ ఓ లేఖ కూడా రాశారు. తన ప్రపోజల్ నిధుల కొరతను తీరుస్తుందని లేఖలో పేర్కొన్నారట. పైగా మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నట్లు బెజోస్ లేఖలో వెల్లడించారు. తాము తయారు చేయబోయే 'బ్లూ మూన్ ల్యాండర్' లిక్విడ్ హైడ్రోజన్‌తో నడిచేలా తయారుచేయనున్నట్లు తెలిపారు. ఈ ల్యాండర్‌ను తమ సొంత ఖర్చుతో భూ కక్ష్యలో పరీక్షిస్తామని స్పష్టం చేశారు. మరి బెజోస్ ప్రపోజల్‌పై నాసా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.